Top CEO Of 2022 In US Grandhi Anil Life Success Story In Telugu - Sakshi
Sakshi News home page

Grandhi Anil Success Story: రాజాం టు అమెరికా.. కష్టాలను ఈది సూపర్‌ సీఈవోగా

Published Tue, Jul 19 2022 11:30 AM | Last Updated on Tue, Jul 26 2022 11:09 AM

 Success Story On Rajam  Residency Grandhi Anil - Sakshi

విజయనగరం (రాజాం సిటీ): ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు పెడుతూ కుంగదీసినప్పటికీ వెనక్కు తగ్గకుండా చదువుపై శ్రద్ధ కనబరిచాడు. డిగ్రీ చదువుకునే రోజుల్లో కుటుంబ బాధ్యత తీసుకుని, పార్ట్‌ టైం ఉద్యోగం చేస్తూ నెట్టుకొచ్చాడు. పట్టుదలే ఆయుధంగా చేసుకుని జీవితం అయిపోయిందనుకునే స్థాయి నుంచి అమెరికా దేశం గుర్తించేలా నిలిచి అందరి మన్ననలు అందుకుంటున్నారు. ట్యాక్స్‌ ప్లానింగ్‌ అండ్‌ సీఈఓ సేవలపై వ్యాపార యజమానులకు అందించిన వినూత్న సేవలను గుర్తించి 2022లో టాప్‌ 20 సీఈఓలలో ఒకరుగా సీఈఓ పబ్లికేషన్‌ ఆయనను గుర్తించింది. ఆయనే రాజాం పట్టణానికి చెందిన గ్రంధి అనిల్‌. బాల్యంలోని ఆయన చదువు నుంచి అంతర్జాతీయ గుర్తింపు పొందినంత వరకు ఆయన ప్రస్థానం ఆయన మాటల్లోనే..  

రాజాంలో ప్రాథమిక విద్య చదువుతున్న నేను నాలుగో తరగతి  నుంచే వ్యాపారంపై మక్కువ పెంచుకున్నాను. రాజాంలోని భారతీయ విద్యాభవన్‌లో 5వ తరగతి, 6వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో, 7 నుంచి 10వ తరగతి వరకు ఏజేసీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదువుకున్నాను. ఇంటర్‌లో ఎంపీసీ చదివి ఇంజనీర్‌ కావాలని స్నేహితులు, కుటుంబ సభ్యులు సలహాలు ఇచ్చినప్పటికీ డాక్టర్‌ కావాలనే బలమైన కోరికతో బైపీసీలో జాయిన్‌ అయ్యాను. ఇంటర్‌ మొదటి సంవత్సరం గరివిడి శ్రీరామ్‌ జూనియర్‌ కళాశాలలో, ద్వితీయ సంవత్సరం దాకమర్రిలోని రఘు కళాశాలలో పూర్తిచేశాను. అంతే ఉత్సాహంతో ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించాను. కానీ ఆర్థిక ఇబ్బందులతో ఎంబీబీఎస్‌ చదవలేకపోయాను. అదే సమయంలో కుటుంబాన్ని చూసుకుంటూ చదువు కొనసాగించాలనే కృతనిశ్చయంతో జీసీఎస్‌ఆర్‌ కళాశాలలో బీకాం డిగ్రీలో చేరాను.  ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఎదురీది డిగ్రీ పూర్తిచేసి బీకాంలో సిల్వర్‌ మెడల్‌ పొందాను.  

పార్ట్‌ టైం జాబ్‌తో ఊరట   
ఓ వైపు డిగ్రీ చదువుతుండగానే మరో వైపు పార్ట్‌ టైం ఉద్యోగాలు చేస్తుండేవాడిని. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఒడిదొడుకుల మధ్య డిగ్రీ పూర్తిచేశాను. తరువాత ఎంబీఏ చేయాలనుకున్నప్పటికీ అధ్యాపకుల సలహాతో సీఏ చేశాను. 

ఉద్యోగం ప్రస్థానం  
2008లో ఐసీఏఐ (ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంట్‌) చెన్నై క్యాంపస్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో మంచి జీతంతో ఎంపికయ్యాను. అక్కడి నుంచి శివ గ్రూపులో ఫైనాన్స్‌ కంట్రోలర్‌గా మూడేళ్లు పనిచేశాను. తరువాత తారస్‌ క్వస్ట్‌ కంపెనీలో ఫైనాన్స్‌ హెడ్‌గా ఉద్యోగం, యూఎస్‌ఏకు చెందిన సన్‌ ఎడిషన్‌ ఫైనాన్స్‌ కంట్రోలర్‌గా రెండేళ్లు పనిచేశాను. అక్కడ నా ప్రతిభ ఆధారంగా యూఎస్‌ హెడ్‌ఆఫీస్‌ నుంచి పిలుపురావడంతో వెళ్లి ట్రెజరీ ఆపరేషన్స్‌  దిగి్వజయంగా పూర్తిచేయగలిగాను. ఆ తరువాత అమెజాన్‌లో ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం లభించింది. దీంతో నా స్కిల్స్‌ మరింత డెవలప్‌ చేసుకోగలిగాను. తరువాత స్టార్‌బక్స్‌ కంపెనీలో చేరి ఖాళీ సమయంలో ట్యాక్స్‌ బిజినెస్‌ డెవలప్‌ చేసుకోగలిగాను.  

కరోనా సమయంలో సహాయం 
కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న కంపెనీలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రుణ సౌకర్యం కలి్పంచింది.  ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని బిజినెస్‌ యజమానులకు హెల్ప్‌ చేయగలిగాను. దాంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ హెల్పింగ్‌ నేచరే  అమెరికాలో గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తరువాత ఏజీ ఫిన్‌ టాక్స్‌ అనే ట్యాక్స్‌  ప్లానింగ్‌ సరీ్వస్‌ ప్రారంభించాను. ట్యాక్స్‌ ప్లానింగ్‌ అండ్‌ సీఈఓ సేవలపై వ్యాపార యజమానులకు అందించిన వినూత్న సేవలను గుర్తించిన సీఈఓ పబ్లికేషన్‌ 2022లో టాప్‌ 20 సీఈఓలలో ఒకరిగా గుర్తించిందని గ్రంధి అనిల్‌ వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement