నీటిమూటేనా ?
తుంగభద్ర కాలువల ఆధునికీకరణపై పాలకుల్లో కనిపించని చిత్తశుద్ధి
ఏపీ, కర్ణాటక సీఎంల చర్చలు నిష్ఫలం
సాక్షి, బళ్లారి : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నీరందించే తుంగభద్ర జలాశయం పరిధిలోని హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ కాలువల ఆధునికీకరణ చేస్తామని పాలకులు ఇచ్చిన హామీ నీటి మూటగా మారింది. వరద కాలువ నిర్మాణాలపై పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడంతో రైతులకు శాపంగా మారిం ది. తుంగభద్ర డ్యాంలోకి ఏటా పుష్కలంగా నీరు వస్తున్నప్పటికీ తగినంత నిల్వ ఉంచుకునే సామర్థ్యం లేకపోవడంతో ఏటా 200 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది.
ఇందులో కనీసం కొంత నీరైనా రైతులకు ఉపయోగించేలా చర్యలు చేపట్టడంలో పాలకు లు విఫలమవుతున్నారు. తుంగభద్ర డ్యాం సామర్థ్యం 134 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం పూడిక చేరి పోవడంతో 101 టీఎంసీలకు పడిపోయింది. దా దాపు 33 టీఎంసీల నీటి నిల్వ మేర పూడిక చేరడం తో పూడిక తీత సాధ్యాసాధ్యాలపై ఆధ్యయనం పూ ర్తిస్థాయిలో చేయలేదు. దీంతో నీటి వాటా దామాషా ప్రకారం పూర్తిగా తగ్గించి వేశారు.
అనంతపురం జిల్లాకు 32 టీఎంసీలు నీరు అందాల్సి ఉండగా, ప్రస్తుతం 22 టీఎంసీలు మాత్రమే అందిస్తున్నారు. బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాలకు ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో పూడికవల్ల నష్టపోతున్న నీటిని ఎలాగైనా పొందాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆరు నెలల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో బెంగళూరులో భేటీ అయ్యారు. పూడిక వల్ల నష్టపోతున్న నీటిని పొందాలంటే హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ కాలువల ఆధునీకరణ చేపడితే కొంత మేలు జరుగుతుందని చర్చించారు.
వరద కాల్వ నిర్మాణాలపై చర్చించినప్పటికీ ఆధునీకరణకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే తుంగభద్ర డ్యాం పరిధిలో వరద కాల్వ నిర్మాణాలు చేపడితే బళ్లారి, అనంతపురం జిల్లాలకు ఎంతో మేలు జరుగుతుందని ఈ ప్రాంత రైతులు అభిప్రాయ పడుతున్నారు. ప్రతి ఏటా కాలువల తాత్కాలిక ఆధునీకరణ పనులకు తూతూమంత్రంగా నిధులు విడుదల చేస్తున్నారు. పనులు ఆలస్యంగా చేపట్టడం, టెండర్లు ఆలస్యంగా పిలవడం వల్ల కాలువల మరమ్మతులు కూడా సక్రమంగా చేయడం లేదు.
ఈ నేపథ్యంలో సీఎంలు ఇద్దరు తుంగభద్ర కాలువలపై చర్చలు జరపడంతో రైతుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. అయితే ముఖ్యమంత్రులు చంద్రబాబు, సిద్ధరామయ్య చర్చించిన మేరకు ఆధునీకరణపై ఎలాంటి ముందడుగు లేకపోవడంతో ఈ ఏడాది ఆధునీకరణ అటకెక్కినట్లేని భావిస్తున్నారు. ప్రస్తుతం మేలోకి అడుగు పెట్టబోతున్నాం.
మే, జూన్ రెండు లేదా మూడవ వారంలోపు తుంగభద్ర కాలువ ఆధునీకరణ పనులకు చేపట్టాలి. ఆ తర్వాత కాలువలకు నీరు విడుదల చేసినప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా నిలిపి వేస్తారు. ప్రస్తుతం డీపీఆర్(డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) కూడా పిలవకపోవడంతో తుంగభద్ర కాలువల ఆధునీకరణపై ముఖ్యమంత్రికి ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.