నేడు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం.. నాలుగు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/వాకాడు: దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాలపై కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం సాయంత్రం ఇది 30 కిలో మీటర్ల వేగంతో కదులుతూ ట్రింకోమలీకి 530 కి.మీ, నాగపటా్ననికి 810 కి.మీ, పుదుచ్చేరికి 920 కి.మీ, చెన్నైకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడనుంది.
ఆ తర్వాత రెండు రోజుల్లో వాయవ్య దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 29వ తేదీ వరకు దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి మంగళవారం గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురిసే జిల్లాలు ఇవీ...
ఈ నెల 26, 27, 28 తేదీల్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 29వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఎగసిపడుతున్న కెరటాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో సముద్ర తీరంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. తిరుపతి జిల్లాలోని చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ మండలాల పరిధిలోని సముద్ర తీర ప్రాంతంలో సోమవారం అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వాకాడు మండలం తూపిలిపాళెం వద్ద సముద్ర కెరటాలు దాదాపు ఏడు అడుగుల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. సముద్రం మూడు మీటర్లు ముందుకు వచ్చింది. పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. ముందు జాగ్రత్తగా స్థానిక మత్స్యకారులు తమ బోట్లను ఒడ్డుకు చేర్చుకుని భద్రపరుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment