హైదరాబాద్: ఈదురు గాలులు సృష్టించిన బీభత్సం నుంచి నగరవాసులు ఇంకా తేరుకోలేదు. సాయంత్రమైందంటే చాలూ ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. భయంతో ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలికి ఇంటిపైకప్పులు ఎగిరిపోయి అనేక మంది బస్తీ వాసుల జీవితాలు రోడ్డున పడాల్సి వచ్చింది. చెట్లకొమ్మలు విరిగిలైన్లపై పడటంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలాయి.
బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని రోడ్ నెంబర్ 1, 3, 12, 13 , జూబ్లిహిల్స్‌లోని రోడ్‌నెంబర్ 45, 46తో పాటు ఖైరతాబాద్, ఆనంద్‌నగర్, రాజేంద్రనగర్, కాటేదాన్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, పటాన్‌చెరు, మెహిదీపట్నం,శాంతినగర్, హనుమాన్‌నగర్, వాటర్‌వర్క్ ఫీడర్, ఫతేదర్వాజ, షేక్‌పేట్, ఫలక్‌నుమా, ఛత్రినాక, మెఘల్‌పుర, అత్తాపూర్, చాదర్‌ఘట్, యాకత్‌పుర, సంతోష్‌నగర్ పరిధిలోని పలు కాలనీల్లో శనివారం రాత్రి కూడా అంధాకారం తప్పలేదు. దీంతో ఆయా బస్తీలన్నీ అంధా కారంలో మగ్గాల్సి వచ్చింది. విద్యుత్ సరఫరా వ్యవస్థ ఆదివారం మధ్యాహ్నం వరకు పూర్తిస్థాయిలో మెరుగుపడే అవకాశం ఉంది.
స్నానానికి నీరు లేక ఇంటికే పరిమితం
ఉక్కపోతకు తోడు దోమలు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. మంచినీటి నల్లాలు రాకపోగా, ఇంట్లోని బోర్లు పనిచేయలేదు. స్నానానికే కాదు కాలకృత్యాలు తీర్చు కోవడానికి కూడా నీరు లేక కొంతమంది ఇంటికి తాళాలు వేసుకుని ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. మరికొంత మంది ఆఫీసులకు సెలవు పెట్టి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. లిప్ట్‌లు పనిచేయక అపార్ ్టమెంటువాసులు, గర్భిణులు, వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే దెబ్బతిన్న అన్ని ప్రాంతాలకు కరెంట్ పునరుద్ధ రించినట్లు సీఎండీ రఘుమారెడ్డి చెప్పడం విశేషం. తమ సిబ్బంది అహర్నిశలు శ్రమించి దెబ్బతిన్న ప్రధాన లైన్నన్నీ ఇప్పటికే క్లీయర్ చేసిందని, చెట్లకొమ్మలు విరిగిపడటంతో అనేక మంది వ్యక్తిగత సర్వీసు వైర్లు తెగిపడ్డాయని, దీంతో కొంతమందికి విద్యుత్ సరఫరా కావడం లేదని, అట్టివారంతా ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్లకు ఫిర్యాదు చేయాలని, స్థానిక లైన్‌మెన్లు వచ్చి కనెక్షన్లను సరి చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తారని సూచించారు.
డిస్కంకు రూ.కోటికిపైగా నష్టం
భారీ ఈదురు గాలులలకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 33కేవీ 66 పోల్స్, 11కేవీ 372 పోల్స్, ఎల్టీ పోల్స్ 692, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు 66 దెబ్బతినగా, ఒక్క గ్రేటర్ పరిధిలో 33కేవీ 60 పోల్స్, 11కేవీ 211, ఎల్టీ 332, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు 20 ధ్వంసమైనట్లు తెలిసింది. సంస్థకు రూ.కోటికిపైగా నష్టం వాటిల్లినట్లు ఓ అంచనా. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ , ఆనంద్‌నగర్, చార్మినార్, ఆస్మాన్‌ఘడ్, ఖైరతాబాద్, ఇబ్రహీంబాగ్, రాజేంద్రనగర్, ఆజామాబాద్ డివిజన్ల పరిధిలోనే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు సీఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో 2100 మంది ఇంజనీర్లు, కార్మికులు నిర్వీరామంగా పని చేస్తున్నట్లు తెలిపారు.
ఇంకా తేరుకోని హైదరాబాద్ నగరం
Published Sat, May 21 2016 9:08 PM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement