అదృష్టమంటే అతనిదే..
న్యూయార్క్: అదృష్టమంటే అతనిదే. న్యూయార్క్‌లోని ఫేస్‌బుక్ ఇన్‌కార్పొరేషన్ భవనాన్ని 2005లో పెయింటింగ్‌లతో తీర్చిదిద్దిన డేవిడ్ చో అనే వ్యక్తికి నగదు బదులుగా కంపెనీ షేర్లను ఇచ్చారు. ఆ షేర్ల విలువ ఇపుడు 20 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1,270 కోట్లు) చేరడంతో అతను ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి... ఫేస్‌బుక్ వ్యవస్థాపక అధ్యక్షుడు షాన్ పార్కర్ పదేళ్ల క్రితం తమ కార్యాలయానికి రంగులు వేయించాలని నిర్ణయించి పెయింటర్ డేవిడ్ చోను సంప్రదించాడు. భవనం అంతటికీ చక్కగా రంగులు వేస్తాననీ, మంచి పెయింటింగ్స్ కూడా వేస్తాననీ, అందుకు 60 వేల డాలర్లు చెల్లించాలనీ చో కోరాడు. అయితే, తమది అప్పుడే ప్రారంభిస్తున్న (స్టార్టప్) కంపెనీ కనుక నగదుకు బదులు కంపెనీ షేర్లను ఇస్తానంటూ పార్కర్ బతిమిలాడాడు. పార్కర్‌లోని చురుకుదనాన్నీ, దూరదృష్టినీ గ్రహించి న డేవిడ్ చో అందుకు అంగీకరించాడు. తర్వాత కొద్దికాలానికే ఫేస్‌బుక్‌లో పెట్టుబడులు పెట్టడానికి పేపాల్, లింక్‌డ్‌ఇన్ సహవ్యవస్థాపకులను పార్కర్ ఒప్పించాడు. అంతే... ఫేస్‌బుక్ కథ మారిపోయింది. దశాబ్ద కాలంలోనే కంపెనీ విలువ అనూహ్యంగా పెరిగిపోయింది. డేవిడ్ చో వద్ద ఉన్న ఫేస్‌బుక్ షేర్ల విలువ ఏకంగా రూ.1,270 కోట్లు మించిపోయింది.