బుధవారం పోలవరం స్పిల్‌వే వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో పోలవరం పనులను మ్యాప్ ద్వారా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి వివరిస్తున్న సీఎం చంద్రబాబు
పోలవరం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: పోలవరం ప్రాజెక్టు పనులను అవినీతి, అక్రమాలకు తావు లేకుండా.. సకాలంలో పూర్తి చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కాదు.. భారతదేశానికే జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును రాజకీయం చేయడం తగదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరోక్షంగా చురకలంటించారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు సందేహాస్పదంగా ఉన్నాయని, వాటిని నివృత్తి చేస్తే నిధుల విడుదలకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. పోలవరం జలాశయంలో ముంపునకు గురయ్యే భూమి విస్తీర్ణం 2013 నాటితో పోల్చితే ఇప్పుడు ఎందుకు రెట్టింపు అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనివల్లే భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ వ్యయం రూ.30,000 కోట్లకు పైగా పెరిగిందని చెప్పారు. ముంపునకు గురయ్యే భూమి విస్తీర్ణం ఎందుకు పెరిగిందో వివరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
పోలవరం.. ప్రతిష్టాత్మకం
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నితిన్ గడ్కరీ బుధవారం రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి సాయంత్రం 4.45 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న సీఎం చంద్రబాబుతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్పిల్ వే పనులను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని.. ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. బిల్లులు చెల్లించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు.
ఆ ప్రతిపాదనలు తప్పులతడక
పోలవరం ప్రాజెక్టు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని గడ్కరీ ఏకిపారేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను తప్పులతడకగా అభివర్ణించారు. ‘‘ధరలు పెరిగిన నేపథ్యంలో పనుల అంచనా వ్యయం పెరగడంలో అర్థముంది. భూసేకరణ చట్టం–2013ను కేంద్రం అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో భూసేకరణ వ్యయం పెరగడం సహజమే. కానీ, ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే భూమి 2013తో పోల్చితే ఇప్పుడు రెట్టింపు అయ్యింది. ఎందుకు ఇలా చేశారని ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు. దీనివల్ల అంచనా వ్యయం రూ.30,000 కోట్లు పెరిగింది. దీనిపై కేంద్రానికి సందేహాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, ఎనిమిది రోజుల్లోగా సందేహాలను నివృత్తి చేస్తే వాటిని ఆమోదించి.. కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించి నిధులు విడుదలయ్యేలా చూస్తానని తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి తదితర అధికారులను ఢిల్లీకి పంపితే.. మూడు రోజులపాటు సీడబ్ల్యూసీ అధికారులు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై చర్చిస్తారని.. సందేహాలు అక్కడికక్కడే నివృత్తి అవుతాయని సీఎం చంద్రబాబుకు సూచించారు.
ద్విముఖ వ్యూహం
పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నితిన్ గడ్కరీ ద్విముఖ వ్యూహాన్ని సూచించారు. తొలుత జలాశయం, కాలువల పనులు(సివిల్ వర్క్స్) పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పనులకు అయ్యే వ్యయాన్ని కేంద్రం విడుదల చేస్తుందన్నారు. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీని రెండో భాగంగా చేపట్టాలన్నారు. గిరిజనులకు చెందిన భూములు సేకరించేటప్పుడు వారికే పరిహారం దక్కేలా చర్యలు తీసుకోవాలని.. సహాయ పునారావాస ప్యాకేజీలో భాగంగా గిరిజనులకు భూమికి బదులుగా అందించే భూమి సాగుకు యోగ్యమైనదిగా ఉండాలని పేర్కొన్నారు. గిరిజనులకు అన్ని సదుపాయాలతో కూడిన ఇళ్లు, ఉపాధి మార్గాలను చూపించాలన్నారు. నిర్వాసితులైన గిరిజనులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తేల్చిచెప్పారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోగా పూర్తి చేయండి
పోలవరం ప్రాజెక్టు జలాశయం, కాలువ పనులను 2019 ఏప్రిల్లోగా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిధులను సకాలంలో మంజూరు చేసేందుకు నితిన్ గడ్కరీ సహకరిస్తున్నారని, ఇకపై కూడా ఇదే రీతిలో సహకారం అందించాలని కోరారు. దీనిపై గడ్కరీ స్పందిస్తూ.. అప్పటికి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని, దీనివల్ల ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు తాను రాలేనని చెప్పారు. 2019 ఫిబ్రవరి నాటికే పనులు పూర్తి చేయాలని సూచించారు. వచ్చే ఫిబ్రవరిలో మళ్లీ తాను పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వస్తానని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానిను ప్రథమ ప్రాధాన్యం ఇస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment