సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ అధికారికంగా శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది వర్షాలు సాధారణంగా ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో లక్ష్యానికి అనుగుణంగా ఖరీఫ్ సాగుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను వ్యవసాయ శాఖ సంసిద్ధం చేసింది. నైరుతీ రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడానికి మరో వారం రోజులు పడుతుందని వాతావరణ శాఖ భావిస్తోంది. బావుల కింద తప్ప ఇంకా ఎక్కడా దుక్కులు దున్నడం ప్రారంభం కాలేదు. ఏరువాక వచ్చే వరకు కాడీ మేడీ కదిలే పరిస్థితి లేనప్పటికీ వ్యవసాయ శాఖ ఇప్పటికే ఖరీఫ్ ప్రణాళికను ఖరారు చేసింది. విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ మొదలు పెట్టింది. వ్యవసాయ శాఖ క్యాలెండర్ ప్రకారం జూన్ ఒకటిన ఖరీఫ్ సీజన్ మొదలై అక్టోబరుతో ముగుస్తుంది. ఈ సీజన్‌లో వచ్చే నైరుతీ రుతుపవనాలతో 556 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. జూన్‌లో 93.7, జూలైలో 151.3, ఆగస్టులో 88.2, సెప్టెంబర్‌లో 152.7 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. అక్టోబరు నుంచి ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమవుతాయి. వేసవి కాలంలో సాగుచేసే పచ్చిరొట్ట పంటల్ని జూన్ నెలలో చేలల్లోనే తొక్కించి జూలై నుంచి పునాస పంటలకు రైతులు సంసిద్ధమవుతారు.
సాగు విస్తీర్ణం పెంపు
ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 42.04 లక్షల హెక్టార్లలో పంటల్ని సాగు చేయించాలని వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇది గత ఏడాది ఖరీఫ్ కన్నా 2.51 లక్షల హెక్టార్లు ఎక్కువ. గత ఏడాది 39.53 లక్షల హెక్టార్లుగా నిర్ణయించినప్పటికీ సాగయింది మాత్రం 35.47 లక్షల హెక్టార్లే. ఈ సీజన్‌లో వర్షపాతం సాధారణంగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో విస్తీర్ణం పెంచాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఖరీఫ్ ప్రణాళికపై అవగాహన కల్పించేలా అన్ని జిల్లాలలో సదస్సులు నిర్వహించింది. చిరుధాన్యాలకు పెద్దఎత్తున ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. ఆహార పంటల్లో ప్రధానమైన వరిని 16.25 లక్షల హెక్టార్లలో, జొన్న, మొక్కజొన్న, రాగి, చిరుధాన్యాలన్నింటినీ కలిపి 2.66 లక్షల హెక్టార్ల సాగుగా ఖరారు చేసింది. రాయలసీమలో ప్రధాన పంట అయిన వేరుశనగను 9.16లక్షల హెక్టార్లుగా నిర్ణయించి సుమారు 6 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంచేసినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఇతర పంటల్లో ముఖ్యమైన పత్తి సాగు విస్తీర్ణం 5.63 లక్షల హెక్టార్లుగా, మిర్చి 1.34 లక్షల హెక్టార్లుగా ఖరారు చేశారు.
15 విత్తన సంస్థలపై నిషేధం
ఇదిలా ఉంటే.. కల్తీ విత్తనాల బెడదను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే సుమారు 15 విత్తన సంస్థలపై వ్యవసాయ శాఖ నిషేధాన్ని విధించింది. ఈ కంపెనీల నుంచి విత్తనాలు కొని మోసపోవొద్దని హెచ్చరించింది. బీటీ పత్తి విత్తనాల పేరిట కొందరు బోల్‌గార్డ్–3 అనే అనుమతిలేని పత్తి విత్తనాలను కూడా అంటగడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన వ్యవసాయ అధికారులు ప్రభుత్వం సూచించిన సంస్థల వద్దే బీటీ పత్తి విత్తనాలను కొనుక్కోవాలని సూచించారు. సీజన్‌కు సరిపడా విత్తనాలను, ఎరువులను సేకరించి ఉంచామని, ఏ రైతూ కంగారు పడాల్సిన పనిలేదని వ్యవసాయ కమిషనర్ మురళీధర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఖరీఫ్‌కు ప్రభుత్వం తరఫున చేయాల్సిన అన్ని ఏర్పాట్లుచేశామని, అధికోత్పత్తి, తెగుళ్ల నివారణ మొదలు ఎరువుల వాడకం వరకు అన్ని అంశాలపై రైతులకు అవగాహన కల్పించామని ఆయన చెప్పారు.
ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా ఖరారు
రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడక ఖరీఫ్ సాగు ముందడగు వేయకపోతే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను కూడా వ్యవసాయ శాఖ తయారుచేసింది. ఇందుకోసం అన్ని రకాల విత్తనాలను పంపిణీకి సిద్ధంగా చేసింది. జూలై 15లోగా సాధారణ వర్షపాతం నమోదు కాకుంటే 1,04,732 హెక్టార్లలో ప్రత్యామ్నాయ ప్రణాళికను అమలు చేందుకు 24,022 క్వింటాళ్ల వరి, మినుము, పెసర, కంది, మొక్కజొన్న, రాగి, వేరుశెనగ, ఉలవ, జొన్న, కొర్రలు వంటి రకాల విత్తనాలను సిద్ధంచేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే వరికి బదులు ఆరుతడి పంటలైన మినుము, పెసర, మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాలు వంటి స్వల్పకాలిక పంటలు సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పత్తికి బదులు పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు వంటి పంటల సాగుకు రైతులను సంసిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment