సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేలో 42, 43 పియర్ (కాంక్రీట్ స్తంభాలు) మధ్య 41వ గేటు స్కిన్ ప్లేట్ అమర్చే పనులను సోమవారం ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. కేవలం వీటిని అమర్చడంతోనే ప్రాజెక్టు పూర్తి చేసినట్లుగా, ఆయకట్టుకు నీళ్లిచ్చిన రీతిలో హోరెత్తించారు. మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూలు వెలువడనున్న నేపథ్యంలో నాలుగున్నరేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడంతోపాటు పోలవరంలో భారీ అక్రమాలు జరిగినట్లుగా కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ ఇటీవల రాజ్యసభలో అంగీకరించిన నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు తాజా డ్రామాకు తెరతీశారని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం!
అక్రమాలను కప్పిపుచ్చేందుకు పలు కార్యక్రమాలు...
విభజన చట్టం ప్రకారం పోలవరం ఖర్చు వంద శాతం భరించేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేసేందుకు పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)తో ఎంవోయూ కుదుర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ పీపీఏతో ఒప్పందం కుదుర్చుకోకుండా ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తమకే అప్పగించాలని సీఎం చంద్రబాబు పట్టుబట్టారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను ఆయన తాకట్టు పెట్టడంతో.. 2016 సెప్టెంబరు 7న అర్ధరాత్రి పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. ఆ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాలకే చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ పోలవరాన్ని 2018 జూలై నాటికి పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. నిర్మాణ బాధ్యతలు దక్కించుకునేవరకూ పోలవరంలో తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా మోకాలడ్డుతూ వచ్చిన ప్రభుత్వ పెద్దలు ఆ తర్వాత పనులన్నీ సబ్ కాంట్రాకర్లకు అప్పగించి కమీషన్ల వసూళ్లకు తెరతీశారు. ప్రాజెక్టులో అక్రమాలు, అంతులేని జాప్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎప్పటికప్పుడు రియాలిటీ షోలకు తెరతీశారు. వాటిని ఒకసారి పరిశీలిస్తే...
2016 సెప్టెంబరు 12
ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకున్న తర్వాత ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ సోమవారాన్ని పోలవారంగా మార్చుకుని వర్చువల్ రివ్యూలు నిర్వహిస్తానని సీఎం ప్రకటించారు. మొదటి వర్చువల్ రివ్యూను ప్రారంభించడంతోనే ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నట్లు హడావుడి చేశారు.
2016 డిసెంబర్ 26
పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా రూ.1,981.54 కోట్ల చెక్కును ఢిల్లీలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కారీ అందించారు. ఈ నిధులు అందడంతోనే ప్రాజెక్టు పూర్తయిందనే రీతిలో ఢిల్లీ వేదికగా చంద్రబాబు నాటకాన్ని రక్తి కట్టించారు.
2016 డిసెంబర్ 30
పోలవరం స్పిల్ వేలో కాంక్రీట్ పనులను ప్రారంభించారు. దీన్ని కాంక్రీట్ పండుగగా నామకరణం చేసిన చంద్రబాబు.. వీటితోనే పనులు పూర్తయ్యాయనే రీతిలో హంగామా చేశారు.
2017 ఫిబ్రవరి 1
ఏదైనా ప్రాజెక్టుకు ఒకసారి శంకుస్థాపన చేసి అంతా పూర్తయ్యాక జాతికి అంకితం చేయడం సాధారణం. కానీ సీఎం చంద్రబాబు పోలవరం గేట్ల తయారీ పనుల కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పునాది (డయాఫ్రమ్ వాల్) పనులకు పునాది రాయి వేశారు.
2017 జూన్ 8
పోలవరంలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి గోదావరి ప్రవాహాన్ని మళ్లించడానికి వీలుగా చేపట్టే మట్టికట్ట(కాఫర్ డ్యామ్) పనులకు శంకుస్థాపన చేసి.. మట్టికట్టతోనే గ్రావిటీపై నీటిని అందిస్తానని సీఎం ప్రకటించారు. సాధారణంగా ప్రధాన ఆనకట్ట(ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) పనులు పూర్తయ్యాక కాఫర్ డ్యామ్‌ను కూల్చి వేస్తారు.
2018 జూన్ 11
ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పునాది (డయా ఫ్రమ్ వాల్)ని జాతికి అంకితం చేసి చంద్రబాబు నయా రికార్డు సృష్టించారు. పునాదిని జాతికి అంకితం చేయడంతోనే ప్రాజెక్టు పూర్తయిన రీతిలో ప్రచారం చేసుకున్నారు.
2018 సెప్టెంబరు 12
స్పిల్ వేలో గ్యాలరీ వాక్‌ను ప్రారంభించారు. ఇందుకోసం కుటుంబ సమేతంగా పోలవరానికి పిక్నిక్‌కు వెళ్లారు. గ్యాలరీ వాక్ ప్రారంభంతోనే ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయనే రీతిలో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు.
2018 డిసెంబర్ 24
స్పిల్ వేలో 41వ గేట్ స్కిన్ ప్లేట్ అమర్చే పనులను ప్రారంభించారు. దీన్ని ఓ రికార్డుగా అభివర్ణించుకుని ఇక పనులు మొత్తం పూర్తయ్యాయనే రీతిలో హంగామా చేశారు.
సీఎం రివ్యూలు, పర్యటనలకు రూ.95 కోట్లకుపైగా ఖర్చు
సీఎం చంద్రబాబు 2016 సెప్టెంబరు 12వతేదీ నుంచి ఇప్పటివరకూ 83 సార్లు పోలవరంపై వర్చువల్ రివ్యూలు నిర్వహించారు. 29 సార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను సమీక్షించారు. ఈ రెండు కార్యక్రమాల కోసం రూ.95 కోట్లకు పైగా ఖర్చు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment