luck
-
కొత్త కోడలి అదృష్టం!! పెళ్లి తర్వాత రూ.25వేల కోట్ల సంపద!
అపర కుబేరుడు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్‌తో జూలై 12న అత్యంత ఘనంగా, విలాసవంతంగా జరిగింది. ఈ వివాహం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద గణనీయంగా పెరిగింది.పెళ్లికి విపరీతంగా ఖర్చు చేసినా ముఖేష్ అంబానీ సంపద మాత్రం తగ్గలేదు. అంతకు ఐదింతలు పెరిగింది. జాతీయ వార్తాసంస్థ ఆజ్‌తక్ ప్రకారం, పెళ్లి తర్వాత అంబానీ నెట్‌వర్త్ రూ.25,000 కోట్లు (3 బిలియన్ డాలర్లు) పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జూలై 5న అంబానీ నెట్‌వర్త్ 118 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. జూలై 12 నాటికి ఇది 121 బిలియన్ డాలర్లకు పెరిగింది.ఈ అసాధారణ పెరుగుదల ప్రపంచ సంపద ర్యాంకింగ్స్‌లో ముఖేష్ అంబానీ స్థానాన్ని పెంచింది. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో అంబానీ స్థానం 12 నుంచి 11వ స్థానానికి ఎగిసింది. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ కొనసాగుతున్నారు. అంబానీ నెట్‌వర్త్ పెరగడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పటిష్ట పనితీరు కారణమని చెప్పవచ్చు. పెళ్లి రోజున, రిలయన్స్ షేర్లు 1% పెరిగాయి. గత నెలలో షేర్లు 6.65% పెరిగాయి. గత ఆరు నెలల్లో 14.90% రాబడిని అందుకున్నారు. -
1996 ఢిల్లీ ఎన్నికల్లో ఏం జరిగింది? స్వతంత్రులకు పరాభవమేనా?
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అందరి దృష్టి దేశ రాజధాని ఢిల్లీలో జరిగే లోక్‌సభ ఎన్నికలపైనే నిలిచింది. 1996 ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. అది ప్రతీ ఎన్నికల్లోనూ చర్చకు వస్తుంటుంది. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిసారీ పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. కొన్ని ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య 500 దాటగా, కొన్నిసార్లు రెండు అంకెలకే పరిమితమైంది. తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో మూడు లోక్‌సభ స్థానాలున్నప్పుడు కేవలం 19 మంది అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు.1996 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు లోక్‌సభ స్థానాల్లో 523 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో 358 మంది స్వతంత్రులు కావడం విశేషం. 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు లోక్‌సభ స్థానాల్లో 168 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. 1984 ఎన్నికల్లో 189 మంది, 1989లో 237 మంది, 1991లో 501 మంది, 1996లో 523 మంది అభ్యర్థులు, 1998లో 132 మంది అభ్యర్థులు, 1999లో 97 మంది, 2004లో 129 మంది, 2009లో 160 మంది, 2014లో 150 మంది 2019లో 164 మంది ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఎప్పుడూ ప్రధాన పార్టీల అభ్యర్థులపైనే నమ్మకం పెట్టుకున్నారు. ఢిల్లీలో ఇప్పటి వరకు ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా గెలవకపోవడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల నుంచి 164 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 17 మంది అభ్యర్థులు మినహా మిగతా అభ్యర్థులందరి డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014 ఎన్నికల్లోనూ ఏడుగురు విజేతలు, ఏడుగురు ప్రత్యర్థి అభ్యర్థులు మినహా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే డిపాజిట్లు కాపాడుకోగలిగారు. -
బ్రూక్ దురదృష్టం ఆస్ట్రేలియా అదృష్టం
-
దేనికైనా అదృష్టం ఉండాలి: నిధి అగర్వాల్
సినిమా రంగంలో అదృష్టం చాలా ముఖ్యమని అంటోంది నటి నిధి అగర్వాల్. ఆకర్షణీయమైన అందం ఈమె సొంతం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయకిగా నటిస్తున్నా ఆ స్థాయిలో పెద్ద హిట్లు సాధించలేకపోతోంది. తమిళంలో జయం రవికి జంటగా భూమి, శింబు సరసన ఈశ్వరన్, ఉదయనిధి స్టాలిన్‌తో కలగతలైవన్ చిత్రాలు చేసింది. వీటిల్లో ఏది ఈ అమ్మడి కెరీర్‌కు ప్లస్ కాలేదనే చెప్పాలి. ఇటీవల నిధి అగర్వాల్ ఒక కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకున్నారు. తాను అదృష్టాన్ని నమ్ముతానని చెప్పింది. అది లేకపోతే ఎవరికి ఏదీ కుదరదని పేర్కొంది. ముఖ్యంగా సినిమా రంగంలో అదృష్టం చాలా అవసరమని చెప్పింది. ఉదాహరణకు కొన్ని కథలు వినడానికి అద్భుతంగా ఉంటాయని.. అయితే చివరికి చిత్రం వేరే విధంగా వస్తుందని పేర్కొంది. అదే విధంగా పేపర్‌పై సుమారుగా ఉన్న కథలు తెరపై చూస్తే బ్రహ్మాండంగా ఉండి ఆశ్చర్యపరుస్తాయని తెలిపింది. అందుకు కారణం 90 శాతం అదృష్టమే అని తాను భావిస్తానంది. ఇకపోతే కథలను ఆశతో ఎంపిక చేసుకునే స్థాయికి తాను చేరుకున్నానని భావించడం లేదని చెప్పింది. అయితే వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నానని, ముఖ్యంగా నాట్యానికి ప్రముఖ్యత ఉన్న కథా చిత్రంలో నటించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్నా నటన పరంగా ఎలాంటి వ్యత్యాసం లేదని అయితే వ్యాపారపరంగా చాలా తేడా ఉంటుందని నటి నిధి అగర్వాల్ పేర్కొంది. -
పారేద్దామనుకున్న టికెట్‌కు 1.6 కోట్లొచ్చాయి
వెదుకుతున్నది దొరికితే కలిగే సంతోషం మామూలుగా ఉండదు. అలాంటిది పారేద్దామనుకున్న టికెట్‌కు రూ.కోట్లు దక్కితే... ఆనందానికి అవధులుండవు. ఈ యూఎస్ మహిళ విషయంలో అది నిజమైంది. రోపర్‌కు చెందిన 60 ఏళ్ల జాక్వలిన్ లేహ్ ఓ స్టోర్ నుంచి ‘నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ’ టికెట్ హాట్‘5’ను ఐదు డాలర్లకు కొన్నది. ‘ప్రతి టికెట్‌కు అదృష్టం వరిస్తుందా’ అని భావించిన జాక్వలిన్ ఆ టికెట్‌ను పారేసినంత పనిచేసింది. ఎందుకైనా మంచిదని... చెత్తబుట్టలో వేసేముందు మరోసారి చెక్ చేసింది. అంతే... ఆమె లాటరీ టికెట్ రెండు లక్షల డాలర్లను గెలుచుకుంది. ‘‘నాకు ఇంతకుముందెప్పుడూ ఇలా జరగలేదు. పారేద్దామనుకున్న టికెట్‌కు డబ్బులు రావడం ఇంకా నమ్మశక్యంగా లేదు’’ అంటోంది జాక్వెలిన్. ట్యాక్స్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ పూర్తయ్యాక... కోటీ 20 లక్షల రూపాయలను ఇంటికి తీసుకెళ్లింది. కార్ లోన్ కట్టడంతోపాటు ఇతర అవసరాలన్నీ తీర్చేసుకుంటానని ఆనందంగా చెబుతోంది. చదవండి: మానవ హక్కుల పోరాటాలకు నోబెల్ శాంతి బహుమతి -
అదృష్టం: పేదమహిళ సుడితిరిగి లక్షాధికారిగా!
భోపాల్: అదృష్టం అందరికీ ఒకేలా ఉండదు. ఎంతో మంది ఎన్నో ఏళ్లు కష్టపడ్డా కంటపడని అదృష్టం.. ఆమెకు అనుకోకుండా కలిసొచ్చింది. రాత్రికి రాత్రే ఆమె నసీబ్‌ను మార్చేసింది. కట్టెల కోసం వెళ్లిన ఓ పేద గిరిజన మహిళకు.. అక్కడ దొరికిన వస్తువు ఒకటి లక్షాధికారిని చేసేసింది. మధ్యప్రదేశ్ వజ్రాల జోన్ అయిన పన్నా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎప్పటిలాగే బుధవారం రోజున పొయ్యి కట్టెల కోసం అడవికి బయలుదేరింది జెందా బాయి. అక్కడ ఆమె మట్టిలో కూరుకుపోయి మెరుస్తున్న ఓ రాయి దొరికింది. దానిని ఇంటికి తీసుకొచ్చి భర్తకు చూపించింది. అయితే దాని మెరుపు ఆయనకు అనుమానంగా అనిపించి.. అధికారులను సంప్రదించాడు. వాళ్లు పరీక్షించి అదొక 4.39 క్యారట్ వజ్రమని, చెప్పడంతో ఆ భార్యాభర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. డైమండ్ ఇన్స్పెక్టర్ అనుపమ్ సింగ్.. డైమండ్ డిపాజిట్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేశారు. వేలంలో అది ఫలానా ధర దక్కించుకోవడమే తరువాయి. కనీసం దాని విలువ రూ.20 లక్షల దాకా పలకవచ్చని అనుపమ్ సింగ్ అంటున్నారు. వచ్చేదాంట్లో ప్రభుత్వం తరపున రాయల్టీ, ట్యాక్సుల రూపంలో 12.5 శాతం మినహాంచుకుని.. మిగతాది జెందా బాయి కుటుంబానికి ఇచ్చేస్తారు. పన్నా జిల్లాకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే పురుషోత్తంపూర్ గ్రామం.. జెండా బాయి కుటుంబం ఉంటోంది. భర్త కూలీపనులు.. జెందా బాయి రోజూ కట్టెలు కొట్టి అమ్మగా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని నడిపించుకుంటున్నారు. ఈ క్రమంలో వజ్రం రూపంలో ఆ పేద కుటుంబానికి అదృష్టం కలిసొచ్చింది. వచ్చిన డబ్బుతో సొంతగా ఒక ఇల్లు కట్టించుకోవడంతో పాటు కూతుళ్ల పెళ్లిలకు కొంత డబ్బును డిపాజిట్ చేస్తామని చెప్తున్నారు ఆ భార్యభర్తలు. Video: A tribal woman, out gathering firewood in a forest in MP’s #Panna , found a diamond worth at least Rs 20 lakh. #MadhyaPradesh pic.twitter.com/x0dLlBYXMJ — TOI Bhopal (@TOIBhopalNews) July 29, 2022 -
వరించిన అదృష్టం...రైతు మోములో వెల్లివిరిసిన సంతోషం
వ్యవసాయంలో లాభాలు పొందాలంటే కష్టజీవి శ్రమకు తోడు అదృష్టం ఉండాలి. రెండో కారు వరి పంట రైతుకు కలసొచ్చింది. ఎన్నో ఆశలతో రబీలో రైతు వరి సాగు చేయగా వరుణుడు కరుణించగా.. పుడమి తల్లి దీవించింది. చీడపీడల బారిన పడకుండా పంటను రక్షించుకుంటూ.. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకుంటూ వచ్చాడు. నూర్పిళ్లు పూర్తయి ధాన్యాన్ని ఇంటికి చేర్చుతున్నాడు. ఈ క్రమంలో మద్దతు ధర ఊరిస్తుండటంతో రైతు మోములో సంతోషం వెల్లివిరిస్తోంది. కోవెలకుంట్ల: ఖరీఫ్ సీజన్లో తుఫాన్ల ప్రభావంతో భారీ వర్షాలు, చీడపీడలు, వాతావరణం అనుకూలించకపోవడంతో వరి రైతులు నష్టాలు చవిచూశారు. ఆ నష్టాన్ని రబీసీజన్‌లో పూడ్చుకోవాలని భావించిన అన్నదాతకు రెండు కారు పంట కలిసోచ్చింది. పంట చేతికంది దిగుబడులు ఆశాజనకంగా మారటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది రబీలో ఎండ కారు పంటగా 48 వేల ఎకరాల్లో 555, ఎంటీయూ 1010, ఆర్ఎన్ఆర్ 15,048 రకాలకు చెందిన వరి సాగు చేయాల్సి ఉండగా బోర్లు, బావులు, చెరువులు, కేసీకెనాల్, కుందూనది, పాలేరు, రిజర్వాయర్ల పరిధిలో 50,791 ఎకరాల్లో సాగైంది. ఇందులో బండిఆత్మకూరు మండలంలో అత్యధికంగా 10,609 ఎకరాలు, పాణ్యంలో 6,674, రుద్రవరం 6,202, మహానందిలో 5,358, ఆళ్లగడ్డలో 4,949, నంద్యాలలో 3,105, శిరివెళ్లలో 2,788, గడివేముల మండలంలో 2,078 ఎకరాల్లో సాగు చేశారు. 120 రోజుల పంటకాలం కలిగిన వరిలో ఇప్పటి వరకు 95 శాతం మేర కోత, నూర్పిడి పనులు పూర్తి కాగా మరో వారం రోజుల్లో పనులన్నీ పూర్తి కానున్నాయి. పెరిగిన పెట్టుబడులు జిల్లాలోని ఆయా మండలాల్లో రబీ వరిసాగులో ఈ ఏడాది పెట్టుబడులు పెరిగాయి. రసాయన ఎరువులు, నారు, క్రిమి సంహారక మందులు, కూలీలు, కోత, నూర్పిడి, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 20వేలు వరకు వెచ్చించారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అధిక తేమ శాతం కారణంగా వరిని కాండం తొలుచు పురుగు ఆశించి నష్టం చేకూర్చింది. పురుగు బారి నుంచి పైరును కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. రెండు దఫాలు అదనంగా క్రిమి సంహారక మందు పిచికారీ చేసి పురుగు బారి నుంచి పంటను రక్షించుకున్నారు. పురుగు కారణంగా ఎకరాకు రూ. 2వేల నుంచి రూ. 3వేలు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. పురుగు తీవ్రత లేకుంటే మరో ఐదు బస్తాల దిగుడులు వచ్చేవని రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు 35 నుంచి 40 బస్తాలు దిగుబడులు వచ్చాయి. ఖరీఫ్ సీజన్‌తో పోల్చుకుంటే రబీలో దిగుబడులు ఆశాజనకంగా మారటంతో రైతులు ఊరట చెందుతున్నారు. ఆశలు రేకెత్తిస్తున్న మద్దతు ధర వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, కల్తీలేని రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులతోపాటు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. వీటితోపాటు అన్ని రకాల పంటలకు మద్దతు ధర కల్పిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో పండిన కర్నూలు, నంద్యాల సోనా రకం వడ్లు బస్తా రూ. 1,850 వరకు ధర పలికాయి. రబీలో పండిన ఎండకారు వడ్లు బస్తా మార్కెట్లో రూ. 1,200 నుంచి రూ. 1,300 వరకు ఉంది. ఈ ధరకు ధాన్యం విక్రయిస్తే పెట్టుడులు పోనూ ఎకరాకు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఆదాయం చేకూరనుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరి సాగుతో ఖరీఫ్ సీజన్లో నష్టపోయినా రబీలో వాతావరణం అనుకూలంగా మారి దిగుబడులు ఆశాజనకంగా లభించి గిట్టుబాటు ధర ఉండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎకరాకు 40 బస్తాల దిగుబడి ఈ ఏడాది ఎండకారు పంటగా సాగు చేసిన వరి రైతులకు అనుకూలంగా మారింది. ఖరీఫ్‌లో అధిక వర్షాలతో కాస్త దిగబడులు తగ్గాయి. రబీ సీజన్లో సంజామల మండలంలోని ఆయా గ్రామాల్లో 683 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడులు వచ్చాయి. –సుధాకర్‌రెడ్డి, ఏఓ, సంజామల మండలం 1.8 ఎకరాల్లో సాగు చేశా నాకున్న 1.8 ఎకరాల్లో ఈ ఏడాది రబీ సీజన్లో 555 రకానికి చెందిన వరి సాగుచేశాను. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కోత, నూర్పిడికి సంబంధించి ఎకరాకు రూ. 20 వేలు పెట్టుబడి పెట్టాను. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించి మంచి దిగుబడులు సాధించాను. – నాగభూషణం, రైతు, గిద్దలూరు, సంజామల మండలం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి నాకున్న రెండు ఎకరాల్లో ఎండకారు వరి సాగు చేశాను. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు జరిపింది. అదే తరహాలోనే ఇప్పుడు కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలి. –వెంకటపతి రెడ్డి రైతు, వల్లంపాడు, కోవెలకుంట్ల మండలం (చదవండి: -
పేద రైతు అదృష్టం.. లక్షలు విలువ చేసే వజ్రం దొరికింది
అదృష్టం మెరిసి.. ఓ రైతు జీవితం రాత్రికి రాత్రే వెలుగులతో నిండిపోయింది. పేద రైతు కాస్త లక్షాధికారి హోదా దక్కించుకున్నాడు. కానీ, దాని వెనుక మూడు నెలల కష్టం దాగుంది. లీజుకు తీసుకున్న భూమిలో అత్యంత నాణ్యమైన వజ్రం లభించింది ఆయనకి. వేలంలో ఈ వజ్రానికి కనీసం రూ. 50 లక్షల ధర పలికే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రతాప్ సింగ్ అనే రైతు ఓ భూమిని లీజుకు తీసుకుని మూడు నెలలుగా వజ్రాల కోసం తవ్వుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయనకి 11.88 క్యారెట్ల వజ్రం దొరికింది. ఈ విషయాన్ని వజ్రాల కార్యాలయం అధికారి రవి పటేల్ తెలిపారు. ఈ వజ్రం ఎంతో నాణ్యంగా ఉందని అధికారులు.. ప్రతాప్‌కు శుభవార్త చెప్పారు. వజ్రాలకు పేరుగాంచిన మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో జరిగిందీ ఘటన. మూడు నెలల కష్టానికి ప్రతిఫలం దక్కిన రైతు ప్రతాప్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. తనకు దొరికిన వజ్రాన్ని డైమండ్ కార్యాలయంలో అప్పగించానని, వేలంలో వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం పెట్టుకుంటానని పేర్కొన్నాడు. అలాగే, తన పిల్లల చదువుల కోసం కొంత ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చాడు. ఏ విషయంలో అయినా సరే ప్రయత్నిస్తే.. విజయం దక్కుతుంది అనడానికి తన ప్రయత్నమే ఉదాహరణ అని అంటున్నాడాయన. ఈ వజ్రాన్ని వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్ములో రాయల్టీ, పన్నులు మినహాయించుకుని మిగతా మొత్తాన్ని ప్రభుత్వం రైతుకు అందజేయనుంది. చదవండి: చీకట్లు కమ్మేశాయి.. అయినా ఆమే గెలిచింది -
అదృష్టానికి అడ్డంగా దొరికాడు.. చేపల కోసం వల వేస్తే ఏకంగా..
అదృష్టం ఏ రూపాన వస్తుందో ఎవరికీ తెలియదు. అలా ఓ సారి వచ్చిన చాలు దెబ్బకు కోటీశ్వరులుగా మారిన వాళ్లు ఉన్నారు. తాజాగా ఓ జాలరీకి కూడా ఇలాంటి అదృష్టమే వరించింది. వివరాల్లోకి వెళితే.. ఓ మత్స్యకారుడు ఎప్పటిలానే సముద్రంలో వేటకి వెళ్లాడు. కొంత దూరం వెళ్లాక చేపల కోసం వల వేసి ఎదురుచూస్తున్నాడు. కాసేపు తరువాత తాను విసిరిన వలలో ఏదో చిక్కుకున్నట్లు అనిపించింది. అదేమిటో చూడాలని వలను లాగడానికి ప్రయత్నించాడు. అయితే అది కాస్త బరువుగా ఉండడంతో అంత సులువుగా రాలేదు. చివరికి ఎలాగో ఒకలా వలను పైకి లాగగా అందులో చాలా పెట్టెలు ఉన్న విషయాన్ని గ్రహించాడు. అలాగే ఆ పెట్టెలపై ఆపిల్ లోగో ఉంది. మొదట్లో ఆ పెట్టె ఖాళీ అయ్యుంటుందని భావించినప్పటికీ, దాన్ని తెరిచే చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ బాక్సులన్నీ యాపిల్ ఉత్పత్తులతో నిండిపోయాయి. అందులో చాలా ఐఫోన్, మ్యాక్బుక్లు ఉన్నాయి. వాటి విలువ లక్షల్లో ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే అతనికో చిన్న నిధి దొరికినట్లుగా భావించాడు. అయితే నీటిలో ఉన్న కారణంగా ఫోన్, మ్యాక్‌బుక్ పాడై ఉండొచ్చని అనుకున్నప్పటికీ అలా ఏం జరగలేదు. అందులో కొన్ని ఫోన్లను తెరిచి చూడగా అవి బాగానే పనిచేస్తున్నాయి. ఎందుకుంటే ఐఫోన్ వాటర్‌ప్రూఫ్ కనుక అవి నీటిలో ఉన్న అవి పాడైపోలేదు. మత్స్యకారుడు ఈ ఘటనను వీడియో తీసి టిక్‌టాక్‌లో అప్లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు పబ్లిసిటీ కోసమే ఈ బాక్సులను తానే మొదట విసిరాడని, తర్వాత అవి దొరికనట్లుగా సృష్టించాడని పలువురు వాపోతున్నారు. కొందరు లక్కీ బాయ్ అంటూ కామెంట్ పెట్టారు. చదవండి: బాప్రే! 14 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం... ఐతే ఆ ఇద్దరు...!! షాకింగ్ వీడియో -
ఏమా అదృష్టం..! 8 కోట్ల లాటరీ పోయి దొరికింది
వాషింగ్టన్: లాటరీ తగలడం మమూలు విషయం కాదు. వేలల్లో, లక్షల్లో ఉండే పోటీ దారుల్లో మనకు అదృష్టం వరించినట్టు. ముఖ్యంగా చిన్నా చితకా లాటరీ అయితే, విశేషం ఏమీ ఉండదు. కానీ కోట్ల రూపాయల లాటరీ తగలడం మాత్రం పెద్ద విశేషమే. అయితే, ఆ తగిలిన లాటరీ టికెట్ ఎక్కడో పోగొట్టుకుని, తిరిగి పొందడం మాత్రం లక్కే. సరిగ్గా ఇలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. ఓ వ్యక్తి లాటరీలో 1.2 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 8.67 కోట్లు) గెలుచుకొని టికెట్ పోగొట్టుకున్నాడు. అదృష్టం బాగుండి పోయిన టికెట్ దొరికింది. వివరాల్లోకి వెళితే... అమెరికాలోని టేనస్సీ రాష్ట్రానికి చెందిన నిక్ స్లాటెన్ (31) మార్చి 10న గ్రాసరీ స్టోర్‌లో లాటరీ టికెట్ కొన్నాడు. మరుసటి రోజు ఉదయం... స్లాటెన్ తీసుకున్న టిక్కెట్టు లాటరీలో ఎంపికైంది. తాను గెలుచుకున్న లాటరీ టికెటు నగదు బహుమతిని తీసుకెళ్దామనే లోపు, నిక్ టిక్కెట్ కనిపించకుండా పోయింది. దీంతో నిక్ నిరాశలో మునిగిపోయాడు. అదృష్టం ఇలా తలుపు తట్టినట్టే తట్టి అలా వెళ్లిపోయిందని బాధపడ్డాడు. టికెట్ కోసం ఇళ్లంతా వెతికినా లాభం లేకపోయింది. కానీ అతని లక్కు కాసేపటికే కంటపడింది. పోగొట్టుకున్న లాటరీ టికెట్.. అదృష్టంకొద్ది తాను వెళ్లేదారిలో దొరికింది. దీంతో నిక్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదంతా ఒక్క రోజు వ్యవధిలోనే జరిగింది. మనది అని రాసి పెట్టి ఉండాలే గానీ, దక్కక మానదు అనేందుకు ఈ ఘటనే ఉదాహరణ. (చదవండి: అమెరికా: సూపర్ మార్కెట్లో కాల్పులు..10 మంది మృతి) -
ఉల్కాపాతం.. కోటీశ్వరుడయ్యాడు
జకర్తా: అదృష్టం ఎప్పుడు.. ఎలా.. ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. మట్టిలో మాణిక్యాలు దొరికి కోటీశ్వరులు అయిన వారిని చూశాం. కానీ ఉల్కాపాతం వల్ల కోటీశ్వరుడు అయిన వారి గురించి వినడం కానీ చూడటం కానీ ఇంతవరకు జరగలేదు కదా. తాజాగా ఈ అరుదైన సంఘటన వాస్తవ రూపం దాల్చిఇంది. ఉల్కా రాత్రికి రాత్రే ఓ వ్యక్తిని కోటీశ్వరుడిని చేసింది. ఆకాశం నుంచి ఇంటి పై కప్పు మీద 13 కోట్ల రూపాయల విలువ చేసే ఓ స్పేస్ రాక్ పడింది. దాంతో అతడి దశ తిరిగింది. వివరాలు.. జోసువా హుటగలుంగ్ అనే వ్యక్తి ఇండోనేషియా ఉత్తర సుమిత్రాలోని కోలాంగ్‌లో నివాసం ఉంటున్నాడు. శవపేటికలు తయారు చేస్తూ.. కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఇంట్లో శవపేటిక తయారు చేస్తుండగా ఇంటి పై కప్పు మీద ఏదో పడినట్లు శబ్దం వినిపించింది. ఎవరైనా తన ఇంటి మీద రాళ్లు వేస్తున్నారా ఏంటి అనే అనుమానంతో బయటకు వచ్చి చూశాడు. అతడికి అక్కడ నల్లటి ఓ రాయి కనిపించింది. చేతిలోకి తీసుకున్నప్పుడు అది ఇంకా వేడిగానే ఉంది. బాగా పరిశీలించి చూడగా అది స్పేస్ రాక్ అని అర్థం అయ్యింది అన్నాడు. (చనిపోయిన బాలిక బతికింది: గంట తర్వాత..) జోసువా మాట్లాడుతూ.. ‘ఇంటి పై కప్పు మీద పడిన ఆ ఉల్క 15 సెంటీమీటర్లు భూమిలోకి చొచ్చుకుపోయింది. ఇక దీని బరువు సుమారు 2.1కిలోగ్రాములు ఉంది. ఇది తప్పకుండా ఆకాశం నుంచే పడి ఉంటుందని నా నమ్మకం. మా ఇరుగుపొరగువారు కూడా ఇది ఉల్కే అన్నారు. ఎందుకంటే ఆకాశం నుంచి నా ఇంటికి మీదకు రాయి విసిరే అవకాశం లేదు. ఈ ఉల్కాపాతంతో నన్ను అదృష్టం వరించింది. ఇక నా జీవితంలో అన్ని సంతోషాలే ఉంటాయి. ఈ ఉల్క విలువ సుమారుగా 13 కోట్ల రూపాయలు ఉంటుంది అంటున్నారు. అంటే నా 30 ఏళ్ల జీతానికి సమానం. ఈ డబ్బులో కొంత భాగాన్ని చర్చి నిర్మాణానికి వినియోగిస్తాను’ అన్నాడు. ఇక ఈ ఉల్క క్వాలిటీ, పరిమాణాన్ని బట్టి దాని ధర నిర్ణయించబడుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక స్వచ్ఛతని బట్టి దీని విలువ గ్రాముకు 0.50-50 అమెరికన్ డాలర్లుగా ఉంటుందని తెలిపారు. ఈ అరుదైన లోహాలకు గరిష్టంగా గ్రాముకు 1000 డాలర్లు కూడా చెల్లిస్తారని తెలిపారు. (చదవండి: అదృష్టం అంటే అతనిదే, రాత్రికి రాత్రే...) ఇక జోసువాకు దొరికిన స్పేస్ రాక్ 4.5 బిలయన్ సంవత్సరాల క్రితం నాటిదని.. ఇది సీఎం1/2 కార్బోనేషియస్ కొండ్రైట్ వర్గానికి చెందిన అరుదైన స్పేస్ రాక్ అని తేలింది. ఇక దీని ధర గ్రాముకు 857 అమెరిన్ డాలర్లు పలుకుతుందని.. మొత్తం చూస్తే.. 1.85 అమెరికన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు 137437517.50 రూపాయల)విలువ చేస్తుందని తెలిపారు శాస్త్రవేత్తలు. -
25 టికెట్లు కొంటే 25 లాటరీలు గెలిచాడు
వర్జీనియా: ఒక్కసారి లాటరీ తగిలితే ఏమంటారు? అదృష్టం అంటే నీదే అని! మరి రెండు సార్లు లాటరీ గెలుస్తే? మహా అదృష్టమంటారు.. పోనీ మూడు, నాలుగోసారి కూడా గెలిస్తే.. అదృష్టానికి నిలువెత్తు రూపం, అదృష్ట దేవత నీ ఇంట్లో తిష్ట వేసిందంటూ పొగడ్తలు కురిపిస్తారు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం మాటల్లో చెప్పలేనంత లక్కీ పర్సన్. అవును, అతను ఏకంగా 25 లాటరీలు గెలుపొందాడు. లక్ లక్కలా అతుక్కున్న ఈ వ్యక్తి పేరు రేమండ్ హారింగ్టన్. ఈయన అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఓ రోజు సరదాగా బీచ్‌కు వెళ్లగా అక్కడి వేగ్నమ్ దుకాణంలో 25 డాలర్లు వెచ్చించి 25 లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. (ఉద్యోగం ఊడింది, భారీ లాటరీ తగిలింది) తీరా ఏమాత్రం లెక్క తప్పకుండా అతను కొనుగోలు చేసిన 25 టికెట్లు అన్నీ కూడా లాటరీను గెలుచుకున్నాయి. ప్రతి టికెట్‌కు 5 వేల డాలర్లు బహుమానంగా వస్తాయి. ఈ లెక్కన అతను మొత్తంగా 1,25,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 93 లక్షల 81 వేల రూపాయలు) గెలుచుకున్నాడు. దీంతో తొలుత అవాక్కయిన అతను తర్వాత సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఈ డబ్బును తన కొడుకుల విద్యకు ఖర్చు పెడతానని, తద్వారా వారికి మంచి భవిష్యత్తును అందించేందుకు ఉపయోగిస్తానంటున్నాడు. (వర్షం రూపంలో అదృష్టం: రిక్షావాలకు 50 లక్షల లాటరీ) -
అదృష్టం అంటే అతనిదే, రాత్రికి రాత్రే...
టాంజానియా: అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. టాంజానియాకి చెందిన ఒక వ్యక్తి రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు. ఏదో లాటరీ తగిలి కాదు, రెండు పెద్ద రత్నాలను విక్రయించి ధనవంతుయ్యాడు. గనులు తవ్వే పని చేసుకుంటూ బతికే లైజర్ అనే వ్యక్తికి ముంజేయి పరిమాణంలో ఉండే రెండు రత్నాల రాళ్లు దొరికాయి. వీటిలో మొదటి రత్నం బరువు 9.27 కిలోలు (20.4 పౌండ్లు) కాగా, రెండవ దాని బరువు 5.103 కిలోలు (11.25 పౌండ్లు) ఉన్నాయి. ముదురు వైలెట్-నీలం రంగులో ఉండే ఈ రత్నాలను అతని వద్ద నుంచి ఆ దేశ ప్రభుత్వం దాదాపు 7.74 బిలియన్ టాంజానియన్ షిల్లింగ్స్‌కు కొనుగోలు చేసింది. అంటే వీటి ధర భారతదేశ కరెన్సీలో 25 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. వీటిని దేశంలోని ఉత్తరాన ఉన్న టాంజానిట్ గనులలో లైజర్ కనుగొన్నారు. (తెరుచుకున్న ఈఫిల్ టవర్.. కానీ) ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి సైమన్ మ్సంజిలా మాట్లాడుతూ.. మిరేరానీలో మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి రెండు అతిపెద్ద టాంజానిట్ రత్నాలను గుర్తించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ప్రభుత్వం అతని దగ్గర నుంచి రత్నాలను కొనుగోలు చేసే కార్యక్రమాన్ని టాంజానియాలోని ఒక టీవీ ఛానెల్లో ప్రసారం చేశారు. టాంజానియా సెంట్రల్ బ్యాంక్ అతని దగ్గర నుంచి రత్నాలను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన చెక్కు అందించిన సమయంలో దేశ అధ్యక్షుడు జాన్ మాగుఫులీ స్వయంగా ఫోన్ చేసి లైవ్‌లో అభినందించారు. మైనింగ్ చేసే వారు తమ రత్నాలను, బంగారాన్ని ప్రభుత్వానికి విక్రయించడానికి టాంజానియా ప్రభుత్వం గత ఏడాది దేశవ్యాప్తంగా వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. (అక్కడ టూ వీలర్స్‌పై పూర్తి నిషేధం) -
అది నా అదృష్టం
తమిళ, తెలుగు, హిందీ భాషల్లో కథానాయికగా మంచి పేరు తెచ్చుకున్నారు శ్రుతీహాసన్. తండ్రి కమల్‌హాసన్‌కు తగ్గ తనయగా మార్కులు కొట్టేస్తూనే, సొంత అభిమానులను సంపాదించుకున్నారామె. కథానాయికగా డిఫరెంట్ క్యారెక్టర్స్‌ను ఎంచుకుంటూ ముందుకు వెళుతోన్న శ్రుతిలో మ్యూజిక్ కంపోజింగ్ టాలెంట్ కూడా ఉందని ప్రత్యేకించి చెప్పకర్లేదు. యాక్టింగ్, మ్యూజిక్వైజ్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అన్న ప్రశ్నను శ్రుతీ ముందు ఉంచితే– ‘‘మా నాన్నగారు నటించి, దర్శకత్వం వహించిన ‘హే రామ్’లో నేను ఓ గెస్ట్ రోల్ చేశాను. అయితే నటిగా అది నాకు మొదటి సినిమా అని నేను అనుకోవడంలేదు. కానీ ఆ సినిమాతో కెమెరా ముందుకు వచ్చినందుకు ఫుల్ హ్యాపీ. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం బాలీవుడ్లో ‘లక్’ మూవీ చేశాను. యాక్టర్‌గా నా తొలి మూవీ అదే. సినిమా ప్రపంచాన్ని నా కళ్లు అర్థం చేసుకుంది అప్పుడే. అందుకే ‘లక్’ని నా మొదటి సినిమాలా భావిస్తున్నాను. యాక్టర్‌గా నా జర్నీ బాగుంది. ఇక మ్యూజిక్ కంపోజింగ్ అనేది నా న్యాచురల్ ఎక్స్టెన్షన్. సాధారణంగా చాలామందిలో యాక్టింగ్ లేదా మ్యూజిక్ ఏదో ఒక టాలెంట్ మాత్రమే ఉంటుంది. కానీ ఆ రెండింటినీ నేను చేయగలుగుతుండటం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అని పేర్కొన్నారామె. ప్రస్తుతం మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ హిందీ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో హీరో విద్యుత్ జమాల్. -
నైన్.. లక్కీ సైన్
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ లక్‌ని నమ్ముతారు. అది కూడా అంకెల్లో వచ్చే అదృష్టాన్ని మాత్రమే. ఈ సూపర్ స్టార్ 9 అంకెను లక్కీగా ఫీల్ అవుతారట. ఫస్ట్ సినిమా ‘ఆనంద్‘ జూన్ 19న రిలీజ్ అయింది. 29 ఏళ్ల వయస్సులో పెళ్లి జరిగింది. అది కూడా మే 19న. ఇలా తనకు కలిసొచ్చిన అన్నింట్లో 9 ఉండే సరికి 9 అంకెను అదృష్టంగా భావించడం మొదలెట్టారట శివరాజ్ కుమార్. ప్రస్తుతం ఆయన ‘కవచ’ సినిమా చేస్తున్నారు. ఇది మలయాళంలో మోహన్‌లాల్ చేసిన ‘ఒప్పం’ సినిమాకు రీమేక్. విశేషం ఏంటంటే రీమేక్స్‌లో నటించను అని చెప్పిన ఆయన 15 ఏళ్ల తర్వాత రీమేక్ మూవీ చేయడం విశేషం. -
అదృష్టం కోసం.. ఇంట్లో నక్కపిల్ల
దొడ్డబళ్లాపురం: రోజూ అదృష్టం కలిసిరావాలంటే పొద్దున లేవగానే నక్క ఫొటో చూడండని కొందరంటుంటారు. అందుకే నక్క ఫొటోలకు ఫ్రేం కట్టి మరీ విక్రయిస్తుండడం చూస్తుంటాం.అయితే ఇక్కడో మహిళ అదృష్టాన్ని ఇంట్లోనే పెట్టేసుకోవాలనుకుందేమో, నక్కపిల్లను తీసుకువచ్చి ఇంట్లో పెంచుకుంటోంది. ఈ సంఘటన నెలమంగల తాలూకా మస్కూరులో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఒక చిన్నకారు రైతు మహిళ నక్క పిల్లను పెంచుకుంటోందని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఇంటిపై దాడిచేసి నక్కను స్వాధీనం చేసుకున్నారు. అదృష్టం వరిస్తుందని పెంచుతున్నానని, వేరే ఉద్దేశం లేదని ఆమె వేడుకోవడంతో అధికారులు కేసు నమోదు చేయకుండా వదిలేశారు. నక్కపిల్లను బన్నేరుఘట్ట నేషనల్ పార్కుకు తరలించారు. -
లక్కుండాలట!
‘బోలెడన్ని తెలివితేటలు, విపరీతమైన టాలెంటు ఉన్నంత మాత్రాన సరిపోదు. కొంచెం లక్కుండాలి’ అనే మాట ఎవరో ఒకరు అనగా వినే ఉంటారు. లేకపోతే మీలో మీరే అనుకునే ఉంటారు. ఏదో జనాంతికంగా అనుకునే మాటలకు లేదా జనాభిప్రాయంగా వినిపించే మాటలకు శాస్త్రీయ ప్రామాణికత ఏముంటుందని ప్రశ్నించే మేధావులు కూడా మనలో ఉంటారు. అయితే, తెలివితేటలు, టాలెంటుతో పాటు కొంచెం లక్కుంటేనే బతుకు పోటీలో గెలుపు దక్కుతుందనే విషయం ఇటీవల వార్విక్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో శాస్త్రీయంగా తేలింది. బిల్ గేట్స్ సహా గడచిన నాలుగు దశాబ్దాల కెరీర్లో ఘన విజయాలను సాధించిన వెయ్యిమంది వ్యక్తులపై శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం నిర్వహించారు. సుదీర్ఘమైన కెరీర్లో విజయవంతంగా నిలదొక్కుకున్న వారికి తెలివితేటలు, ప్రతిభా పాటవాలతో పాటు అదృష్టం కూడా కలిసొచ్చిందని, వారి ఘన విజయాల వెనుక అదృష్టమే ప్రధాన కారణమని తమ అధ్యయనంలో తేలినట్లు వార్విక్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఇటలీలోని సిసిలీ నగరంలో ఉన్న కటానియా వర్సిటీ పరిశోధకులు వెయ్యిమంది ‘వర్చువల్’ వ్యక్తులపై నిర్వహించిన ప్రయోగంలో కూడా అదృష్టం ముఖ్య భూమిక పోషిస్తుందని తేలడం విశేషం. -
‘మూగజీవాలకు సేవచేయడం అదృష్టం’
చేవెళ్ల: పశువుల చికిత్సకు ఉపయోగించే పరికరం ‘ట్రేవీస్‘ను సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యంలో ఉచితంగా అందజేశారు. ఈ పరికరాన్ని మండల పరిధిలోని ఇక్కారెడ్డిగూడ గ్రామంలో ఆదివారం సత్యసాయి సేవా సంస్థల యూత్ కో-ఆర్డినేటర్ వైసీ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు రాంకుచేల్, వెటర్నరీ రిటైర్డ్ ఏడీ డాక్టర్ పున్నయ్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యంలో పశువైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ఉచితంగా మినరల్ మిక్చర్‌ను అందిస్తున్నామని తెలిపారు. మూగ జీవాలకు చికిత్స చేయడం, సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు ఉచితంగా మినరల్ మిక్చర్‌ను, గడ్డివిత్తనాలను అందజేశారు. పశువులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ రిటైర్డ్ వైద్యాధికారులు భాస్కరరావు, రామకృష్ణ, డాక్టర్ రామన్న, శ్రీనివారావు, సత్యసాయి సేవాసమితి చేవెళ్ల శాఖ కన్వీనర్ శ్రీరంగపురం సత్యం, మాజీ కన్వీనర్ డి.ప్రభాకర్, అల్లవాడ భజన మండలి కన్వీనర్ శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు. -
అదృష్టమంటే అతనిదే..
న్యూయార్క్: అదృష్టమంటే అతనిదే. న్యూయార్క్‌లోని ఫేస్బుక్ ఇన్కార్పొరేషన్ భవనాన్ని 2005లో పెయింటింగ్‌లతో తీర్చిదిద్దిన డేవిడ్ చో అనే వ్యక్తికి నగదు బదులుగా కంపెనీ షేర్లను ఇచ్చారు. ఆ షేర్ల విలువ ఇపుడు 20 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1,270 కోట్లు) చేరడంతో అతను ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి... ఫేస్బుక్ వ్యవస్థాపక అధ్యక్షుడు షాన్ పార్కర్ పదేళ్ల క్రితం తమ కార్యాలయానికి రంగులు వేయించాలని నిర్ణయించి పెయింటర్ డేవిడ్ చోను సంప్రదించాడు. భవనం అంతటికీ చక్కగా రంగులు వేస్తాననీ, మంచి పెయింటింగ్స్ కూడా వేస్తాననీ, అందుకు 60 వేల డాలర్లు చెల్లించాలనీ చో కోరాడు. అయితే, తమది అప్పుడే ప్రారంభిస్తున్న (స్టార్టప్) కంపెనీ కనుక నగదుకు బదులు కంపెనీ షేర్లను ఇస్తానంటూ పార్కర్ బతిమిలాడాడు. పార్కర్లోని చురుకుదనాన్నీ, దూరదృష్టినీ గ్రహించి న డేవిడ్ చో అందుకు అంగీకరించాడు. తర్వాత కొద్దికాలానికే ఫేస్బుక్లో పెట్టుబడులు పెట్టడానికి పేపాల్, లింక్డ్ఇన్ సహవ్యవస్థాపకులను పార్కర్ ఒప్పించాడు. అంతే... ఫేస్బుక్ కథ మారిపోయింది. దశాబ్ద కాలంలోనే కంపెనీ విలువ అనూహ్యంగా పెరిగిపోయింది. డేవిడ్ చో వద్ద ఉన్న ఫేస్బుక్ షేర్ల విలువ ఏకంగా రూ.1,270 కోట్లు మించిపోయింది. -
శ్రుతిపై టాలీవుడ్ గుర్రు?
నటి శ్రుతిహాసన్‌పై టాలీవుడ్ గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సంచలన నటిగా పేరొందిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. గబ్బర్‌సింగ్, ఎవడు, రేసుగుర్రం వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న శ్రుతిహాసన్ హిందీ, తమిళ చిత్రాల్లోను నటిస్తూ యమ బిజీగా ఉన్నారు. అందాలారబోతలోనూ ముందున్న ఈ ముద్దుగుమ్మ ఈ తరహా ఫోటోలతో కలకలం పుట్టిస్తున్నారు. డిడే అనే హిందీ చిత్రంలో వేశ్య పాత్రలో ఒలకపోసిన శృంగారం విమర్శకుల చేతికి పెద్ద పనే చెప్పింది. ఆ తరువాత ఎవడు అనే తెలుగు చిత్రంలో దుస్తుల విషయంలో చాలా పొదుపు పాటించి సంచలనం రేపారు. అయితే ఆ చిత్రంలోని ఆమె శృంగారభరిత చిత్రాలు ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. ఈ సంఘటన శృతిహాసన్‌కు కాస్త ఎక్కువ ఆగ్రహాన్నే కలిగించింది. తన అనుమతి లేకుండా ఈ ఫొటోలను నెట్లో పొందుపరచారంటూ ఆ చిత్ర నిర్మాతపై ఫైర్ అయ్యారు. ఆ నిర్మాత ఆ ఫొటోలతో తనకెలాంటి సంబందం లేదంటూ వివరణ ఇచ్చారు. అయి నా శ్రుతి కోపం చల్లారలేదు. తన ఇమేజ్ను డామేజ్ చేయడానికి ప్రయత్నించిన వారిని ఊరికే వదలి పెట్టకూడదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని టాలీవుడ్‌లోని పదిమంది ఫొటోగ్రాఫర్లను విచారిస్తున్నారు. శ్రుతిహాసన్ సెక్సీగా నటించడం కొత్తేమీ కాదు. ఆమె తొలి చిత్రం లక్ (హిందీ) లోనే ఈత దుస్తులు ధరించి అందాలారబోతకు శ్రీకారం చుట్టారు. అలాంటిది పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? అంటూ టాలీవుడ్లో ఆమెపై వ్యతిరేకత వ్యక్తం అవుతోందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయంలో కొందరు తెలుగు నిర్మాత మండలి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.