ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, చెన్నై: అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడే సూచనలు ఉన్నాయని వెల్లడించారు.
అనంతరం తమిళనాడు ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. అల్పపీడన ప్రభావంతో కోసాంధ్ర జిల్లాల్లో ఈ నెల 17 తరువాత అక్కడక్కడా మోస్తరు వానలు పడే సూచనలున్నాయని తెలిపారు.
తమిళనాడులో భారీ వర్షాలు
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి జిల్లాలను వర్షం ముంచెత్తడంలో జనజీవనం స్తంభించింది. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల క్రితం బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం తీరాన్ని తాకినప్పటి నుంచి తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి జిల్లాలో వర్షాలు ముంచెత్తుతున్నాయి.
లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు తామర భరణి నదిలో ప్రవహిస్తుండటంతో తీరగ్రామాల ప్రజల్లో ఆందోళన ఉధృతమైంది. విరుదునగర్ జిల్లా శివకాశీ సమీపంలోని ప్రమాదవశాత్తూ నీటి గుంటలో పడి రాజేశ్వరి (32), ఆమె కుమారుడు దర్శన్ (5) మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment