
సాక్షి, విశాఖపట్నం: సంగివలస అనిల్ నీరుకొండ ఆస్ప త్రిలో చికిత్సకు వచ్చిన మానసిక వికలాంగురాలైన బాలికపై శనివారం రాత్రి అత్యాచారం జరిగిన ఘటనతో ఈ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. బాధితురాలితో పాటు అత్యాచార ఘటనకు పాల్పడిన నిందితుడు(35) ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతం కావడం గమనార్హం. సంఘటన శనివారం రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య జరిగినా ఆస్పత్రి సిబ్బంది ఆదివారం వరకు భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.
సంఘటన జరిగిన తర్వాత నిందితుడిని ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ గదిలో ఉంచారు. అత్యాచారానికి గురైన బాలిక ఆదివారం ఉదయం వరకు రక్తస్రావంతో బాధపడుతున్నట్టు తెలిసింది. అత్యాచార సమాచారం అందుకున్న మీడియా ఆస్పత్రి వద్ద ఆరా తీయడంతో భీమిలి పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు ఆస్పత్రిలోకి రాక ముందే బాధితురాలి కుటుంబ సభ్యులతో ఆస్పత్రి యాజమాన్యం చర్చలు జరిపి రాజీకి వచ్చినట్టు తెలిసింది.
తరువాత మధురవాడ జోన్ ఏసీపీ అప్పలరాజు ఆస్పత్రి వద్దకు చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఆస్పత్రి సిబ్బంది మీడియాను ఏమార్చి నిందితుడిని ఆటోలో జాతీయరహదారి వరకు తరలించి అక్కడ నుంచి ఒడిశాకు పంపించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలికపై అత్యాచారం జరిగినట్టు ఆధారాలు లేదా వారి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు ఉంటే తప్ప ఏమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు. ఇదిలా ఉండగా నిందితుడు బాధితురాలిని మూడో ఫ్లోర్ నుంచి ఆరో ఫ్లోర్‌కు తీసుకువెళ్లినట్టు తెలిసింది. సంఘటన జరిగినా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
సంగివలస అనిల్ నీరుకొండ ఆస్పత్రి యాజమాన్యం తరచూ విశాఖ, విజయనగరం, ఒడిశాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం కోసం ఇక్కడకు తీసుకొస్తుంటారు. ప్రస్తుతం అత్యాచార బాధితురాలు, నిందితుడు ఇదే విధంగా చికిత్స కోసం మల్కన్‌గిరి నుంచి వచ్చారు.
అత్యాచారయత్నమే జరిగింది..
ఆస్పత్రి సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ మల్కన్‌గిరి నుంచి వచ్చిన 25 మందికి చికిత్స తరువాత శనివారం డిశ్చార్జ్ చేశామన్నారు. చీకటి పడటంతో ఆదివారం పంపించడానికి గానూ వారిని ఆరో ఫ్లోర్‌లో ఉంచామన్నారు. బాధితురాలు వాష్ రూమ్‌లోకి వెళ్లగా నిందితుడు ఆమె వెంట వెనకే వెళ్లాడన్నారు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో మిగిలిన వారు అతనికి దేహశుద్ధి చేసి తమకు అప్పగించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment