· చిట్టెపు మధుబాబు, మహానంది
దేశంలోని ప్రముఖ శైవక్షేత్రాలలో ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన మహానంది ఒకటి. ఆరవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో అన్నీ ప్రత్యేకతలే! ఇక్కడ మహానందీశ్వరుడితో పాటు కోదండరాముల వారూ కొలువై ఉండటంతో ఇది శివకేశవుల నిలయంగానూ మారింది. ఇక్కడ మహానందీశ్వరుడు పుట్టలోంచి స్వయంభువుగా వెలిశాడు. శివలింగం పుట్ట ఆకారంలో కనిపిస్తుంది. అంతేకాకుండా స్వయంభువైన శ్రీ మహానందీశ్వరుడిని స్పృశిస్తూ వచ్చే జలం.. శైలధార, దివోదుని ధార, నరసింహధార, నంది తీర్థం, కైలాస తీర్థమనే ఐదు ధారలుగా ఇక్కడున్న రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరుల్లోకి పడుతూ ఎల్లప్పుడూ ఒకే నీటి మట్టాన్ని ఉంచుతోంది.
చిన్న గుండు సూది వేసినా పైకి కనపడేంత స్వచ్ఛంగా ఉంటుందా జలం. మహానందీశ్వరస్వామి ఆలయానికి వస్తే.. గర్భగుడి చాళుక్యుల కాలంనాటి కళింగ ఆర్కిటెక్చర్ తరహాలో శిల్పాకళా వైభవాన్ని కలిగి ఉంటుంది. దీన్ని మహానందీశ్వరస్వామే స్వయంగా రససిద్ధుడనే శిల్పితో నిర్మించుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. గర్భగుడి గోపురం చుట్టూ ఉండే నంది విగ్రహాల్లో ఓ నందికి రెండు తలలు ఉండటం మరో ప్రత్యేకత.
వేసవిలో చల్లగా.. శీతకాలంలో వెచ్చగా..
మహానంది కోనేటి నీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ఈ నీటిలో తొమ్మిది రకాల ఖనిజాలు ఉన్నాయని సమాచారం. బోరుబావుల్లో లభించే నీటిలో పలు రకాల రసాయనాలు వేసి అధునాతన యంత్రపరికరాల ద్వారా వడపోస్తే కానీ సాధారణ పీహెచ్ స్థాయి రాదు. అలాంటిది మహానందీశ్వరుడి చెంత ప్రవహించే నీటిలో సహజంగానే పీహెచ్ స్థాయి 7.1 ఉండటం విశేషం. అంతేకాదు ఇక్కడి కోనేరుల్లోని నీరు వేసవిలో చల్లగా ఉంటుంది. శీతకాలంలో వెచ్చగా మారుతుంది. తెల్లవారుజామున చూస్తే కోనేరులు పొగలు గక్కుతున్నట్లు కనిపిస్తాయి. స్ఫటికమంత స్వచ్ఛంగా ఉన్న ఈ నీటిలో ఆలయ గోపురాలు ప్రతిబింబిస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి.
వేలాది ఎకరాలకు సాగునీరుగా..
మహానందీశ్వరస్వామి దేవస్థానానికి చెందిన వందలాది ఎకరాలతో పాటు చుట్టుపక్కల ఉండే పొలాలకూ ఈ కోనేటి నీటినే వినియోగిస్తున్నారు. కోనేరుల్లోంచి నీరు రెండు పాయల ద్వారా బయటికి ప్రవహిస్తూ పొలాల మీదుగా వెళ్లి తెలుగుగంగ కాలువలో కలుస్తోంది. మహానంది ఆలయ పరిధిలోని 53.41 ఎకరాల్లో ఎక్కడైనా సరే రెండు అడుగుల లోతు గుంత తీస్తే చాలు నీరు ఉబికి వస్తుంది.
ఓ అద్భుత దివ్యక్షేత్రం
ఏ ఆలయంలో అయినా ఒక విశేషం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం దేనికి అదే ఓ విశేషం. ఇక్కడి రుద్రగుండం కోనేరును నంది తీర్థంగా పురాణాల్లో వర్ణించారు. ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి స్వయంగా ఇక్కడ స్నానమాచరిస్తూ భక్తుల పాపాలను పోగొడుతుందని శివపురాణంలో వర్ణించారు. ఇక్కడ స్నానమాచరిస్తే శరీర రుగ్మతలు తొలగిపోతాయని ఎంతోమంది అనుభవపూర్వకంగా చెప్పడమే కాదు శాస్త్రీయంగానూ నిరూపితమైంది.
– బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, మహానంది దేవస్థానం వేద పండితులు
Comments
Please login to add a commentAdd a comment