జల కళ
పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు
- జోగ్‌లో జల ఉధృతి
- తొణికిసలాడుతున్న ‘తుంగా’
- తుంగభద్ర జలాశయానికి భారీ వరద
- తీరనున్న ‘కరెంట్’ కష్టాలు
సాక్షి ప్రతినిధి/బెంగళూరు/శివమొగ్గ : పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 68 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో శివమొగ్గ జిల్లాలోని తుంగా జలాశయం గరిష్ట మట్టం 588.24 అడుగులకు చేరుకుంది. దీంతో జలాశయంలోకి చేరుతున్న 68 వేల క్యూసెక్కుల నీటిని అలాగే హొస్పేటలోని తుంగభద్ర జలాశయానికి వదిలేస్తున్నారు. దరిమిలా శివమొగ్గలో తుంగా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. మరో వైపు కోస్తా జిల్లాలతో పాటు మలెనాడులో సోమవారం కూడా వర్షాలు పడ్డాయి.
కావేరి పరీవాహక ప్రాంతాల్లో పడుతున్న వర్షాలతో ఆ నదిపై నిర్మించిన జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో గణనీయంగా పెరిగింది. కేఆర్‌ఎస్, కబిని జలాశయాల్లో జోరుగా వరద నీరు చేరుతోంది. కేరళ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు పడుతుండడంతో కర్ణాటకలోని నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొడగు జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రముఖ పర్యాటక ప్రాంతం భాగ మండలలోకి వాహనాల ప్రవేశాన్ని నిషేధించడంతో పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. హాసన జిల్లాలో కూడా బాగా వర్షాలు పడుతుండడంతో గోరూరు, హేమావతి జలాశయాల్లో ఇన్‌ఫ్లో పెరిగింది.
తీరనున్న కరెంటు కష్టాలు
భారీ వర్షాల కారణంగా జలాశయాలు నిండుతుండడంతో విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడే అవకాశం కలిగింది. మరో 15 రోజులు వర్షాలు రాకపోతే విద్యుత్ సంక్షోభం ఖాయమని ఆ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రముఖ జల విద్యుత్కేంద్రమైన లింగమక్కి జలాశయంలోకి రోజు రోజుకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. సోమవారం ఇన్‌ఫ్లో 38,183 క్యూసెక్కులుగా నమోదైంది. ఔట్‌ఫ్లోను 175 క్యూసెక్కులకు పరిమితం చేశారు. గత ఏడాది ఇదే సమయానికి జలాశయంలో నీటి మట్టం 1,789.5 అడుగులు కాగా ప్రస్తుతం 1,754.5 అడుగుల నీటి నిల్వ ఉంది.