‘మూగజీవాలకు సేవచేయడం అదృష్టం’
చేవెళ్ల: పశువుల చికిత్సకు ఉపయోగించే పరికరం ‘ట్రేవీస్‘ను సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యంలో ఉచితంగా అందజేశారు. ఈ పరికరాన్ని మండల పరిధిలోని ఇక్కారెడ్డిగూడ గ్రామంలో ఆదివారం సత్యసాయి సేవా సంస్థల యూత్ కో-ఆర్డినేటర్ వైసీ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు రాంకుచేల్, వెటర్నరీ రిటైర్డ్ ఏడీ డాక్టర్ పున్నయ్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యంలో పశువైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ఉచితంగా మినరల్ మిక్చర్‌ను అందిస్తున్నామని తెలిపారు. మూగ జీవాలకు చికిత్స చేయడం, సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు ఉచితంగా మినరల్ మిక్చర్‌ను, గడ్డివిత్తనాలను అందజేశారు. పశువులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ రిటైర్డ్ వైద్యాధికారులు భాస్కరరావు, రామకృష్ణ, డాక్టర్ రామన్న, శ్రీనివారావు, సత్యసాయి సేవాసమితి చేవెళ్ల శాఖ కన్వీనర్ శ్రీరంగపురం సత్యం, మాజీ కన్వీనర్ డి.ప్రభాకర్, అల్లవాడ భజన మండలి కన్వీనర్ శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.