
ఎట్టకేలకు ఆమె స్నేహితుడు డాక్టర్ శ్రీధర్ అరెస్ట్
ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు సమాచారం
సాక్షి, విశాఖపట్నం: ఎన్‌ఆర్‌ఐ మహిళ రోజా అనుమానాస్పద మృతి క్రైం థ్రిల్లర్‌ను తలపిస్తోంది. కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నగర పోలీసు కమిషనర్ ఆదేశాలతో ఎట్టకేలకు మృతురాలి స్నేహితుడు, నిందితుడిగా భావిస్తున్న డాక్టర్ శ్రీధర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎన్‌ఆర్‌ఐ మహిళ రోజాకు.. డాక్టర్ శ్రీధర్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటి?.. రోజా హోటల్‌కు వచ్చిన రెండు గంటల్లో అనుమానాస్పదంగా మృతి చెందడం వెనుక ఏం జరిగిందో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 1.40 గంటలకు శ్రీధర్‌ను కలిసేందుకు మేఘాలయ హోటల్‌లోని రూం నంబర్ 229కి రోజా వెళ్లింది. 3.35 గంటల తరువాత ఆమె బాత్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో ఉందని శ్రీధర్ హోటల్ సిబ్బందికి చెప్పాడు.
హత్యా? ఆత్మహత్యా?
రెండు గంటల వ్యవధిలో రోజా అనుమానాస్పదంగా మృతి చెందడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. రెండు గంటలు ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారు. ఈ సమయంలో రోజా–శ్రీధర్‌కు మధ్య గొడవ జరిగిందా?.. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడా? అందుకే ఆమె ఆత్మహత్య చేసుకున్నా ఆపకుండా చూస్తూ ఉండిపోయాడా?.. మృతి చెందిందని నిర్ధారించుకున్న తరువాతే హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. నిజానికి రోజాను ఆత్మహత్య చేసుకునేలా అమెరికాలో ఉన్నప్పటి నుంచే శ్రీధర్ ప్రేరేపిస్తున్నాడని పోలీసులు విచారణలో తెలినట్లు తెలిసింది. ఒకవేళ రోజాది ఆత్మహత్య కాకపోతే అదే రూమ్‌లో ఉన్న శ్రీధర్ ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోజా పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప నిజనిజాలు బయట పడే అవకాశం లేదు.

ఎఫ్‌ఐఆర్‌లో శ్రీధర్ పేరు చేర్చలేదెందుకు?
ఈ కేసులో మొదటి నుంచి పోలీసులు నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. డాక్టర్ శ్రీధర్‌ను కేసు నుంచి తప్పించేయత్నం జరుగుతోందని విస్తృతంగా ప్రచారం జరిగింది. కేసు తేలిపోయేవిధంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఒకే గదిలో రోజా–శ్రీధర్ ఉన్న సమయంలో.. రోజా అనుమానాస్పదంగా మృతి చెందితే ఎఫ్‌ఐఆర్‌లో శ్రీధర్ పేరు చేర్చకపోవడం చర్చనీయాంశమైంది. కేసును నీరుగార్చేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించారు? డాక్టర్ శ్రీధర్ వెనుక ఎవరున్నారు? పోలీసులపై ఎవరి ఒత్తిడైనా ఉందా? అన్న ప్రశ్నలకు వారే సమాధానం చెప్పాలి. ఈ కేసు విషయంలో విమర్శలు రావడంతో ఎట్టకేలకు మూడో పట్టణ పోలీసులు శ్రీధర్‌ను అరెస్టు చేసినట్లు ఆదివారం ఆర్ధరాత్రి ప్రకటించారు.
అన్ని వేళ్లూ పోలీసులవైపే..
ఎన్‌ఆర్‌ఐ మహిళా అనుమానాస్పద మృతిపై పోలీసులు చర్యలు విమర్శలకు తావిచ్చింది. సంఘటన జరిగిన వెంటనే శ్రీధర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తే నిజనిజాలు బయటపడేవి. అయితే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి విచారణ వరకు అన్ని వేళ్లు వారివైపే చూపించేలా వ్యవహరించారు. 6వ తేదీన రోజా మృతి చెందినప్పటికీ 8వ తేదీ వరకు అటువంటి ఘటన జరగలేదు అన్నట్లు వ్యవహరించారు. పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు తప్పు చేస్తే వెనకేసుకువచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు. పేద, మధ్యతరగతికి చెందిన ఎవరైనా తప్పు చేస్తే మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రచారం చేసుకునే పోలీసులు ఈ కేసు విషయంలో పాటిస్తున్న గోప్యత అనుమానాలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment