‘ప్రాణహిత’పై ఆశలు | Pranahita water For Adilabad District | Sakshi
Sakshi News home page

‘ప్రాణహిత’పై ఆశలు

Published Sat, Sep 7 2019 11:21 AM | Last Updated on Sat, Sep 7 2019 11:22 AM

Pranahita water For Adilabad District - Sakshi

కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది

సాక్షి, ఆసిఫాబాద్‌: ప్రాణహిత ప్రాజెక్టుపై జిల్లా రైతాంగానికి ఆశలు పోవడం లేదు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టాలనే డిమాండ్‌ బలపడుతున్న నేపథ్యంలో ఈ ఆశలు మరింత ఎక్కువతున్నాయి. ప్రతిపక్షాలు ఇక్కడ ప్రాజెక్టు కట్టాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఈ బ్యారేజీ నిర్మాణంపై జిల్లా రైతాంగానికి ఆశలు సజీవంగా ఉంటున్నాయి. ఏటా వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహించే ప్రాణహిత నది ప్రవాహంలో లక్షల క్యూసెక్కుల నీరు జిల్లా రైతాంగం కళ్లెదుటే గోదావరిలో కలిసిపోతూ దిగువ ప్రాంతానికి తరలిపోతోంది.

ఈ నీటి లభ్యతనే వాడుకునేందుకు రూ.38వేల కోట్లతో కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా పరిధిలోని 16.40 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టారు.

ఈ మొత్తం ఆయకట్టులో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోనే 1.56 లక్షల ఎకరాలకు సాగు నీరందించేలా ప్రణాళిక వేశారు. అయితే తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రాజెక్టుల రీడిజైన్‌లో భాగంగా బ్యారేజీ నిర్మాణం తుమ్మిడిహెట్టి నుంచి ప్రస్తుతం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ వద్ద గోదావరిపై నిర్మించాలని యోచించడం, త్వరతిగతిన ప్రాజెక్టు పనులు పూర్తవడం, ప్రస్తుతం ఎత్తిపోతలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే తుమ్మిడిహెట్టి వద్ద మాత్రం ఎటువంటి కదలిక లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. దీనిపై త్వరితగతిన ఏదైనా నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఎటూ తేల్చని సర్కారు  
ప్రాణహితపై బ్యారేజీ నిర్మాణం విషయంలో ఇప్పటికీ ఎటువంటి అధికార ప్రకటన చేయకపోవడంతో ప్రతిపక్షాలు తరచూ ఆందోళన చేస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఇక్కడి రైతులకు సాగు నీరందిస్తామని తరచూ పార్టీ రాష్ట్రస్థాయి అగ్ర నాయకులు హామీ ఇస్తున్నారు. మిగతా విపక్ష పార్టీలు సైతం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి అనుకూలంగా ఉండడంతో ఎప్పటికైనా ప్రాణహితపై బ్యారేజీ నిర్మిస్తారనే ఆశల్లో ఇక్కడి రైతులు ఉన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఈ ప్రాజెక్టుకు సంబంధించి చింతలమానేపల్లి, దహేగాం మండల పరిధిలో తవ్విన కాలువలు నిరుపయోగంగా మారాయి.

ఇందుకోసం గతంలోనే రైతుల నుంచి భూమి సేకరించారు. ఇక్కడ నీరు అందుతుందనే ఆశతో అనేక మంది రైతులు భూములు ఇచ్చి ప్రాజెక్టు ప్రారంభంలో ఆశ పడినా చివరకు ఇలా నిలిచిపోవడంతో అంతా నిరాశలో ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రాణహితపై బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్రలో ముంపు అధికంగా ఉందని చెబుతు ముంపు తక్కువగా ఉన్న వార్దపై బ్యారేజీ నిర్మించి ఈ కాలువలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై కూడా ఎటువంటి స్పష్టత రాలేదు. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు భవితవ్యం ఎటూ తేలకున్నా ఎప్పటికైనా బ్యారేజీ నిర్మితమవుతుందనే రైతుల ఆశలు సజీవంగా ఉంటున్నాయి.

ఏళ్లుగా అదే అవస్థలు  
జిల్లాలో అపరిమితమైన సహజ నీటి వనరులున్నా రైతులకు ఆయకట్టు అందక పత్తి, సోయా, కంది, జొన్న వంటి ఆరుతడి పంటలకే పరిమతమవుతున్నారు. ఇప్పటికీ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు పైగా కేవలం పత్తి పంటనే ప్రధాన పంటగా పండిస్తున్నారు. వరి సాగు అంతంత మాత్రమే. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే వెనుకబడిన జిల్లాలో సాగు నీరందించడంతో వరి సాగు పెరిగి అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. మరోవైపు జిల్లాలో ప్రాణహిత బ్యారేజీతో పాటు కుమురం భీం, వట్టివాగు, జగన్నాథపూర్‌ ప్రాజెక్టులు సైతం పెండింగ్‌లోనే ఉండి రైతులకు సాగు నీరందించే స్థితిలో లేకపోవడంతో ఏళ్లుగా సాగునీటికి తిప్పలు తప్పడం లేదు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement