నెల్లూరుకు సమీపంలో అల్పపీడనంగా బలహీనం
రెండ్రోజుల పాటు వర్షాలకు విరామం
అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం
22 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం.. 20 నుంచి రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం తెల్లవారు జామున 5.30 గంటలకు చెన్నైకి ఉత్తరంలో నెల్లూరుకి సమీపంలో తీరం దాటింది. 4.30 గంటల సమయంలో గంటకు 14 కిమీ వేగంతో తీరందాటే ప్రక్రియ ప్రారంభమైంది. తీరం దాటిన తర్వాత.. దక్షిణ కోస్తాంధ్ర దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా తమిళనాడులో కేంద్రీకృతమై తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. అనంతరం.. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాత్రి 8 గంటలకు మరింత బలహీనపడి అల్పపీడనంగా మారింది.
ఈ వాయుగుండం గడిచేలోపు.. మరో వాయుగుండం దూసుకొస్తోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతములో అక్టోబరు 20 నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో 22 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి.. క్రమంగా వాయువ్య దిశగా ప్రయాణం చేస్తూ వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం ఉత్తరాంధ్ర, ఒడిశా, ప శ్చిమ బెంగాల్‌పై తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు.
ఈ వాయుగుండం ప్రభావంతో 20 నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని.. 22 నాటికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర రూపందాల్చే సూచనలు కనిపిస్తున్నట్లు వెల్లడించారు. ఇక గడిచిన 24 గంటల్లో విశాఖ జిల్లా సాగర్ నగర్‌లో 124 మిమీ, మధురవాడలో 115, ఎంవీపీ కాలనీలో 106, విశాఖ రూరల్‌లో 62.2 మిమీ, శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో 60.7మి.మీ, పెనుగొండలో 106, తిరుపతిలో 98, దొరవారిసత్రంలో 96, బుక్కపట్నంలో 95.75, కదిరిలో 95, నెల్లూరులో 88, కర్నూలులో 78 మిమీ, శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో 80.5 మిమీ, వర్షపాతం నమోదైంది.
ఊపిరిపీల్చుకున్న నెల్లూరు జిల్లా..
ఇదిలా ఉంటే.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం ఉదయం తీరం దాటి బలహీనపడడంతో నెల్లూరు జిల్లా ప్రజానీకం ఊపిరిపీల్చుకుంది. దీని ప్రభావంతో జిల్లా అంతటా నాలుగు రోజులపాటు భారీగా వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు సోమశిల జలాశయానికి ఇన్‌ఫ్లో పెరిగింది. జలాశయంలో నీటినిల్వ 55 టీఎంసీలకు చేరుకుంది. అలాగే, జిల్లాలో 70 శాతం సాగునీటి చెరువులు జలకళను సంతరించుకోగా.. వివిధ ప్రాంతాల్లో సాగులో ఉన్న పంటలకు ఈ వర్షాలు నష్టం చేకూర్చడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు.
ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో గురువారం అనూహ్య వాతావరణం నెలకొంది. ఉదయం ఎడతెరపి లేకుండా జడివాన కురవగా.. మధ్యాహ్నం నుంచి సూరీడు ప్రతాపం చూపాడు. తాజా వర్షాలకు వేరుశనగ, పత్తి, ఆముదం, కొర్ర, వరి, కంది పంటలకు నష్టం కలిగిస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
దిగుబడి తగ్గుతుందని రైతుల ఆందోళన..
ఏలూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 147.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 28 మండలాలకు గాను 22 మండలాల్లో వర్షపాతం నమోదైంది. అలాగే, డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరుసగా మూడోరోజు భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలు ఖరీఫ్ వరి రైతులకు ఇబ్బందిగా మారాయి. దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలులోని తీర ప్రాంతాల్లో ఖరీఫ్ దిగుబడి చాలాచోట్ల 20 బస్తాలు మించి రాదంటున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోనూ గురువారం మధ్యాహ్నం ఏకధాటిగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాత బస్టాండ్ ప్రాంతంలో వర్షపు నీరు నిలిచిపోయి వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment