Cyclone warning center
-
దాన తుపాను ముప్పు లేనట్టే!
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: అండమాన్ సముద్రం నుంచి దూసుకొస్తున్న తుపాను ముప్పు దాదాపు ఆంధ్రప్రదేశ్‌కు లేనట్టే. అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమంగా బలపడి.. 22వ తేదీన ఉదయం వాయుగుండంగా బలపడనుంది. అనంతరం మరింత తీవ్రరూపం దాల్చి 23 నాటికి తుపానుగా మారుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తుపానుగా మారిన తర్వాత వాయువ్య దిశగా వాయువ్య బంగాళాఖాతానికి ప్రయాణించి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తొలుత ఈ తుపాను ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటుతుందని అంచనా వేశారు. అయితే, వాతావరణ పరిస్థితులు, అల్పపీడనం నెమ్మదిగా దిశ మార్చుకునే సూచనల మేరకు రాష్ట్రానికి ఈ తుపాను ముప్పు లేదని స్పష్టం చేశారు. 23, 24 తేదీల్లో తుపానుగా మారే సమయంలో ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా గంటకు 70 నుంచి 90 కి.మీ. వేగంతోనూ.. తీరం దాటే సమయంలో 100 కి.మీ. గాలుల తీవ్రతతో తుపాను విరుచుకుపడనుంది. తీరం దాటిన తర్వాత బలహీనపడి ఛత్తీస్‌గఢ్ వైపుగా ప్రయాణించే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం కోస్తాంధ్ర జిల్లాల్లో ఉండబోదన్నారు. అయితే.. ఈ తుపాను గాలుల తీవ్రతతో అరేబియా సముద్రం నుంచి తేమని తీసుకోవడం వల్ల దీని ప్రభావంతో రాయలసీమలో 23, 24 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా రాబోయే నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయనీ.. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడేందుకు ఆస్కారం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నెల 24 వరకూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ.. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కాగా, ఐఎండీ ఈ తుపానుకు ‘దాన’ అని పేరు పెట్టింది. దాన అంటే అరబిక్‌లో విలువైన ముత్యం అని అర్థం. -
AP: తీరం దాటిన వాయుగుండం..
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం తెల్లవారు జామున 5.30 గంటలకు చెన్నైకి ఉత్తరంలో నెల్లూరుకి సమీపంలో తీరం దాటింది. 4.30 గంటల సమయంలో గంటకు 14 కిమీ వేగంతో తీరందాటే ప్రక్రియ ప్రారంభమైంది. తీరం దాటిన తర్వాత.. దక్షిణ కోస్తాంధ్ర దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా తమిళనాడులో కేంద్రీకృతమై తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. అనంతరం.. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాత్రి 8 గంటలకు మరింత బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఈ వాయుగుండం గడిచేలోపు.. మరో వాయుగుండం దూసుకొస్తోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతములో అక్టోబరు 20 నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో 22 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి.. క్రమంగా వాయువ్య దిశగా ప్రయాణం చేస్తూ వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం ఉత్తరాంధ్ర, ఒడిశా, ప శ్చిమ బెంగాల్‌పై తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ వాయుగుండం ప్రభావంతో 20 నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని.. 22 నాటికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర రూపందాల్చే సూచనలు కనిపిస్తున్నట్లు వెల్లడించారు. ఇక గడిచిన 24 గంటల్లో విశాఖ జిల్లా సాగర్ నగర్లో 124 మిమీ, మధురవాడలో 115, ఎంవీపీ కాలనీలో 106, విశాఖ రూరల్‌లో 62.2 మిమీ, శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో 60.7మి.మీ, పెనుగొండలో 106, తిరుపతిలో 98, దొరవారిసత్రంలో 96, బుక్కపట్నంలో 95.75, కదిరిలో 95, నెల్లూరులో 88, కర్నూలులో 78 మిమీ, శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో 80.5 మిమీ, వర్షపాతం నమోదైంది. ఊపిరిపీల్చుకున్న నెల్లూరు జిల్లా.. ఇదిలా ఉంటే.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం ఉదయం తీరం దాటి బలహీనపడడంతో నెల్లూరు జిల్లా ప్రజానీకం ఊపిరిపీల్చుకుంది. దీని ప్రభావంతో జిల్లా అంతటా నాలుగు రోజులపాటు భారీగా వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు సోమశిల జలాశయానికి ఇన్‌ఫ్లో పెరిగింది. జలాశయంలో నీటినిల్వ 55 టీఎంసీలకు చేరుకుంది. అలాగే, జిల్లాలో 70 శాతం సాగునీటి చెరువులు జలకళను సంతరించుకోగా.. వివిధ ప్రాంతాల్లో సాగులో ఉన్న పంటలకు ఈ వర్షాలు నష్టం చేకూర్చడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో గురువారం అనూహ్య వాతావరణం నెలకొంది. ఉదయం ఎడతెరపి లేకుండా జడివాన కురవగా.. మధ్యాహ్నం నుంచి సూరీడు ప్రతాపం చూపాడు. తాజా వర్షాలకు వేరుశనగ, పత్తి, ఆముదం, కొర్ర, వరి, కంది పంటలకు నష్టం కలిగిస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.దిగుబడి తగ్గుతుందని రైతుల ఆందోళన.. ఏలూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 147.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 28 మండలాలకు గాను 22 మండలాల్లో వర్షపాతం నమోదైంది. అలాగే, డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరుసగా మూడోరోజు భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలు ఖరీఫ్ వరి రైతులకు ఇబ్బందిగా మారాయి. దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలులోని తీర ప్రాంతాల్లో ఖరీఫ్ దిగుబడి చాలాచోట్ల 20 బస్తాలు మించి రాదంటున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోనూ గురువారం మధ్యాహ్నం ఏకధాటిగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాత బస్టాండ్ ప్రాంతంలో వర్షపు నీరు నిలిచిపోయి వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. -
నేడు తీరం దాటనున్న 'యాస్'
సాక్షి, విశాఖపట్నం/పూసపాటిరేగ (విజయ నగరం)/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న యాస్ తుపాను మరింత బలపడింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ అతి తీవ్ర తుపానుగా మారింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశలో 200 కిలోమీటర్లు, బాలాసోర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 290, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది బుధవారం మధ్యాహ్నం ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాల్లోని పారాదీప్, సాగర్ ఐలాండ్స్ మధ్య బాలాసోర్‌కు దక్షిణ దిశలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీరం దాటిన తర్వాత 12 గంటల పాటు అతి తీవ్ర తుపానుగానే కొనసాగుతూ 27వ తేదీ ఉదయానికి క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. రాష్ట్రంలో యాస్ తుపాను ప్రభావంపై సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస తీరంలో సముద్రం 10 మీటర్ల ముందుకు వచ్చింది. సముద్రంలో బలంగా గాలులు వీయడం వల్లే సముద్రం ముందుకు వచ్చినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. తీరానికి అనుకుని ఉన్న ఈ గ్రామస్తులు అధికారుల హెచ్చరికలతో సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వానలు ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో రెండురోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి వానలు పడతాయని చెప్పారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో బుధవారం గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, గంగవరం పోర్టులో సెక్షన్ సిగ్నల్ నంబర్–1, 2, 3తో పాటు రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేయగా, కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు అప్రమత్తత సమాచారం అందించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కెరటాల ఉద్ధృతి పెరుగుతుందని తెలిపారు. రెండురోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. పలు జిల్లాల్లో వర్షాలు గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. విశాఖపట్నం జిల్లా అంతటా ఆకాశం మేఘావృతమైంది. తుఫాన్ కారణంగా రాజస్థాన్ నుంచి పొడిగాలులు రాష్ట్రం వైపుగా వీస్తుండటంతో ఎండలు కూడా పెరుగుతున్నాయి. మాచర్ల, చీమకుర్తి, దొనకొండలో అత్యధికంగా 42 డిగ్రీలు, అవుకు, ఒంగోలు, కలిగిరిల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మాల్దీవులు, కొమరిన్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. 48 గంటల్లో మాల్దీవులతోపాటు తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. అప్రమత్తమైన ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్... ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో యాస్ తుపాను ప్రభావం తీవ్రంగాను, ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రపై స్వల్పంగా ఉండటంతో భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వే వంతెనలు, నదుల సమీపంలోని రైల్వే ట్రాక్స్, యార్డులు, సిగ్నలింగ్ వ్యవస్థ వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. వరద ఉధృతికి కాలువలు పొంగి ట్రాక్‌లు దెబ్బతినకుండా ముందస్తు చర్యలుగా పూడికతీత పనులు ప్రారంభించారు. వాల్తేరు డివిజన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 24 గంటలూ తుపాను పరిస్థితిని పసిగట్టేందుకు విశాఖ డివిజన్‌తో పాటు భువనేశ్వర్‌లోని హెడ్‌క్వార్టర్స్, ఖుర్దారోడ్, సంబల్పూర్లలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్స్ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. తుపాను కారణంగా మరో మూడు ప్రత్యేక రైళ్లను రద్దుచేస్తున్నట్లు రైల్వేశాఖ మంగళవారం ప్రకటించింది. ఈ నెల 28న యశ్వంత్‌పూర్–గౌహతి (06577), చెన్నైసెంట్రల్–భువనేశ్వర్ (02840), 30న పూరి–చెన్నైసెంట్రల్ (02859) రైళ్లను రద్దుచేసింది. -
Cyclone Yaas: ముంచుకొస్తున్న తుపాన్
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం రాత్రి వాయుగుండంగా మారింది. అది సోమవారం ఉదయానికి మరింత బలపడి తుపాన్‌గా మారనుంది. రాగల 24 గంటల్లో అతి తీవ్ర తుపాన్‌గా మారుతుందని విశాఖలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఇది.. పోర్టుబ్లెయిర్‌కు ఉత్తర దిశలో 560 కి.మీ దూరంలో, ఒడిశా బాలాసోర్‌కు ఆగ్నేయ దిశగా 590 కి.మీ, పశ్చిమ బెంగాల్ దిఘాకు ఆగ్నేయ దిశగా 670 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ 26వ తేదీ ఉదయం ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గర్లో బంగాళాఖాతం ప్రాంతాలకు చేరుకుంటుంది. అనంతరం పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రయాణించి.. పారాదీప్ – సాగర్ ఐలాండ్స్ వద్ద 26వ తేదీ సాయంత్రం లేదా రాత్రి తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని తీరం వెంబడి రాబోయే నాలుగు రోజుల పాటు గంటకు గరిష్టంగా 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. రాష్ట్రంపై తుపాన్ ప్రభావం పెద్దగా ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. కోస్తా, రాయలసీమల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని, వడగాలులు వీస్తాయని నిపుణులు చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో టెక్కలి, పాతపట్నం, పమిడిలో 4 సెంమీ, కళింగపట్నం, వీరఘట్టం, యలమంచిలి, కైకలూరు, నర్సీపట్నం, భీమవరం, విజయనగరంలో 3 సెంమీ వర్షపాతం నమోదైంది. భారీగా సహాయక సామాగ్రి సిద్ధం ► భారత రక్షణ దళాలు తుపాన్ సహాయక చర్యలకు సిద్ధమయ్యాయి. భారత వాయుదళం (ఎయిర్‌ఫోర్స్) 950 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) బృందాలతో పాటు జామ్‌నగర్, వారణాసి, పాట్నా, అరక్కోణం నుంచి 70 టన్నుల సహాయక సామాగ్రిని కోల్‌కతా, భువనేశ్వర్, పోర్టుబ్లెయిర్‌కు పంపించారు. ► 15 ఎయిర్క్రాఫ్టŠస్ ద్వారా వీటిని ఆయా ప్రాంతాలకు ఎయిర్ ఫోర్స్ అధికారులు పంపించారు. మరో 16 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్సŠ, 26 హెలికాఫ్టర్లను సహాయక చర్యల కోసం పశ్చిమ తీరంలో సిద్ధంగా ఉంచారు. ► తుపాన్ ప్రభావిత ప్రాంతాలైన భువనేశ్వర్, కోల్‌కతాకు 10, పోర్ట్‌బ్లెయిర్‌కు 5 విపత్తు సహాయక బృందాలు తరలించారు. తూర్పు నౌకాదళం నుంచి 8 యుద్ధ నౌకలు, నాలుగు డైవింగ్ బృందాలు, 10 ఫ్లడ్ రిలీఫ్ కోలమ్స్‌ని తరలించారు. ► విశాఖలోని ఐఎన్ఎస్ డేగా నుంచి రెస్క్యూ బృందాలతో నేవల్ హెలికాఫ్టర్లు, ఇండియన్ ఆర్మీకి చెందిన మూడు ఇంజినీరింగ్ టాస్క్‌ఫోర్స్ బృందాలు తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. కోవిడ్ నేపథ్యంలో బాధితులకు ఆక్సిజన్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్మ్డ్ ఫోర్స్ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. అదనపు ఆక్సిజన్ నిల్వలు సిద్ధం సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం యాస్ తుపానుగా తీవ్రరూపు దాల్చే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒడిశా నుంచి అదనపు ఆక్సిజన్ నిల్వలను తెప్పిస్తున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా, ఆర్ అండ్ బి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా చేస్తున్న మూడు ప్లాంట్లతోపాటు అన్ని ఆస్పత్రులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేట్టుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ► ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా రెండు రోజులుగా ఒడిశా నుంచి అదనపు ఆక్సిజన్ నిల్వలు తెప్పిస్తున్నాం. తద్వారా అన్ని జిల్లాల్లోనూ ఆక్సిజన్ బఫర్ నిల్వలు ఉండేట్టుగా చూస్తున్నాం. ►ఇప్పటికే ఒడిశాలోని రూర్కెలా నుంచి 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను తెప్పించింది. సోమవారం నాటికి మరో 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వలు రైలు ద్వారా రానున్నాయి. ► రూర్కెలా, కళింగ నగర్, అంగూల్ నుంచి రోడ్డు మార్గంలో మరో 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సవ్యంగా తీసుకువచ్చేందుకు ఒడిశా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ►ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి రెడ్‌క్రాస్ సొసైటీ తెప్పించిన 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఆదివారం విశాఖపట్నం పోర్ట్ వద్ద ప్రభుత్వానికి అందించింది. ►రిలయన్స్ ఇండస్ట్రీస్ గుజరాత్‌లోని జామ్ నగర్ ప్లాంట్ నుంచి 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ప్రత్యేక రైళ్ల ద్వారా సరఫరా చేసింది. ► తుపాన్ నేపథ్యంలో విశాఖపట్నంలోని స్టీల్‌ప్లాంట్, ఎలెన్‌బారీ ఇండస్ట్రీస్, శ్రీకాకుళంలోని లిక్వినాక్స్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మూడు ప్లాంట్ల ద్వారా 210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోంది. ►సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసే 49 ఆక్సిజన్ రీఫిల్లర్లకు నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టింది. అన్ని ఆస్పత్రులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేట్టుగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అదనంగా జనరేటర్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. -
ఒడిశా తీరం దాటిన వాయుగుండం
విశాఖపట్నం: గోపాల్పూర్ - పూరీ మధ్య వాయుగుండం ఒడిశా తీరం దాటిందని తుపాను హెచ్చరికల కేంద్రం ఆదివారం వెల్లడించింది. వాయుగుండం పూల్బనికి 9 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. వాయుగుండం క్రమేపి బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తరకోస్తాలో తీరం వెంబడి గంటకు 45 - 60, దక్షిణ కోస్తాలో 45 - 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. కోస్తా అంతటా వర్షాలు విస్తారంగా కురుస్తాయని పేర్కొంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను తుపాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. -
రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణలో వర్షాలు
హైదరాబాద్: రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. పశ్చిమబెంగాల్ తీరాన్ని అనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని తెలిపింది. ఇది ఈ రోజు సాయంత్రంలోగా బలపడి వాయుగుండంగా మారే అవకాశలున్నాయని పేర్కొంది. అల్పపీడనంతోపాటు ఉపరితల అవర్తనం కదులుతుందని...ఇది ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణిగా మారి వేగంగా కదులుతుందని వెల్లడించింది. దాంతో కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు చోట్లు వర్షాలు పడతాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని తుపాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. -
ఆగ్నేయ గాలులతో చలి తగ్గుముఖం
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తుండడంవల్ల చలి కాస్త తగ్గుముఖం పడుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. సముద్రం ఉపరితలం నుంచి గాలులు వీస్తున్న కారణంగా తేమ ఎక్కువ శాతం నమోదవుతుందని తద్వారా కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో స్వల్ప మార్పులుంటాయన్నారు. ఒకటి, రెండుచోట్ల సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీలు అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ మేఘాలున్నాయన్నారు. వర్షం కూడా పడుతోందన్నారు. -
బలహీనపడుతున్న 'మాది' తుపాను
విశాఖపట్నం: 'మాది' తుపాన్ క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 400 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన మాది తుపాను రేపటికి మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. దీని ప్రభావం వల్ల రాగల 48గంటల్లో కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ తుపాను ప్రభావంతో గంటకు 40-50కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తీరంలో అలల ఉధృతి ఎక్కువ ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. -
స్థిరంగా వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. రాగల 24 గంటల్లో ఉత్తర దిశగా కదులుతూ బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందన్నారు. దీని ప్రభావం ఏ ప్రాంతాలపై ఉంటుందన్నది చెప్పలేమన్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగావుందని, రాగల 24 గంటల్లో పెద్దగా మార్పులుండవని వెల్లడించారు. -
రేపు తీరం దాటనున్న ‘లెహర్’!
-
రేపు తీరం దాటనున్న ‘లెహర్’!
ఉత్తర కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం వచ్చే 48 గంటల్లో గంటకు 150-200 కి.మీ.ల వేగంతో పెనుగాలులు ప్రస్తుతం కాకినాడకు 800 కి.మీ దూరంలో తుపాను సాక్షి, విశాఖపట్నం:లెహర్ తుపాను మంగళవారం రాత్రి నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ కాకినాడకు తూర్పు ఆగ్నేయంగా 800కి.మీ దూరంలో నిలకడగా ఉంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అది ప్రస్తుతం తీవ్ర తుపానుగానే ఉందని, పెనుతుపానుగా నిర్ధారించేది, లేనిది బుధవారం నాటి వాతావరణ పరిస్థితుల్ని బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. లెహర్ తుపాను గురువారం సాయంత్రం మచిలీపట్నం, కళింగపట్నం తీరాల మీదుగా కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందన్నారు. బుధవారం గంటకు 160నుంచి 200కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, గురువారం గంటకు 170నుంచి 200కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు 2, 3 మీటర్ల ఎత్తు వరకు ఎగసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, వెళ్లినవారు వెంటనే తిరిగి రావాలని సూచించారు. రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడొచ్చని, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని, యానాంలోనూ భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించారు. విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. తుపాను బలపడుతున్న కొద్దీ గుడిసెలు కూలిపోవడం, సమాచార వ్యవస్థ కుప్పకూలడం, రైల్వే ట్రాక్‌లు, రోడ్లు ధ్వంసం అయ్యే అవకాశాలున్నాయన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా ఉంటేనే మంచిదని సూచించారు. కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశామన్నారు. మెల్లగా కదులుతూ..! లెహర్ తుపాను ప్రస్తుతానికి మెల్లగానే కదులుతోందని అధికారులు చెబుతున్నారు. సోమవారం గంటకు 15 కి.మీ ప్రయాణించి కొద్దిసేపు నిలకడగా ఉంటే మంగళవారం గంటకు 16కి.మీ చొప్పున ప్రయాణించి రాత్రి సమయానికి నిలకడగానే ఉంది. తుపాను మెల్లగా కదులుతుండడం, కొద్దిసేపు నిలకడగా ఉండిపోవడాన్ని బట్టి చూస్తుంటే దాని తీవ్రత అంచనాలకు అందుకోలేని విధంగా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దట్టంగా పొగమంచు: రాష్ర్టంలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కోస్తాంధ్రలో భీమడోలులో 3సెం.మీ, కుప్పం, వెంకటగిరికోట ప్రాంతాల్లో 2సెం.మీ చొప్పున వర్షం కురిసింది. తెలంగాణ సహా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఆదిలాబాద్‌లో కనిష్టంగా 17డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం సాయంత్రంలోపు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఓ మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పొగమంచు దట్టంగా కురుస్తుంది. ‘ముందస్తు చర్యలు తీసుకున్నాం’ సాక్షి, హైదరాబాద్ : లెహర్ తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే ఉభయగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో పటిష్టమైన ముందస్తు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ పార్థసారథి తెలిపారు. బాధిత ప్రాంతాల్లో సహాయ పునరావాసం కోసం ఆర్మీ సహకారం తీసుకుంటున్నామని వెల్లడించారు. వాతావరణ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. ముంపు ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రక్షణ దళానికి చెందిన 4 హెలికాప్టర్లను, 4 కాలమ్స్ (ఒక్కో కాలమ్‌లో 100 మంది) ఆర్మీని తీసుకున్నట్టు చెప్పారు. రైల్వేశాఖ అప్రమత్తం: లెహర్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముందస్తు చర్యలకు నడుం బిగించింది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో భేటీ అయి, తాము తీసుకునే చర్యల గురించి వివరించారు. అనంతరం రైల్‌నిలయంలో ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఎంతటి ఉపద్రవం ఎదురైనా ప్రయాణికుల ఇబ్బందులను వీలైనంత తగ్గించేలా చూడాలన్నారు. 28న రైలు ప్రయాణం కష్టమే! విశాఖపట్నం, న్యూస్‌లైన్: లెహర్ తుపాను నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే అధికారులు అప్రమత్తయ్యారు. రైల్వే ట్రాక్‌లతోపాటు విద్యుత్ ట్రాక్షన్‌పై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటున్నందున రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న రైల్వే ప్రయాణాలు సజావుగా సాగే అవకాశాలుండవని అభిప్రాయపడుతున్నారు.