నరసరావుపేట వెస్ట్ : సకాలంలో వర్షాలు లేవు. ప్రాజెక్టుల్లో నీరు చేరలేదు. సాగర్ కాలువలకు నీరు విడుదల కాలేదు. సాగు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో గ్రామాల్లో కూలీలు వ్యవసాయ పనుల్లేక పొట్టచేత పట్టుకుని పట్టణ బాట పడుతున్నారు. దొరికిన పనులు చేస్తామంటూ అర్ధిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తోంది. ఇప్పటివరకు సరైన వర్షపాతం నమోదుకాలేదు. అక్కడక్కడా పత్తి, మిరప, మొక్కజొన్న లాంటి పైర్లు వేసినా మొక్కలు బతకటమే కనాకష్టంగా మారింది. వేసిన పంటల ద్వారా కొద్దిమందికే పనులు దొరుకుతున్నాయి.
మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) పనులూ అరకొరగానే జరుగుతున్నాయి. పట్టణాలకు వచ్చినా నిర్మాణరంగం మినహా పెద్దగా ఇతర పనులేమీ అందుబాటులో లేవు. నెలరోజులు రాను పోను రోజుకు ప్రయాణపు ఖర్చును భరిస్తూ పట్టణాలకు వస్తున్నా పదిరోజులకు మించి పనులు దొరకటంలేదు. పట్టణానికి వస్తున్న వారిలో సగానికిపైగా తిరిగి రిక్తహస్తాలతో గ్రామాలకు చేరుకుంటున్నారు. వారి కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి.
పనులకు పిలిచేవారే కరువయ్యారు..
మా ఊరిలో పనుల్లేవు. పట్టణాలకు వచ్చిన్నా అంతంతమాత్రమే. పట్టణాలకు వస్తున్నా ఖర్చులకు చాలడం లేదు.
- షేక్.మస్తాన్‌వలి, కర్లకుంట
ఆదుకోవాలి..
గ్రామాల్లో బతకడం కష్టంగా మారింది. ఉపాధి పనులు లేదు. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
-కె.సుబ్బారావు, పమిడిపాడు
ఉపాధి కోసం ఊరొదిలి..
Published Fri, Aug 7 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM
Advertisement