కుండపోత
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి నెట్‌వర్క్: అల్పపీడనం ప్రభావంతో బుధవారం రాష్ట్రమంతటా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా తడలో 144.6 మిల్లీమీటర్లు, చిత్తూరు జిల్లా సత్యవేడులో 132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిత్తూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఈదురు గాలులకు పెద్దఎత్తున మామిడి కాయలు నేల రాలాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉప్పు సాగు, ఇటుక బట్టీల్లో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. 41 సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తూర్పు గోదావరి జిల్లాలో అంధకారం అలముకుంది. అనంతపురం జిల్లా పెద్దమొగలాయపల్లిలో పిడుగుపాటుకు గొర్రెల కాపరి మంజునాథ్ (22) మృతిచెందాడు. పలు గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. విశాఖపట్నంలో బుధవారం వేకువ జాము నుంచి ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది. చోడవరం పట్టణంలో ఇంటి స్లాబ్ సన్‌షేడ్ కూలి గేదెల నర్సయ్యమ్మ (78) అనే వృద్ధురాలు మృతి చెందింది.
తిరుమలలో రికార్డు స్థాయిలో వర్షపాతం
తిరుమలలో బుధవారం ఉదయం భారీ వర్షం కురవడంతో ఆలయంలో నీరు నిలిచింది. లోపలికి వచ్చిన వర్షం నీటిని తొలగించేందుకు ఆలయంలో ప్రత్యేక మోటారు ఉన్నప్పటికీ భారీగా నీరు రావడంతో డ్రైనేజీ వ్యవస్థ సామర్థ్యం సరిపోలేదు. ఆలయ అధికారులు రెండు ఫైరింజన్లను తెప్పించి వర్షం నీటిని మహాద్వారం నుంచి వెలుపలకు తోడిపోశారు. తిరుమలలో 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వేసవిలో తిరుమలలో ఒకరోజు కురిసిన వర్షపాతంలో ఇదే రికార్డు అని టీటీడీ అధికారులు తెలిపారు.