
హోటల్ సిబ్బందిని విచారిస్తున్న పోలీసులు
కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్న మూడో పట్టణ పోలీసులు
సాక్షి, విశాఖపట్నం: ఎన్‌ఆర్‌ఐ మహిళ రోజా అనుమానాస్పద మృతిపై మూడో పట్టణ పోలీసులు విచారణ ప్రారంభించారు. హోటల్ సిబ్బందిని ఆదివారం పిలిపించి ఈ సంఘటన జరిగిన 6వ తేదీన మేఘాలయ హోటల్ రూమ్ నంబరు 229లో ఏమి జరిగిందోనని వివరాలు సేకరించారు. రోజా ఆమె స్నేహితుడు పిల్లా శ్రీధర్ ఎప్పుడు హోటల్‌కు వచ్చారు? వారికోసం ఎవరైనా వచ్చారా? హోటల్ సిబ్బందితో ఎలా ప్రవర్తించేవారు? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమికంగా ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారిస్తున్నప్పటికీ.. పోస్టుమార్టం రిపోర్టు వస్తే కాని ఏమి చెప్పలేని పరిస్థితి నెలకొంది.
కేసు నీరుగార్చే ప్రయత్నం?
ఈ కేసును మొదటి నుంచి కప్పిపుచ్చేందుకు పోలీసులు ప్రయతి్నస్తున్నారు. సంఘటన జరిగిన రోజు సాయంత్రం మేఘాలయ హోటల్ మేనేజర్ ఫిర్యాదు చేస్తే కనీసం ఏమి జరగనట్లు మూడో పట్టణ పోలీసులు వ్యవహరించారు. చివరికి మీడియా ప్రతినిధులు పోలీసులను సంప్రదించినా అటువంటది ఏమి లేదని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అయితే మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో పోలీసులు విచారణ షురూ చేశారు. కానీ ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన అంశాలను పరిశీలిస్తే కేసును నీరుగార్చే విధంగా ఉంది.
కేసులో నిందితులు ఎవరు లేరు?
మూడో పట్టణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అసలు నిందితులు ఎవరు లేరని పేర్కొన్నారు. హోటల్ మేనేజర్ తన ఫిర్యాదులో రోజా మృతి పట్ల అనుమానంగా ఉందని తెలిపారు. తొలుత డాక్టర్ శ్రీధర్ అనే వ్యక్తి హోటల్ రూమ్ నుంచి బయటకి వచ్చి రూమ్ డోర్ అనుకోకుండా లాక్ అయిందని చెప్పారని, రూమ్ దగ్గరకి వెళ్లేసరికే తన స్నేహితురాలు అపస్మారక స్థితిలో ఉందని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినా సరే శ్రీధర్‌ను నిందితుడిగా చేర్చకుండా పొలీసులు విచారణ చేయడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఫిర్యాదులోనూ లొసుగులు?
నిజానికి మేఘాలయ హోటల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదులో కూడా చాలా లొసుగులు ఉన్నాయి. డాక్టర్ శ్రీధర్ 6వ తేదీ మధ్యాహ్నం 1.15 గంటలకు హోటల్‌కు వచ్చినట్లు.. 1.40 గంటలకు రోజా నేరుగా హోటల్ రూమ్ నంబర్ 229కి వెళ్లినట్లు పేర్కొన్నారు. 3.35 గంటలకు శ్రీధర్ రూమ్ నుంచి బయటకి వచ్చి హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. రెండు గంటల పాటు రోజా, శ్రీధర్ మాత్రమే రూమ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. రూమ్‌లో శ్రీధర్ ఉండగా రోజా బాత్‌రూమ్‌లో ఆత్మహత్య చేసుకుందా..? అసలు హుక్ గానీ, కిటీకీ గాని లేని బాత్‌రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంటుందా..? హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా? ఇలా అనేక సందేహాలు ఈ కేసు చుట్టూ తిరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment