వ్యవసాయంలో లాభాలు పొందాలంటే కష్టజీవి శ్రమకు తోడు అదృష్టం ఉండాలి. రెండో కారు వరి పంట రైతుకు కలసొచ్చింది. ఎన్నో ఆశలతో రబీలో రైతు వరి సాగు చేయగా వరుణుడు కరుణించగా.. పుడమి తల్లి దీవించింది. చీడపీడల బారిన పడకుండా పంటను రక్షించుకుంటూ.. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకుంటూ వచ్చాడు. నూర్పిళ్లు పూర్తయి ధాన్యాన్ని ఇంటికి చేర్చుతున్నాడు. ఈ క్రమంలో మద్దతు ధర ఊరిస్తుండటంతో రైతు మోములో సంతోషం వెల్లివిరిస్తోంది.
కోవెలకుంట్ల: ఖరీఫ్ సీజన్‌లో తుఫాన్ల ప్రభావంతో భారీ వర్షాలు, చీడపీడలు, వాతావరణం అనుకూలించకపోవడంతో వరి రైతులు నష్టాలు చవిచూశారు. ఆ నష్టాన్ని రబీసీజన్‌లో పూడ్చుకోవాలని భావించిన అన్నదాతకు రెండు కారు పంట కలిసోచ్చింది. పంట చేతికంది దిగుబడులు ఆశాజనకంగా మారటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది రబీలో ఎండ కారు పంటగా 48 వేల ఎకరాల్లో 555, ఎంటీయూ 1010, ఆర్‌ఎన్‌ఆర్ 15,048 రకాలకు చెందిన వరి సాగు చేయాల్సి ఉండగా బోర్లు, బావులు, చెరువులు, కేసీకెనాల్, కుందూనది, పాలేరు, రిజర్వాయర్ల పరిధిలో 50,791 ఎకరాల్లో సాగైంది.
ఇందులో బండిఆత్మకూరు మండలంలో అత్యధికంగా 10,609 ఎకరాలు, పాణ్యంలో 6,674, రుద్రవరం 6,202, మహానందిలో 5,358, ఆళ్లగడ్డలో 4,949, నంద్యాలలో 3,105, శిరివెళ్లలో 2,788, గడివేముల మండలంలో 2,078 ఎకరాల్లో సాగు చేశారు. 120 రోజుల పంటకాలం కలిగిన వరిలో ఇప్పటి వరకు 95 శాతం మేర కోత, నూర్పిడి పనులు పూర్తి కాగా మరో వారం రోజుల్లో పనులన్నీ పూర్తి కానున్నాయి.
పెరిగిన పెట్టుబడులు
జిల్లాలోని ఆయా మండలాల్లో రబీ వరిసాగులో ఈ ఏడాది పెట్టుబడులు పెరిగాయి. రసాయన ఎరువులు, నారు, క్రిమి సంహారక మందులు, కూలీలు, కోత, నూర్పిడి, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 20వేలు వరకు వెచ్చించారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అధిక తేమ శాతం కారణంగా వరిని కాండం తొలుచు పురుగు ఆశించి నష్టం చేకూర్చింది.
పురుగు బారి నుంచి పైరును కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. రెండు దఫాలు అదనంగా క్రిమి సంహారక మందు పిచికారీ చేసి పురుగు బారి నుంచి పంటను రక్షించుకున్నారు. పురుగు కారణంగా ఎకరాకు రూ. 2వేల నుంచి రూ. 3వేలు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. పురుగు తీవ్రత లేకుంటే మరో ఐదు బస్తాల దిగుడులు వచ్చేవని రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు 35 నుంచి 40 బస్తాలు దిగుబడులు వచ్చాయి. ఖరీఫ్ సీజన్‌తో పోల్చుకుంటే రబీలో దిగుబడులు ఆశాజనకంగా మారటంతో రైతులు ఊరట చెందుతున్నారు.
ఆశలు రేకెత్తిస్తున్న మద్దతు ధర
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, కల్తీలేని రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులతోపాటు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. వీటితోపాటు అన్ని రకాల పంటలకు మద్దతు ధర కల్పిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో పండిన కర్నూలు, నంద్యాల సోనా రకం వడ్లు బస్తా రూ. 1,850 వరకు ధర పలికాయి. రబీలో పండిన ఎండకారు వడ్లు బస్తా మార్కెట్‌లో రూ. 1,200 నుంచి రూ. 1,300 వరకు ఉంది. ఈ ధరకు ధాన్యం విక్రయిస్తే పెట్టుడులు పోనూ ఎకరాకు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఆదాయం చేకూరనుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరి సాగుతో ఖరీఫ్ సీజన్‌లో నష్టపోయినా రబీలో వాతావరణం అనుకూలంగా మారి దిగుబడులు ఆశాజనకంగా లభించి గిట్టుబాటు ధర ఉండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఎకరాకు 40 బస్తాల దిగుబడి
ఈ ఏడాది ఎండకారు పంటగా సాగు చేసిన వరి రైతులకు అనుకూలంగా మారింది. ఖరీఫ్‌లో అధిక వర్షాలతో కాస్త దిగబడులు తగ్గాయి. రబీ సీజన్‌లో సంజామల మండలంలోని ఆయా గ్రామాల్లో 683 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడులు వచ్చాయి.
–సుధాకర్‌రెడ్డి, ఏఓ, సంజామల మండలం
1.8 ఎకరాల్లో సాగు చేశా
నాకున్న 1.8 ఎకరాల్లో ఈ ఏడాది రబీ సీజన్‌లో 555 రకానికి చెందిన వరి సాగుచేశాను. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కోత, నూర్పిడికి సంబంధించి ఎకరాకు రూ. 20 వేలు పెట్టుబడి పెట్టాను. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించి మంచి దిగుబడులు సాధించాను.
– నాగభూషణం, రైతు, గిద్దలూరు, సంజామల మండలం
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
నాకున్న రెండు ఎకరాల్లో ఎండకారు వరి సాగు చేశాను. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు జరిపింది. అదే తరహాలోనే ఇప్పుడు కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలి.
–వెంకటపతి రెడ్డి రైతు, వల్లంపాడు, కోవెలకుంట్ల మండలం
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment