సాక్షి, అమరావతి: నదీ జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించడంలో టీడీపీ సర్కారు ఘోర వైఫల్యానికి ఇదో మచ్చుతునక. కర్ణాటక ప్రభుత్వం కేంద్ర జలసంఘం ఆదేశాలను తుంగలో తొక్కుతూ చేపట్టిన మూడు ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి నీళ్లు వదిలేందుకు సిద్ధమైనా గుడ్లప్పగించి చూసిన చంద్రబాబు సర్కారు కనీసం అభ్యంతరం కూడా తెలపకపోవడంపై సాగునీటి రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు జలాల్లో వాటా ఆధారంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలో అదనంగా 21 టీఎంసీలను వినియోగించుకునేలా తాము మూడు ప్రాజెక్టులు చేపట్టడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కు కర్ణాటక సర్కార్ ప్రతిపాదనలు పంపింది. వాటి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను పరిశీలించిన సీడబ్ల్యూసీ 2016 నవంబర్ 30న అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా ప్రాజెక్టుల పనులు చేపట్టవద్దని స్పష్టం చేసింది. కానీ సీడబ్ల్యూసీ మార్గదర్శకాలను బేఖాతర్ చేస్తూ ఆ మూడు ప్రాజెక్టులను చేపట్టిన కర్ణాటక సర్కార్ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తోంది. ఈ సీజన్‌లోనే 2.85 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు కర్ణాటక సిద్ధమైంది.
ప్రజాప్రయోజనాలా.. వ్యక్తిగత లబ్ధా?
చంద్రబాబు సర్కారు తీరును అలుసుగా చేసుకున్న కర్ణాటక ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్ తీర్పును సాకుగా చూపుతూ కృష్ణా జలాల్లో అదనంగా 21 టీఎంసీలను వినియోగించుకునేలా 2016లో షిగ్గాన్, సింగటలూరు, అప్పర్ భద్ర ప్రాజెక్టులను చేపట్టింది. అయితే ఆ మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లను పరిశీలించిన సీడబ్ల్యూసీ అందులో లోపాలను గుర్తించి అనుమతి నిరాకరించింది. కానీ కర్ణాటక సర్కార్ దీన్ని తుంగలో తొక్కుతూ మూడు ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన చేపట్టి దాదాపుగా పనులను పూర్తి చేసింది. ఈ సీజన్‌లో 2.85 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా కర్ణాటక సర్కార్ అక్రమంగా ప్రాజెక్టులు చేపడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం కనీసం నోరు మెదపలేదు.
1996లో హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలో యూడీఎఫ్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలోనే కృష్ణా నదిపై కర్ణాటక ఆల్మట్టిని పూర్తి చేసింది. దేవెగౌడను తానే ప్రధానిగా చేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు అప్పట్లో ఆల్మట్టిని అడ్డుకోలేకపోయారు. తాజాగా ఆల్మట్టిని ఎత్తు పెంచుతున్నది దేవేగౌడ కుమారుడు కుమారస్వామి కావడం గమనార్హం. కుమారస్వామి సర్కార్‌కు చంద్రబాబు మద్దతు పలుకుతుండటం, దేవేగౌడతో కలసి ఎన్నికల ప్రచారం చేయటాన్ని బట్టి ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారన్నది స్పష్టమవుతోంది
ఏపీలో కృష్ణా ఆయకట్టు ఎడారే..
షిగ్గాన్, సింగటలూరు, అప్పర్ భద్ర ప్రాజెక్టుల ద్వారా ఈ సీజన్ నుంచే కర్ణాటక ప్రభుత్వం కృష్ణా జలాలను ఆయకట్టుకు మళ్లించనుంది. ఆల్మట్టి ఎత్తు పెంచే పనులు శరవేగంగా చేపట్టింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఎగువ నుంచి కృష్ణా వరద జలాలు రాష్ట్ర సరిహద్దుకు చేరడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకోనుంది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సందర్భంలో నీటి లభ్యత తక్కువగా ఉంటుంది. ఎగువ నుంచి రాష్ట్రానికి చుక్క కూడా నీరు చేరే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో కృష్ణా పరీవాహక ప్రాంతంలో సాగునీటి మాట దేవుడెరుగు తాగునీటికి కూడా ఇక్కట్లు తప్పవని సాగునీటి నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాడూ, నేడూ చంద్రబాబు తీరు వల్లే కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు తీవ్ర విఘాతం కలిగిందని, ఈ పరిణామాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఆయకట్టు ఎడారిగా మారడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్లక్ష్యానికి పరాకాష్ట..
పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ 1980లో అనుమతి ఇచ్చింది. గోదావరి జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లిస్తున్న నేపథ్యంలో తమకు కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కర్ణాటక, మహారాష్ట్రలు అప్పట్లో కోరాయి. దీంతో కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్న 80 టీఎంసీల్లో 45 టీఎంసీలను నాగార్జునసాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, 21 టీఎంసీలు కర్ణాటక, 14 టీఎంసీలు మహారాష్ట్ర కృష్ణా జలాలను అదనంగా వినియోగించుకునేలా గోదావరి ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు వెల్లడించి ఇప్పటికి 39 ఏళ్లు పూర్తయ్యాయి.
ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు తెలంగా>ణ సర్కార్ కూడా గోదావరి జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లించాయి. కర్ణాటక సర్కార్ కృష్ణా జలాలను కావేరి పరీవాహక ప్రాంతానికి మళ్లించింది. ఈ నేపథ్యంలో పోలవరం జలాలపై 1980లో గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు చెల్లదని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఎగువ రాష్ట్రాలు ఒక నది నుంచి మరో నది పరీవాహక ప్రాంతానికి జలాలను మళ్లించిన నేపథ్యంలో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం–1956 ప్రకారం కేంద్రానికి ఫిర్యాదు చేయడంతోపాటు తాజాగా గోదావరి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి జలాలను పునఃపంపిణీ చేయాల్సిందిగా కోరాలని నాలుగేళ్లుగా సాగునీటి నిపుణులు, జలవనరుల శాఖ అధికారులు సూచిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment