తుంగభద్ర నిండాలి.. రైతు ఆశలు పండాలి..!
ఆదోని: జూలైలో 10 రోజులు గడిచిపోయినా తుంగభద్ర రిజర్వాయర్ నిండకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లా ప్రజల సాగు, తాగునీటి ప్రధాన వనరు కావడంతో తుంగభద్రమ్మ పరవళ్లు తొక్కాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. టీబీ డ్యామ్‌లో శుక్రవారం నాటికి 14.5 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. తుంగ, భద్ర నదుల పరివాహక ప్రాంతాల్లో వర్షాలు పూర్తి స్థాయిలో కురవకపోవడంతో రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో తక్కువగా ఉంది. కేవలం 560 క్యూసెక్కుల నీరు వస్తోంది.
దీంతో డ్యామ్ ఎప్పుడు నిండుతుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. తుంగభద్ర దిగువ కాలువ(ఎల్‌ఎల్‌సీ) కింద ఖరీఫ్‌లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మెట్ట భూముల్లో రైతులు జోరుగా విత్తనం వేస్తున్నారు. అయితే ఆయకట్టు భూముల్లో పంటలు వేయాలా వద్దా అని రైతులు సతమతమవుతున్నారు. ఆదోని, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాలలో దిగువ కాలువ కింద 1.51 లక్షల ఎకరాలు ఆయకట్టును స్థిరీకరించగా ఇందులో సుమారు 49 వేల ఎకరాలు ఖరీఫ్‌లోనే ఉంది.
గత ఏడాది జూలై ఒకటో తేదీ నాటికే ప్రాజెక్ట్‌లోకి పూర్తి స్థాయిలో నీరు చేరింది. దాదాపు వంద టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో జూలై 9 నుంచి ఎల్లెల్సీకి నీరు వదిలేందుకు ఐఏబీ సమావేశం తీర్మానించింది. అయితే గండ్లకెరి వద్ద ఎస్కేప్ చానల్ క్రస్ట్ గేట్లు విడిగి పడడంతో నీటి విడుదల మూడు రోజులు ఆలస్యమైంది. 16వ తేదీ నాటికి జిల్లా సరిహద్దుకు నీరు చేరింది. దీంతో వెంటనే రైతులు వరి పంట సాగుకు శ్రీకారం చుట్టారు. దాదాపు 27 వేల ఎకరాలలో రైతులు వరి పంటను సాగు చేశారు. అయితే ఈ ఏడాది ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ అత్యంత అధ్వానంగా ఉంది. జిల్లా అధికారులు కూడా ఇంత వరకు ఐఏబీ సమావేశం ఎప్పుడు ఉంటుందో చెప్పడం లేదు.
ప్రాజెక్టులో నీటి చేరిక అంతంత మాత్రంగా ఉండడంతో ఐఏబీ సమావేశం నిర్వహించినా నీటి విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాగా.. ఎల్లెల్సీకి నీరు ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని ఇన్‌చార్జ్ ఈఈ భాస్కరరెడ్డి శుక్రవారం తెలిపారు. నీటి విడుదల ఉంటుందో ఉండదో స్పష్టం చేస్తే ఆయకట్టు భూముల్లో కనీసం మెట్ట పంటలు అయినా సాగు చేసుకుంటామని రైతులు పేర్కొంటున్నారు.