రైతును వేధిస్తే జైలుకే | Farmer harassing prison | Sakshi
Sakshi News home page

రైతును వేధిస్తే జైలుకే

Published Sun, Jul 5 2015 4:39 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

రైతును వేధిస్తే జైలుకే - Sakshi

రైతును వేధిస్తే జైలుకే

‘అప్పులిచ్చిన వడ్డీవ్యాపారులు, రైతులను వేధిస్తే జైలుకెళ్లక తప్పదు. రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకు అండగా ప్రభుత్వం ఉంటుంది.’
- ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
 
- రుణదాతలకు సీఎం సిద్ధరామయ్య హెచ్చరిక
- ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు
- గత ప్రభుత్వాల్లోనే ఎక్కువగా రైతు ఆత్మహత్యలు
సాక్షి, బళ్లారి :
రాష్ట్రంలో రైతులను రుణదాతలు వేధిస్తే జైలుకెళ్లక తప్పదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరించారు. అన్నదాతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉందని చెప్పారు. ఆయన శనివారం బళ్లారి జిల్లాలోని తోరణగల్లు వద్ద జిందాల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన వివిధ నిర్మాణాలు, వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తనను ఎంతో బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 28 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయని, అయితే ఇందులో 8మంది మాత్రమే రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తమకు స్పష్టమైన నివేదిక అందిందన్నారు. మిగిలిన వారు వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నారని, అయితే కారణం ఏదైనా ఆత్మహత్య చేసుకోవడం తగదని హితవు పలికారు.

మనోధైర్యంతో జీవితాన్ని ముందుకు సాగించాలన్నారు. రైతులకు ప్రైవేటుగా అప్పులు ఇచ్చిన వారు వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారి, ఎస్‌పీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అవసరమైతే రైతులను వేధించిన రుణదాతలను జైలుకు పంపేందుకు కూడా వెనుకాడబోమన్నారు. పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేయడంతో కొందరు తనను విమర్శిస్తున్నారని, అయితే పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసినంత మాత్రాన వారు సోమరులుగా మారిపోరని చెప్పారు. ధనవంతులు నిరంతరం కూర్చొని తిండి తినగా లేనిది పేదవారు కడుపునిండా అన్నం తినకూడదా? అని ప్రశ్నించారు. అన్ని వర్గాల వారికి సమన్యాయం పాటించే విధంగా తమ పాలన సాగిస్తున్నామన్నారు.
 
త్వరలో ఐదు రోజులపాటు పాలు
రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. విద్యార్థులకు ప్రస్తుతం వారానికి మూడు రోజుల పాటు పాలు అందిస్తున్నామని, త్వరలో ఐదు రోజులపాటు పాఠశాలల్లో పాలు అందించి వారిని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో శుద్ధ మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.5 వేల కోట్లు కేటాయించామన్నారు.

ధనవంతులు పొందుతున్న కార్పొరేట్ వైద్యాన్ని పేదలకూ అందించేందుకు తమ ప్రభుత్వం బీపీఏల్ కార్డుదారులతోపాటు ఏపీఎల్ కార్డుదారులకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేసిందన్నారు. జిందాల్ సంస్థ ఆధ్వర్యంలో అత్యాధునిక ఆస్పత్రి ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా దేశంలో జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ నంబర్ వన్ కావడం కర్ణాటకకే గర్వకారణంగా ఉందన్నారు. ఇక్కడ వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని, ఈ నేపథ్యంలో జిందాల్ సంస్థ పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం వారి కర్తవ్యంలో భాగంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు మహాదేవప్ప, యూటీ ఖాదర్, పరమేశ్వర నాయక్, కిమ్మనె రత్నాకర్, జిల్లాధికారి సమీర్ శుక్లా, జిందాల్ సంస్థ ఎండీ సజ్జన్ జిందాల్, జిందాల్ సీఈఓ వినోద్ నావెల్, స్థానిక ఎమ్మెల్యే తుకారాం, బళ్లారి సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌లాడ్, ఎన్ వై గోపాలకృష్ణ, మాజీ విధాన పరిషత్ సభ్యుడు కేసీ కొండయ్య, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, మాజీ మంత్రులు దివాకర్‌బాబు, అల్లం వీరభద్రప్ప, కాంగ్రెస్ నాయకుడు వెంకటరావు ఘోర్పడే తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement