సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఈ రోజు వాయుగుండంగా బలపడే అవకాశముంది. ఈ నెల 25 నాటికి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రేమాల్ తుపాను ఏపీకి దూరంగా ఒడిస్సా పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
నైరుతి రుతుపవనాల్లో చురుకుదనం పెరిగింది. అండమాన్ నికోబార్ పరిసరాల్లో రుతు పవనాలు విస్తరించాయి. జూన్ 1కి కేరళను తాకుతుందని అంచనా. అల్పపీడనం... ముందస్తు రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఈ రోజు(శుక్రవారం) తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో శుక్ర, శనివారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉంది.
శనివారం అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఆదివారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవిస్తాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment