పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతం వద్ద బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి గడ్కరీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం ప్రాజెక్టును గడువులోపు పూర్తిచేస్తామని, ఇందులో ఎటువంటి రాజకీయాలకు తావులేద ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల ప్రగతిని పరిశీలించడానికి బుధవారం ఇక్కడకు వచ్చిన ఆయన విలేకరుల సమావేశం, అనంతరం ప్రాజెక్టు వద్ద బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నా అవి ప్రాజెక్టు పనులకు అడ్డంకి కాద ని చెప్పారు. కేంద్రమే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తుందన్న విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రాజెక్ట్ వల్ల నష్టపోయే గిరిజనులకు కూడా అన్ని విధాలుగా మేలు చేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుందన్నారు. 2019 ఫిబ్రవరిలోపు సివిల్ పనులు అన్ని పూర్తిచేయాలని, వచ్చే ఏడాది మేలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఈలోపు ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తామన్నారు. జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును ప్రధాని మోదీ సారథ్యంలోనే పూర్తి చేసి తీరుతా మని, అయితే కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని ఏ విధంగా అధిగమించా లనే విషయంపై చర్యలు తీసుకుంటామన్నారు. భూసేకరణ అంచనాలు పెరిగిపోవడంపై తమకు అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది డిసెంబర్‌లోపు..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ 2019 డిసెంబర్ నాటికల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించామని, మెజార్టీ పనులన్ని 2019 ఏప్రిల్ నాటికి పూర్తిచేస్తామని, రాబోయే పది నెలల్లో మొత్తం కాంక్రీట్ పనులన్నీ పూర్తిచేస్తామని చెప్పా రు. గతంలో భూసేకరణకు రూ.2,900 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త భూసేకరణ చట్టం వల్ల రూ.31 వేల కోట్లు కేవలం భూసేకరణకు, పునరా వాస కార్యక్రమాలకు ఖర్చువుతుందని సీఎం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులు మరింత వేగవంతంగా పూర్తి కావా లంటే అడ్వాన్స్‌గా కొంత సొమ్మును విడుదల చేయాలని, పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ క్లియర్ చేయాలని సీఎం కోరారు. తమకున్న అనుమానాలు నివృత్తి చేస్తే నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధమని గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హామీ ఇవ్వలేదు.
బలప్రదర్శనకు వేదిక
నిన్నటి వరకూ మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, బీజేపీల మధ్య బలప్రదర్శనకు వేదికగా పోలవరం ప్రాజెక్ట్ మా రింది. కేంద్ర మంత్రి గడ్కరీ వస్తుండటంతో కమలనాథులు బీజేపీ కార్యకర్తలను పెద్ద ఎత్తున తరలించి అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు తెలుగుదేశం తరఫున రైతు సంఘం ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో ప్రాజెక్టు వద్దకు తరలివచ్చారు. తెలుగుదేశం కార్యకర్తలను కొండపై హెలీపాడ్ ప్రాంతానికి పంపి, తమను మాత్రం కొండ దిగువన నిలిపివేశారని బీజేపీ కార్యకర్తలు ధర్నా దిగారు. వీరంతా కొండ దిగువ నుంచి కాలినడకన సమావేశం జరిగే ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. పోలవరం డీఎస్పీ ఏటీవీ రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పైకీ ఎవరినీ çపంపటంలేదని, కార్యకర్తలు తమకు సహకరిం చాలని కోరారు.
ఆలస్యంగా ప్రాజెక్ట్ వద్దకు..
మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి పర్యటన ఉండగా రెండు గంటల ఆలస్యంగా వచ్చారు. రాగానే నేరుగా ప్రాజెక్ట్ వద్దకు వెళ్లిన గడ్కరీ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈలోపు ప్రాజెక్టుపై భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటల వరకూ ప్రాజెక్టుపైనే ఉన్న కేంద్ర మంత్రి అనంతరం దిగువన జరుగుతున్న బీజేపీ సమావేశంలో మాట్లాడి రోడ్డు మార్గంలో రాజమండ్రి బయలు దేరి వెళ్లారు. పర్యటనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి మాణిక్యాలరావు, సూర్యనారాయణరాజు, పాకా వెంకటసత్యనారాయణరాజు, కోడూరి లక్ష్మీనారాయణ, రాష్ట్ర మహిళా అద్యక్షురాలు మాలతీరాణి, ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు కేఎస్ జవహర్, దేవినేని ఉమామహేశ్వరరావు, విప్ చింతమనేని ప్రభాకర్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, కలెక్టర్ భాస్కర్, ఎస్పీ ఎం.రవిప్రకాష్, ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ న్నతాధికారులు ఉన్నారు.
‘పోలవరం’ పనులపై గడ్కరీ సమీక్ష
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరుపై కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమీక్షించారు. నీటి పారుదలశాఖ, రెవెన్యూ అధికారులతో రెండు గంటల పాటు ఆర్‌అండ్‌ఆర్, ప్రాజెక్టు వద్ద నిర్మాణ పనులపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి స్పిల్‌వే కాంక్రీట్ పనులను గడ్కరీ పరిశీలించారు. అనంతరం బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో తిరుగు ప్రయాణంలో అధికారులు, నాయకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఐజీ కేవీఎన్ గోపాలరావు, కలెక్టర్ భాస్కర్, ఎస్పీ పి.రవిప్రకాష్ తదితరులు ఉన్నారు.
వినతుల వెల్లువ
పోలవరం: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు పోలవరం నిర్వాసితులు పలు వినతులు అందజేశారు. ముందుగా ఖాళీచేసిన పోలవరం మండలంలోని ఏడు గ్రామాల్లో ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న నిర్వాసితులకు కూడా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజ్ అమలు చేయాలని చేగొండపల్లికి చెందిన ఎస్.రాజు పలువురు నిర్వాసితులు వినతిపత్రం ఇచ్చారు. రెండో విడతగా ఖాళీ చేయాల్సిన 19 గ్రామాల నిర్వాసితులు కూడా వినతిపత్రం అందజేశారు. ఇళ్ల నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించాలని, ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు ప్యాకేజీ అందజేయాలని, వివాహమైన, డేటాలో ఉన్న మహిళలకు ప్యాకేజీ ఇవ్వాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. కుక్కునూరు మండలంలో అమలు చేసిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని, మండలాన్ని యూనిట్‌గా తీసుకుని, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిం చాలని కుక్కునూరుకి చెందిన వివిధ పార్టీల నాయకులు, నిర్వాసితులు వినతిపత్రం అందజేశారు.పోలవరంలోని మూలలంకలో భూములు కలిగిన రైతులు కూడా వినతిపత్రం సమర్పించారు. భూములను తమ అంగీకారం లేకుండా తీసుకుంటున్నారని, ఎకరానికి రూ.30 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని వినతిపత్రంలో వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment