
తల్లిదండ్రులు లేకున్నా విజయపథానికి
మొక్కవోని దీక్షతో కలల సాకారానికి ప్రయత్నిస్తున్న భట్టిపాటి ప్రియాంక
సీతమ్మధార: తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో ఆ బాలిక భవిష్యత్ అంధకారంలో పడిపోతుందనుకున్నారు. అమ్మమ్మ అన్నీ అయి చదివించారు. సీతమ్మధార పాపాహోంలో(Seethammadhara) ఉంటూ చదువుకున్న ఆమె ప్రస్తుతం ఉన్నతోద్యోగం చేయడం విశేషం. దీంతో త్వరలోనే పాపాహోం ఆవరణలో ఆమెకి ఘనంగా సత్కారం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ యువతి విజయగాథ మనమూ తెలుసుకుందాం.
గూడూరుకు చెందిన భట్టిపాటి ప్రియాంక (21)(Bhattipati Priyanka) విశాఖ జిల్లా తగరపువలసలో మేనమామ వద్ద ఉంటూ చదువుకునేది. 9వ తరగతి చదివే సమయంలో 2017లో పాపాహోంలో చేరింది. సీతమ్మధారలోని డాల్ఫిన్ స్కూల్లో 9, పది చదివింది. ఈమెకి తల్లి లేరు. తండ్రి రెండో వివాహం చేసుకున్నారు. ప్రియాంక డిప్లమో ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ (డీసీసీ) పూర్తి చేసింది. తర్వాత నెల్లూరు జిల్లాలో డీకేడబ్ల్యూ కళాశాలలో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ బ్రాంచ్‌లో (సీఏ)లో చేరింది.
భీమునిపట్నం పాలిటెక్నిక్ కళాశాలలో పాపాహోం ఆర్థిక సాయంతోనే డిప్లమో చదివింది. ఈ కళాశాల నుంచి విద్యార్థుల వివరాలు పంపడంతో శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్‌లో ఏడాది పాటు అప్రెంటిస్ శిక్షణకు ఎంపికై శిక్షణ తీసుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ శిక్షణ పూర్తి అయింది. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా బెంగళూరులోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో అకౌంట్స్‌లో సీహెచ్‌ఎస్‌ఎస్ పోస్టులో కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తోంది. ప్రస్తుతం ఆమెకి రూ.22 వేల వేతనం అందుతోంది.
రాకెట్ లాంచింగ్ ఉద్యోగమే లక్ష్యం..
నేను 2003లో గూడూరులో పుట్టాను. 2008లో నా తల్లిదండ్రులు విడిపోయారు. గూడూరులోని అమ్మమ్మ వద్దే పెరిగాను. విశాఖలోని పాపాహోంలో ఉంటూ డాల్ఫిన్ స్కూల్లో 9వ తరగతిలో చేరాను. అక్కడే పదో తరగతి పూర్తి చేశాను. భీమిలిలో డిప్లమో చేశాను. 2018లో తల్లి ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఎక్కడున్నారో తెలియదు. రాకెట్ లాంచింగ్ సెంటర్‌లో ఉద్యోగమే ధ్యేయంగా పని చేస్తున్నాను. గూడురులో అమ్మమ్మ బాగోగులు నేనే చూస్తున్నాను.
– ప్రియాంక, బెంగళూరు.
Comments
Please login to add a commentAdd a comment