ఖమ్మం రూరల్ : దోబూచులాడుకుంటూ కురుస్తున్న వర్షాలను నమ్ముకొని పంటలు సాగుచేసిన రైతులకు విద్యుత్ కోతల గండం వెంటాడుతోంది. జలాశయాల్లో కొద్దొగొప్పో నీటిమట్టం పెరగడంతో బావులు, బోర్లలో నీరు ఉంటుందనే ఆశతో వాటి పరిధిలో పంటలు వేశారు. అయితే విద్యుత్ కోతలు, అర్ధరాత్రి విద్యుత్ సరఫరా సమస్య
వారిని వేధిస్తోంది.
పంటలు ఎండిపోయే దశలో తుపాన్ రూపంలో వర్షాలు కురుస్తున్నాయని, దీంతో ఆశలు చిగురించి మళ్లీ పంటల కోసం అప్పు తెచ్చి ఎరువులు, పురుగుమందులు వేస్తున్నామని రైతులు చెపుతున్నారు. పత్తి, వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటలు ఇప్పుడే పెరిగే దశలో ఉన్నాయని, అయితే విద్యుత్ కోతలు ఇలాగే ఉంటే ఆ పంటలు చేతికందడం కష్టమేనని వారు ఆందోళన చెందుతున్నారు.
అప్రకటిత కోతలతో ఇక్కట్లు...
గృహ అవసరాలకు తోడు వ్యవసాయానికి కూడా అప్రకటిత విద్యుత్ కోతలు విధించడంతో రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా వ్యవసాయానికి ఏడు గంటల పాటు సరఫరా చేస్తామని ప్రకటించిన అధికారులు దీనిని ఆరు గంటలకు కుదించారు. అదికూడా నిరంతరాయంగా కాకుండా ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభిజించి ఉదయం నాలుగు గంటలు, రాత్రి వేళల్లో రెండు గంటలు సరఫరా చేస్తామని ప్రకటించారు. అయితే ఈ విద్యుత్ కూడా ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొంది.
విద్యుత్ సరఫరా అయినప్పుడు అన్ని మోటార్లు ఒకేసారి ఆన్ చేయడంతో అదనపు లోడ్ పడి తరుచూ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయి. మూలిగే నక్కపై తాటింపడు పడిన చందంగా అస్తవ్యస్త విద్యుత్ సరఫరాకు తోడు మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతుండడంతో పంటలకు రోజుల తరబడి నీరందక అవి ఎండిపోతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా 127 సబ్‌స్టేషన్లు ఉన్నాయి. వాటిలో 315 వ్యవసాయ ఫీడర్లు ఉండగా లక్ష వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లు ఉన్నాయి. వీటి ఆధారంగా బావులు, బోర్లు ద్వారా ప్రస్తుతం సుమారు 63 వేల హెక్టార్లలో వరి, 1.65 లక్షల హెక్టార్లలో పత్తి, 12 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 176 హెక్టార్లలో వేరుశనగ, సాగు చేశారు. అయితే విద్యుత్ కోతలు భారీగా ఉండడంతో దీని ప్రభావం పంటల దిగుబడిపై ఎక్కువగా ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మిరపచెట్లు వేసేందుకు నానా అవస్థలు...
ఇటీవల కుసిన వర్షాలతో మిర్చి పంట సాగుకు రైతులు ఉత్సాహం చూపినప్పటికీ విద్యుత్ కోతలతో ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. కొందరు రైతులు రాత్రిళ్లు పొలాల వద్దే కాపలా ఉంటూ, కరెంట్ ఎప్పుడొస్తే అప్పుడు మోటార్లు పెట్టి, పొలాల్లో పట్టాలు కట్టి నీరు నిల్వ చేస్తున్నారు. దీని వల్ల వారికి శ్రమతో పాటు ఆర్థికంగానూ భారం పడుతోంది.
అందోళన బాటలో అన్నదాతలు...
విద్యుత్ కోతలకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనబాట పడుతున్నారు. ఇంతకాలం భూగర్భ జలాలు అడుగంటడంతో వ్యవసాయంపై ఆశలు వదులుకున్నామని, అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలతో సాగు చేస్తున్నామని, ఈ తరుణంలో ఇష్టానుసారంగా విద్యుత్ కోతలు విధించడం ఏంటని వారు అధికారులను నిలదీస్తున్నారు. సాగుకు ప్రభుత్వం ప్రకటించిన ఏడు గంటల విద్యుత్ సరఫరా చేయకుండా మరమ్మతుల పేరుతో చీటికి మాటికి నిలిపివేస్తున్నారని రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ట్రాన్స్‌కో అధికారులు స్పందించి ప్రభుత్వం ప్రకటించిన ఏడు గంటలైనా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు.
కోతలతో విలవిల
Published Wed, Sep 10 2014 2:23 AM | Last Updated on Tue, Sep 18 2018 8:41 PM
Advertisement