
గ్లోబల్ డిజిటల్ కనెక్టివిటీని పెంపొందించే లక్ష్యంతో భారతదేశం, యునైటెడ్ స్టేట్స్‌ను కలిపే సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్టును ఆవిష్కరించేందుకు మెటా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పింది. ఈ ప్రాజెక్ట్ కోసం బిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. 50,000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రపంచంలోనే అతి పొడవైన, అత్యధిక సామర్థ్యం కలిగిన సముద్రగర్భ కేబుల్ వ్యవస్థగా అవతరించనుంది.
‘ప్రాజెక్ట్ వాటర్ వర్త్’గా పిలిచే ఈ సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్టు భారత్, అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇతర కీలక ప్రాంతాలను కలుపుతుంది. మెటా అప్లికేషన్లు, సర్వీసులను బలోపేతం చేసేందుకు ఈ ప్రాజెక్ట్ కీలకపాత్ర పోషిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ పనులు ఈ ఏడాదే ప్రారంభం కానున్నాయని, వచ్చే ఐదేళ్లలో ఇది పూర్తవుతుందని అంచనా వేస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ సమయంలో ఇలాంటి ప్రకటనలు రావడం చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి: మొదటి రోజే రూ.8,472 కోట్ల బుకింగ్‌లు
సాంకేతిక పురోగతి
కంపెనీ ‘రూటింగ్’ అనే కొత్త సాంకేతికత ద్వారా 7,000 మీటర్ల సముద్ర లోతులో కేబుళ్లను ఏర్పాటు చేస్తారని మెటా ప్రతినిధి తెలిపారు. షిప్ లంగర్‌లు, ఇతర ప్రమాదాల నుంచి నష్టాన్ని నివారించడం కోసం హైరిస్క్ ఫాల్ట్ ప్రాంతాల్లో మెరుగైన టెక్నిక్‌లు ఉపయోగించబోతున్నట్లు చెప్పారు. ఈ సాంకేతిక ఆవిష్కరణ ఇండియాలో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ సదుపాయాలకు, సర్వీసులకు మద్దతు ఇవ్వడానికి, వాటిలో సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడానికి కంపెనీ నిబద్ధతను నొక్కి చెబుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment