తుపాను ధాటికి అంధకారంలో ఆంధ్రప్రదేశ్
రాష్ట్రవ్యాప్తంగా బలమైన ఈదురుగాలులు, వర్షం
కూలిపోతున్న స్తంభాలు, తెగుతున్న తీగలు
481 ఫీడర్లు బ్రేక్‌డౌన్.. 14 లక్షల గృహాల్లో కారుచీకట్లు
మోటార్లు పనిచేయక తాగునీటికి కటకట
ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం
గగ్గోలు పెడుతున్న చిరు వ్యాపారులు
సరఫరాను పునరుద్ధరించలేక చేతులెత్తేసిన సర్కారు
కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ‘ఏపీఈపీడీసీఎల్’
సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం/అమలాపురం: ‘రోను’ తుపాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అంధకారంలోకి నెట్టింది. తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బలమైన ఈదురుగాలులు వీస్తుండడం, వర్షాలు కురుస్తుండడంతో భారీ వృక్షాలు కూలిపోతున్నాయి. కరెంటు స్తంభాలు నేలకొరుగుతున్నాయి. తీగలు తెగిపడుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు కుప్పకూలుతున్నాయి. ఫీడర్లు బ్రేక్‌డౌన్ అవుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 14 లక్షల గృహాల్లో కారు చీకట్లు అలుముకున్నాయి. దాదాపు 1.5 లక్షల నివాసాలకు రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 114 గ్రామాల్లో కరెంటు జాడే లేదు. లక్షలాది మంది అంధకారంలో మగ్గుతున్నారు.
విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. రాష్ట్రంలో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో జనం నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దోమలు స్వైరవిహారం చేస్తుండడంతో అల్లాడిపోతున్నారు. మోటార్లు పనిచేయక తాగునీరు దొరకడం లేదు. ఇక చిరు వ్యాపారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కరెంటు లేక వ్యాపారాలు సాగడం లేదు. ఆస్పత్రుల్లో వైద్య సేవలకు కూడా అంతరాయం కలుగుతోంది. తుపాను ప్రభావం తగ్గేవరకూ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు.
పడిపోయిన విద్యుత్ ఉత్పత్తి
రాష్ట్రంలో తుపాను ధాటికి 481 ఫీడర్లు బ్రేక్‌డౌన్ అయ్యాయి. వాటి పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. వీటిల్లో 150 ఫీడర్లను ఇప్పటికీ పునరుద్ధరించలేపోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ నిరంతరం విద్యుత్‌ను సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, అది ఆచరణకు నోచుకోవడం లేదు. రోజుకు 160 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండే రాష్ట్రంలో ఒక్క రోజులోనే ఇది 110కి పడిపోయింది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. కృష్ణపట్నం, ఆర్టీపీపీ, విజయవాడ నార్లతాతారావు థర్మల్ పవర్ ప్రాజెక్టులలో ఉత్పత్తి పడిపోయింది.
తుపాను కారణంగా దక్షిణాది గ్రిడ్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం కనిపించడం లేదు. జెన్‌కో ఉత్పత్తి నామమాత్రంగా ఉంది. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) పరిధిలో 253 ఫీడర్లలో విద్యుత్ సరఫరా లేదు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 60 వేల మందికి రెండు రోజులుగా కరెంట్ లేదు. సరఫరా పునరుద్ధరణకు కరెంటు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో లేవని అధికారులు చేతులెత్తేస్తున్నారు. తుపాను ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే, రానురాను సర్వత్రా అంధకారం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.
మూడు జిల్లాల్లో అస్తవ్యస్తం
ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) పరిధిలోని విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు దెబ్బతినడంతో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. విద్యుత్ లైన్లపై చెట్లు విరిగిపడడంతో ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయి. ఒకదాన్ని సరిచేస్తే మరోచోట ట్రిప్ అవుతోంది. పనులు జరుగుతుండగానే ఫీడర్లు ట్రిప్ అవ్వడంతోపాటు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. దీంతో సరఫరాలో జాప్యం జరుగుతోంది.
విద్యుత్ సరఫరా లేకపోవడంతో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌తోపాటు పలు ఆస్పత్రుల్లో వైద్యసేవలకు అంతరాయం ఏర్పడింది. మీ-సేవా కేంద్రాలు పనిచేయలేదు. చార్జింగ్ లేక సెల్‌ఫోన్లు మూగబోయాయి. ఇళ్లల్లో మోటార్లు పనిచేయక, నీరందక జనం ఇబ్బందులు పడ్డారు. కరెంటు లేక పలు ప్రాంతాల్లో మంచినీటి పథకాల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయింది.
విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు
విద్యుత్ సరఫరాపై తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోందని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) సీఎండీ హెచ్‌వై దొర తెలిపారు. కరెంటు సరఫరా పునరుద్ధరణ చర్యలు చేపట్టామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉందన్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో సకాలంలో విద్యుత్‌ను పునరుద్ధరించామని చెప్పారు.
తెగిన తీగల వద్దకు వెళ్లకండి
తుపాను ప్రభావానికి దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను సరిచేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లకు ఆదేశాలిచ్చామని ఈపీడీసీఎల్ సీఎండీ ఆర్.ముత్యాలరాజు తెలిపారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెగిపడిన విద్యుత్ వైర్లు, పడిపోయిన స్తంభాల వద్దకు వెళ్లొద్దని సూచించారు. టోల్‌ఫ్రీ నంబర్ 1912కు లేదా కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందిస్తే తమ సిబ్బంది పునరుద్ధరణ చర్యలు చేపడతారని చెప్పారు.
కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు
కార్పొరేట్ ఆఫీస్: 83310118762, 08912769627
శ్రీకాకుళం: 9490612633, 08942227361
విజయనగరం: 9490610102, 08922222942
రాజమండ్రి: 7382299960, 08832463354
ఏలూరు: 9440902926, 08812231287