నేడు బంగ్లాదేశ్ సమీపంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్‌వర్క్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 12 కి.మీ. వేగంతో ఉత్తరం వైపు కదులుతూ ఉత్తర బంగాళాఖాతం మీదుగా శనివారం రాత్రి సమయంలో తుపానుగా మారింది. దీనికి రెమల్ అని నామకరణం చేశారు. రెమల్ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. తుపాను క్రమంగా ముందుకు కదులుతూ ఆదివారం ఉదయానికి ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఆదివారం అర్ధరాత్రి సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్‌ని ఆనుకుని ఉన్న పశి్చమ బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 110–120 కిలోమీటర్ల వేగంతో.. గరిష్టంగా 135 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని వెల్లడించారు. మరోవైపు.. నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.
ఆదివారం నాటికి నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 31లోగా కేరళ తీరాన్ని తాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. రాగల రెండు రోజుల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు రోజుల తర్వాత మళ్లీ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.పలుచోట్ల జల్లులు..
అక్కడక్కడా వర్షాలు
మన రాష్ట్రంపై తుపాను ప్రభావం లేకపోయినా.. రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తూపిలిపాలెం సముద్ర తీరంలో భీకరమైన శబ్దాలతో అలలు ఎగసి పడుతున్నాయి. తీరంలో చీకట్లు కమ్ముకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. కవిటి మండలంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంత ఇళ్లలో నీరు చేరింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా చిరు జల్లులు పడ్డాయి. తెనాలిలో తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలుచోట్ల వర్షాలు కురిశాయి.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో అత్యధికంగా 86.4 మి.మీ. భారీ వర్షం కురిసింది. శ్రీసత్యసాయి జిల్లాలోని 18 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మడకశిర మండలంలో 72.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉమ్మడి కృష్ణా జిల్లా అంతటా ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 41.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. విజయవాడ నగరంలోనూ జోరు వాన కురిసింది. పల్నాడు జిల్లాలో శనివారం అక్కడక్కడా చిరు జల్లులు కురిశాయి. జిల్లా మొత్తం చల్లటి వాతావరణం ఏర్పడింది. నరసరావుపేటలో తెల్లవారుజామున మోస్తరు వర్షం కురిసింది.
చిలకలూరిపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి పట్టణం, గ్రామాల్లో జల్లులు పడ్డాయి. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలో పలుచోట్ల చెదురుమదురు వర్షాలు కురిశాయి. ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడింది. ఏలూరు, జంగారెడ్డిగూడెం, ఏజెన్సీ ప్రాంతం, నూజివీడు, కైకలూరు, ఆచంట, మొగల్తూరు, నరసాపురం తదితర ప్రాంతాల్లో తుంపర్ల వర్ష కురిసింది. కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దేవనకొండలో 62.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment