కర్ణాటక ప్రతిపాదనను తోసిపుచ్చిన ఆంధ్రప్రదేశ్‌ | Andhra Pradesh rejects Karnataka proposal | Sakshi
Sakshi News home page

‘నవలి’కి నో!

Published Sun, Aug 18 2019 3:12 AM | Last Updated on Sun, Aug 18 2019 10:25 AM

Andhra Pradesh rejects Karnataka proposal - Sakshi

సాక్షి, అమరావతి /బళ్లారి: తుంగభద్ర జలాశయానికి ఎగువన నదీ జలాల వినియోగం లెక్కలు చెప్పకుండా, సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) అందజేయకుండా ‘నవలి’ జలాశయం నిర్మాణానికి ఆమోదం తెలపాలంటూ కర్ణాటక సర్కార్‌ చేసిన ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తోసిపుచ్చాయి. జలాశయంలో పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలకు తగ్గిందంటూ కర్ణాటక చెబుతున్న లెక్కలు తప్పని తుంగభద్ర బోర్డు నిర్వహించిన పరిశోధనలోనే వెల్లడైందని,  తుంగభద్ర నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలుగా బోర్డు తేల్చిందని ఏపీ పేర్కొంది. టీబీ ఎల్లెల్సీ (దిగువ కాలువ)లో 30 కి.మీ.ల పైపులైన్‌ నిర్మిస్తే జలచౌర్యం జరగకుండా కర్నూలు జిల్లాకు సమర్థంగా నీటిని తరలించవచ్చని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించగా పూర్తి వివరాలు అందజేస్తే పరిశీలించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని కర్ణాటక పేర్కొంది.

తుంగభద్ర జలాశయం జల విస్తరణ ప్రాంతంలో ఎత్తిపోతల ద్వారా ఐదు టీఎంసీలను వినియోగిస్తున్నారని, దీన్ని  కర్ణాటక కోటాలో లెక్కించాలన్న ప్రతిపాదనకు బోర్డు సానుకూలంగా స్పందించింది. ఎత్తిపోతల పథకాల ద్వారా కర్ణాటక వినియోగిస్తున్న జలాలను ఆ రాష్ట్రం ఖాతాలోనే పరిగణిస్తామని స్పష్టం చేసింది. జలాశయంలో నీటి లభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో నీటిని పంచుకోవాలని మూడు రాష్ట్రాలు నిర్ణయించాయి. చైర్మన్‌ డి.రంగారెడ్డి నేతృత్వంలో తుంగభద్ర బోర్డు శనివారం బెంగళూరులోని వికాససౌధలో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈఎన్‌సీలు ఎం.వెంకటేశ్వరరావు, మురళీధర్, రాకేష్‌సింగ్‌లు ఇందులో పాల్గొన్నారు.

నీటి లెక్కలతోపాటు డీపీఆర్‌ అందచేయాలన్న బోర్డు
తుంగభద్ర జలాశయంలో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన మేరకు నీటిని వినియోగించుకోలేకపోతున్నామని కర్ణాటక సర్కారు పేర్కొంది. ఈ నేపథ్యంలో తుంగభద్ర జలాశయానికి ఎగువన కొప్పళ జిల్లా ‘నవలి’ వద్ద 31.15 టీఎంసీలతో ఒక జలాశయం, మరో రెండు చెరువులను జలాశయాలుగా మార్చడం ద్వారా మొత్తం 50 టీఎంసీలను నిల్వ చేస్తే బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన మేరకు మూడు రాష్ట్రాలు నీటిని వినియోగించుకోవచ్చునంటూ కర్ణాటక ప్రతిపాదించింది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు వ్యతిరేకించారు. తుంగభద్ర జలాశయానికి ఎగువన నదీ జలాలను కర్ణాటక సర్కార్‌ భారీగా వినియోగిస్తోందన్నారు.

ఆ లెక్కలు చెప్పకుండా, నవలి జలాశయం డీపీఆర్‌ అందజేయకుండా ఈ ప్రతిపాదనపై చర్చించలేమని తేల్చి చెప్పారు. వచ్చే సమావేశం నాటికి తుంగభద్ర జలాశయానికి ఎగువన వినియోగిస్తున్న నీటి లెక్కలతోపాటు నవలి డీపీఆర్‌ను అందజేయాలని టీబీ బోర్డు కర్ణాటక సర్కార్‌కు సూచించింది. మూడు రాష్ట్రాలు, సీడబ్ల్యూసీ ఆమోదం లేకుండా నవలి జలాశయం నిర్మాణానికి అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదని బోర్డు చైర్మన్‌ రంగారెడ్డి తేల్చి చెప్పారు. తుంగభద్ర హెచ్చెల్సీ(ఎగువ కాలువ)కి సమాంతరంగా వరద కాలువను తవ్వితే అటు కర్ణాటకలో బళ్లారి.. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాలకు తుంగభద్ర వరద జలాలను తరలించవచ్చని, దుర్భిక్ష ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు చేసిన ప్రతిపాదనను కర్ణాటక తోసిపుచ్చింది.

బోర్డు లెక్క పరిగణనలోకి..
తుంగభద్ర జలాశయంలో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలకు తగ్గిపోయిందని కర్ణాటక వాదిస్తోంది. కానీ ఇటీవల బోర్డు చేసిన పరిశోధనలో నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలని తేలింది. ఆ లెక్కలనే పరిగణనలోకి తీసుకుని నీటి కేటాయింపులు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు ప్రతిపాదించారు. దీనిపై కర్ణాటక జలవనరుల అధికారి రాకేష్‌సింగ్‌ స్పందిస్తూ బోర్డు లెక్కలపై అధ్యయనం చేశాక తమ అభిప్రాయాన్ని తెలియచేస్తామన్నారు. తుంగభద్ర ఎల్లెల్సీ ద్వారా కర్నూలు జిల్లాకు సక్రమంగా నీళ్లు రావడం లేదని, మధ్యలో చౌర్యం జరుగుతోందని, దీన్ని నివారించడానికి 30 కి.మీ.ల మేర పైపులైన్‌కు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ బోర్డును కోరింది. దీనిపై కర్ణాటక జలవనరుల శాఖ అధికారి రాకేష్‌ సింగ్‌ స్పందిస్తూ పైపులైన్‌కు ఎంత భూమి అవసరం? దీనివల్ల కేటాయించిన మేరకు నీటిని తరలించడం సాధ్యమవుతుందా? అనే వివరాలను ఆంధ్రప్రదేశ్‌ అందజేస్తే తమ అభిప్రాయాన్ని తెలియచేస్తామన్నారు. జలాశయంలో నీటి లభ్యత ఆధారంగా బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన మేరకు దామాషా పద్ధతిలో నీటిని పంచుకోవాలన్న బోర్డు ప్రతిపాదనకు మూడు రాష్ట్రాలు అంగీకరించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement