పెయింట్ వేసినందుకు రూ.1,200 కోట్లు వచ్చాయ్
అదృష్టం తలుపు తట్టి మరీ వస్తుందంటారు. ఆ లెక్కన చూస్తే అమెరికాకు చెందిన డేవిడ్ చో (37) చాలా చాలా అదృష్టవంతుడు. ఇతనో పెయింటర్, గ్రాఫిటీ ఆర్టిస్ట్. గోడలు, సీలింగ్‌లపై చిత్రాలు గీయడంలో నిపుణుడు. గ్యాంబ్లర్ కూడా. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం... అంటే 2005లో ఫేస్‌బుక్ సంస్థ సిలికాన్ వ్యాలీలో తొలి కార్యాలయాన్ని నెలకొల్పింది. ఆ ఆఫీసుకు పెయింట్ వేయించడానికి కంపెనీ దగ్గర తగినంత డబ్బు లేదు. దీంతో పెయింటింగ్ పనిని డేవిడ్‌కు అప్పగించి నగదుకు బదులుగా కంపెనీ షేర్లు ఇచ్చారు.
తర్వాత 2007లో మరో ఆఫీసు ఏర్పాటు చేసినపుడూ పెయింటింగ్ వర్క్‌ను డేవిడ్‌కే అప్పగించి మరికొన్ని షేర్లు ఇచ్చారు. అప్పుడు కంపెనీ లిస్ట్ కాకపోవడంతో ఆ షేర్లకు పెద్దగా విలువలేదు. కానీ 2012లో ఫేస్‌బుక్ స్టాక్ మార్కెట్లో లిస్టయింది. ఆ షేర్ల అసలు విలువ తెలిసొచ్చింది. స్టాక్ మార్కెటో లిస్టయినపుడు డేవిడ్ దగ్గరున్న షేర్ల విలువ ఏకంగా 20 కోట్ల డాలర్లు... అంటే సుమారు రూ.1,200 కోట్లకు చేరింది. ఈ 20 నెలల్లో షేరు ధర రెట్టింపు కావడంతో ఇప్పుడావిలువ ఏకంగా రూ.2,400 కోట్ల పైమాటే!!.