రేపటికి తుపానుగా మారే అవకాశం.. అనంతరం బంగ్లాదేశ్ వైపు పయనం
ఆపై తీవ్ర తుపానుగా బలపడే అవకాశం
మూడు రోజులపాటు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు
రేపు ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం గురువారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత ఉత్తరం వైపు వెళ్లి 26వ తేదీ ఆదివారం సాయంత్రానికి బంగ్లాదేశ్, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుని తీవ్ర తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది.
దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో శుక్ర, శనివారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉంది.
శనివారం అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఆదివారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవిస్తాయని తెలిపింది.
నేడు, రేపు కొన్నిచోట్ల వడగాడ్పులు
మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో సాధారణంకంటే 3నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండురోజులు వడగాడ్పులు వీయనున్నాయి. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం 11, పార్వతీపురం మన్యం 11, కాకినాడ 1, తూర్పు గోదావరి 1 మండలం చొప్పున 33 మండలాల్లోను, శనివారం శ్రీకాకుళం జిల్లాలో 5, విజయనగరం 7, పార్వతీపురం మన్యం 5, పశ్చిమ గోదావరి 1, ఏలూరు 2, కృష్ణా 2, బాపట్ల జిల్లాలో రెండు చొప్పున 24 మండలాల్లోనూ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment