
వెంగళరావునగర్: ఫేస్‌బుక్‌లో పరిచయమై మాయమాటలు చెప్పి ఓ మహిళ నుంచి పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్లారెడ్డిగూడకు చెందిన మహిళకు ఫేస్‌బుక్‌లో గోల్డ్ గ్రూప్ ద్వారా మహేష్ నారాయణదాస్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.
ఆమె నంబర్ తీసుకున్న అతను తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడు. గత ఫిబ్రవరిలో తన పుస్తెలతాడుకు బంగారు తీగ అల్లి ఇవ్వాలని కోరడంతో వారి ఇంటికి వచ్చాడు. ఇంటి వద్దే తీగ అల్లి ఇవ్వాలని కోరగా తాను కట్టర్ తీసుకురావడం మరచిపోయానని, కూకట్‌పల్లిలోని తన బంధువుల దుకాణానికి వెళ్లి అరగంటలో తెస్తానని చెప్పాడు. అతని మాటలు నమ్మిన బాధితురాలు 40 గ్రాముల పుస్తెలతాడు, పుస్తెలు అతడికి ఇచ్చింది .
కూకట్‌పల్లికి వెళ్లిన మహేష్ తన ఆధార్‌కార్డు, తండ్రి నెంబర్, షాప్ ఫొటోలు ఆమెకు వాట్సాప్ చేశాడు. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో సదరు మహిళ ఫోన్ చేయగా తనకు యాక్సిడెంట్ అయిందని, త్వరలోనే వస్తానని చెప్పాడు. అయితే ఈ నెల 4న బాధితురాలికి ఫోన్ చేసిన మహేష్ ఆమెను దుర్భాషలాడటమేగాక పుస్తెలతాడు ఇవ్వనని, నీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకో అంటూ బెదిరించాడు. దాంతో బాధితురాలు మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment