నేడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
22న వాయుగుండంగా.. 23వ తేదీకి తుపానుగా బలపడుతుందని అధికారుల వెల్లడి
ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం
రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాలకు ఆస్కారం
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: అండమాన్ సముద్రం నుంచి దూసుకొస్తున్న తుపాను ముప్పు దాదాపు ఆంధ్రప్రదేశ్‌కు లేనట్టే. అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమంగా బలపడి.. 22వ తేదీన ఉదయం వాయుగుండంగా బలపడనుంది. అనంతరం మరింత తీవ్రరూపం దాల్చి 23 నాటికి తుపానుగా మారుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తుపానుగా మారిన తర్వాత వాయువ్య దిశగా వాయువ్య బంగాళాఖాతానికి ప్రయాణించి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు.
తొలుత ఈ తుపాను ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటుతుందని అంచనా వేశారు. అయితే, వాతావరణ పరిస్థితులు, అల్పపీడనం నెమ్మదిగా దిశ మార్చుకునే సూచనల మేరకు రాష్ట్రానికి ఈ తుపాను ముప్పు లేదని స్పష్టం చేశారు. 23, 24 తేదీల్లో తుపానుగా మారే సమయంలో ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా గంటకు 70 నుంచి 90 కి.మీ. వేగంతోనూ.. తీరం దాటే సమయంలో 100 కి.మీ. గాలుల తీవ్రతతో తుపాను విరుచుకుపడనుంది.
తీరం దాటిన తర్వాత బలహీనపడి ఛత్తీస్‌గఢ్ వైపుగా ప్రయాణించే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం కోస్తాంధ్ర జిల్లాల్లో ఉండబోదన్నారు. అయితే.. ఈ తుపాను గాలుల తీవ్రతతో అరేబియా సముద్రం నుంచి తేమని తీసుకోవడం వల్ల దీని ప్రభావంతో రాయలసీమలో 23, 24 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా రాబోయే నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయనీ.. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడేందుకు ఆస్కారం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నెల 24 వరకూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ.. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కాగా, ఐఎండీ ఈ తుపానుకు ‘దాన’ అని పేరు పెట్టింది. దాన అంటే అరబిక్‌లో విలువైన ముత్యం అని అర్థం.
Comments
Please login to add a commentAdd a comment