నాగ్‌పూర్‌లో జలమయమైన విధాన్‌భవన్ ప్రాంగణం
నాగ్‌పూర్: భారీగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ అంతరాయం కలగడంతో శుక్రవారం మహారాష్ట్ర శాసనసభ స్తంభించింది. సభ ప్రారంభం కాకముందే సభను రేపటికి వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో బీజేపీ మిత్రపక్షమైన శివసేనతో పాటు విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. శుక్రవారం ఉదయం శాసన సభ, మండలి ప్రారంభమైన కొద్ది సేపటికే సభలో చీకటి అలుముకోవడంతో ఒక రోజుకు వాయిదా పడింది. గురువారం రాత్రి నాగ్‌పూర్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో అసెంబ్లీకి విద్యుత్ సరఫరా చేసే కేంద్రంలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది.
సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు మాట్లాడాలని భావించినా విద్యుత్ లేకపోవడంతో మైకులు పనిచేయలేదు. మరమ్మతులు జరుగుతున్నాయని అసెంబ్లీ స్పీకర్ హరిభావ్ బాగ్దే సభను తొలుత గంటపాటు వాయిదా వేశారు. ఆ తర్వాత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్ని పార్టీల సభ్యులతో సమావేశమై ఒక రోజుకు వాయిదా వేసేలా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ‘నగరంలో ఇప్పటికే రెండు మూడు సార్లు వర్షం పడింది. అయితే గురువారం రాత్రి మాత్రం భారీగా వర్షం పడింది. విద్యుత్ సరఫరా చేసే విభాగం సెల్లార్‌లో ఉండటంతో ఆ ప్రాంతం అంతా వర్షపు నీరు చేరింది. దీంతో విద్యుత్ కు అంతరాయం కలిగింది’అని చెప్పారు. నాగ్‌పూర్‌లో తొలిసారి వర్షాకాల సమావేశాలను నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment