సాక్షి, అమరావతి: తొలకరి వర్షాలు కాస్త ఆలశ్యం కావడంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుకు చర్యలు చేపట్టింది. రైతుల డిమాండ్ల మేరకు 80 శాతం రాయితీపై వారు కోరుకున్న విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న మేలు చూసి రామోజీకి కడుపులో మంట మొదలైంది. ‘ఎండ మండి.. మొలక ఎండుతోంది’ అంటూ రైతులను గందరగోళ పర్చేలా ఈనాడు ఓ కథనాన్ని అచ్చేసింది. సత్యదూరమైన ఆరోపణలు చేసింది. వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.
ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపకల్పన
ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో (జూన్ నెలలో) ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా వ్యవసాయంపై సమీక్షించారు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపకల్పనపై ఆదేశాలు జారీ చేశారు. ఆర్బీకే, మండల స్థాయి వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులు, లోటు వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో రైతుల నుంచి సేకరించిన అభిప్రాయాల మేరకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను రూపొందించారు.
లోటు వర్షపాతం కారణంగా బెట్ట పరిస్థితులున్న ఏడు జిల్లాల్లో 80 శాతం రాయితీపై విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అవసరమైన చోట లేట్ ఖరీఫ్ కింద రైతులు ఇతర పంటలను సాగు చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. అనంతపురం, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న మండలాల్లో ఆర్బీకేల ద్వారా విత్తన సరఫరాకు ఏర్పాట్లు చేశారు.
రైతుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు మినుము 400 క్వింటాళ్లు, పెసర 3,200 క్వింటాళ్లు, కంది 1,000 క్వింటాళ్లు, ఉలవలు 53,000 క్వింటాళ్లు, అలసందలు 1,900 క్వింటాళ్లు, కొర్రలు 500 క్వింటాళ్లు చొప్పున మొత్తం 60 వేల క్వింటాళ్ళ విత్తనాలను సిద్ధం చేశారు. సాధారణంగా ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటే ప్రత్యామ్నాయ పంటలకు మారడానికి రైతులు ఆగస్టు చివరి వారం వరకు వేచి చూస్తుంటారు.
ఈలోగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురిస్తే సంప్రదాయ పంటలను సాగు చేస్తారు. లేదంటే ప్రత్యామ్నాయ పంటలు వేస్తారు. రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ముందస్తుగానే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు చేస్తోంది. ఆర్బీకేల్లో నమోదు చేసుకున్న రైతులకు ఈ నెల 20 నుంచి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను పంపిణీ చేయనుంది.
రైతులకు శిక్షణ
మరో వైపు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నిలదొక్కుకొని మంచి దిగుబడులు సాధించేందుకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు కూడా ఎన్జీ రంగా వ్యవసాయ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో పంటల ప్రణాళికల అమలులో తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తోంది.
ఆ 4 జిల్లాల్లో విత్తన పంపిణీకి శ్రీకారం
జూలై నెలలో అధిక వర్షాలతో పంటలు దెబ్బ తిని మళ్లీ పంట వేసుకునేందుకు సిద్ధపడిన రైతులను ఆర్బీకేల ద్వారా గుర్తించారు. వారి జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. ఇంకా ఎవరైనా ముందుకొస్తే వారి పేర్లను కూడా నమోదు చేసేందుకు అవకాశం కల్పించారు.
వారు కోరుకున్న విత్తనాన్ని 80 శాతం రాయితీ పంపిణీ చేస్తోంది. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతుల కోసం 2,804 క్వింటాళ్ల వరి విత్తనాలను అవసరమని గుర్తించారు. ఇప్పటి వరకు 895 క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో సిద్ధం చేయగా, 773 క్వింటాళ్ల విత్తనాన్ని రైతులకు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment