వర్షం.. హర్షం
►పొలాల్లో చేరిన నీరు...
►ప్రాణం పోసుకుంటున్న పంటలు
►పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
►వేసిన పంటలకే మేలు
►కొత్తగా వేయొద్దు : వ్యవసాయ శాఖ
నిజామాబాద్‌అర్బన్ : జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఖరీఫ్ సీజన్ లో ఇటీవల వరకు సరైన వర్షాలు లే కపోగా తీవ్రమైన ఎండలు, కరెంటు కోతలతో ఎండు ముఖం పట్టిన పంటలకు ఈ వర్షాలు ప్రాణం పోస్తున్నాయి. గురువారం నుంచి జిల్లా అంతటా చెప్పుకో దగ్గ వర్షాలు పడుతున్నాయి. పంట పొలాల్లో నీరు చేరింది.
అత్యధికంగా సిరికొండ మండలంలో శుక్రవారం 143 మిల్లి మీటర్లు, ధర్పల్లిలో 127.02 మి.మీ, భీంగల్‌లో 102 మి.మీ, కమ్మర్‌పల్లిలో 84.6 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. అత్యల్పంగా బోధన్‌లో 12 మి.మీ , బిచ్కుందలో 15 మి.మీ వర్షం కురిసింది.అయితే ఈ ప్రాంతాల్లో శనివారం అధికంగా వర్షం కురిసింది. జుక్కల్, నిజాంసాగర్ మండలాల్లో వాగులు ఉప్పొంగుతున్నాయి, లింగంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లో పిల్ల కాలువలు, కుంటలు, చెరువులు వర్షపు నీటితో నిండుతున్నాయి.
బాన్సువాడ ప్రాంతంలో పంట పొలాలు నీట మునిగాయి. వాగులు, వంకలు నీటితో కళకళలాడుతున్నా యి. చెరువుల్లోకి భారీగా వర్షపు నీరు చేరుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వేసిన పంటలకే మేలు కలిగిస్తున్నాయి. ఈ ఖరీఫ్‌లో లక్ష 20 వేల హెక్టార్లలో సోయాబీన్, 92 వేల హెక్టార్లలో వరి, 45 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 13 వేల హెక్టార్లలో పసుపు, 12 వేల హెక్టార్లలో పత్తి, 8 వేల హెక్టార్లలో చెరుకు, 20 వేల హెక్టార్లలో ఇతర పంటలను సాగుచేశారు. వర్షాభావం వల్ల ఈ ఏడాది సుమారు 32 వేల హెక్టార్ల వరకు పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
మొత్తం 3 లక్షల 24 వేల హెక్టార్లలో పంటల సాగు ప్రణాళిక ఉండగా 3 లక్షల 9 వేల హెక్టార్లలో రైతులు పంటలు వేశారు. వర్షాలు లేక కామారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో ఆరుతడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు పలుమార్లు నిరసనలు వ్యక్తం చేశారు. మరో వైపు ఈ వర్షాల వల్ల ప్రస్తుతం ఉన్న పంటలే కొనసాగించాలని, కొత్తగా పంటలు వేయకూడదని వ్యవసాయాధికారులు స్పష్టం చేస్తున్నారు.