
మెటా సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ చేసిన పొరపాటుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు సంస్థ క్షమాపణలు చెప్పింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి సారథ్యం వహిస్తున్న డాక్టర్ నిషికాంత్ దూబే నేతృత్వంలోని ప్యానెల్ మెటాకు సమన్లు జారీ చేయాలని యోచించినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మెటా సీఈఓ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.
కోవిడ్ -19 మహమ్మారిని నిర్వహించడంలో భారత ప్రభుత్వం విఫలమైందని జుకర్‌బర్గ్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో అన్నారు. దాంతో ప్రస్తుత ప్రభుత్వం 2024 ఎన్నికల్లో విజయం సాధించబోదని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఈ అంశంపై అప్పట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ మార్క్ జూకర్‌బర్గ్ మాటలు తప్పని రుజువైందన్నారు. ప్రజలు తమ పార్టీకే స్పష్టమైన మెజార్జీ అందించారని చెప్పారు. జూకర్‌బర్గ్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.
కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ దూబే ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితమైన సమాచారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ‘ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేసినందుకు కమిటీ మెటాపై చర్య తీసుకోవాలని చూస్తుంది. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా తప్పుడు సమాచారం దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. ఈ పొరపాటుకు ఆ సంస్థ భారత పార్లమెంటుకు, ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని దూబే అన్నారు. ఈ వ్యవహారంపై మెటా స్పందించింది.
ఇదీ చదవండి: పనితీరు సరిగాలేదా.. సర్దుకోవాల్సిందే..
మెటా పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ శివంత్ తుక్రాల్ కంపెనీ సీఈఓ చేసిన తప్పుకు క్షమాపణలు కోరారు. కంపెనీకి భారత్ ఎంత ప్రాముఖ్యమైందో పునరుద్ఘాటించారు. ‘అధికారంలో ఉన్న అనేక పార్టీలు 2024 ఎన్నికల్లో తిరిగి విజయం సాధించవనే మార్క్ వ్యాఖ్యలు అనేక దేశాలకు వర్తిస్తుంది. కానీ, భారత్ అందుకు మినహాయింపు. ఈ అనుకోని పొరపాటుకు మేం క్షమాపణలు కోరుతున్నాం. కంపెనీకి భారత్ ఎంతో ప్రాముఖ్యమైంది’ అని తుక్రాల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment