
మరికొద్ది గంటల్లో బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనం ఏర్పడనుంది. క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
సాక్షి, విశాఖపట్నం: మరికొద్ది గంటల్లో బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనం ఏర్పడనుంది. క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేటి నుంచి మరో నాలుగు రోజులు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటే అవకాశ ఉంది. ఆదివారం వరకు మత్స్యకారుల హెచ్చరికలు కొనసాగనున్నాయి. ఉత్తరాంధ్ర సమీపంలో రుతుపవన ద్రోణి కొనసాగుతోంది.
తూర్పుగోదావరి: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరికి వరద పెరుగుతోంది. నీటిమట్టం 10.7 అడుగులకు చేరుకుంది. 8 లక్షల 37 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భారీగా నీరు బ్యారేజీ నుంచి విడుదల కావడంతో కోనసీమలో కాజ్‌వేలు నీటమునుగుతున్నాయి. గంటి పెదపూడి లంక, కనకాయ లంక కాజ్‌వేలు మీదుగా వరదనీరు ప్రవహిస్తోంది. పలు లంక గ్రామాలకు పడవలపై రాకపోకలు కొనసాగుతున్నాయి.
చింతూరు ఏజెన్సీలో వరద భయం మరోసారి మొదలైంది. మూడు రోజులుగా ఏజెన్సీతో పాటు, ఎగువన కురుస్తున్న వర్షాలకు శబరి, గోదావరి నదులకు భారీగా వరదనీరు చేరుతోంది. విఆర్ పురం మండలం పరిధిలో 28 గిరిజన గ్రామాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. కొండవాగులు పొంగి ప్రవహించడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.