ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ నది పూర్తిగా బురదమయమైంది. ఉపయోగించుకోలేని స్థితిలో నీరు కలుషితంగా, బురదతో నిండిపోయింది. అయితే, అందుకు ఎగువ ప్రాంతంలో చైనా చేపట్టిన నిర్మాణ కార్యక్రమాలే కారణమని, దీంతో సరిహద్దు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు తూర్పు సింయాగ్ జిల్లాలోని పాసిఘట్‌కు చెందిన అధికారులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌కు ప్రాణదాతగా ఉన్న సియాంగ్ నదిలోని నీరు గత మూడు రోజుల్లోనే రంగు మారిపోయి, బురదమయంగా తయారైనట్లు చెప్పారు.
‘కొద్ది రోజులుగా అసలు వర్షాలే లేవు. అయినా, ఈ నదిలోని నీరు బురదమయంగా మారిపోయి ప్రవహిస్తోంది. నీటి వనరుల విభాగం అధికారులతో కలిసి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. చైనాలో ఈ నదిని యార్లుంగ్ సాంగ్పోగా పిలుస్తారు. చైనా చేపట్టిన తవ్వకాల ఫలితంగా నీటిలో బురద ప్రవహిస్తోంది. చైనాలో సియాంగ్ నది ప్రవహిస్తున్న ప్రాంతంలో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు.. ఎగువ భాగంలో కొండచరియలు విరిగిపడటమూ ఒక కారణంగా చెప్పొచ్చు.’ అని తెలిపారు తూర్పు సింయాంగ్ డిప్యూటీ కమిషనర్ త్యాగి టగ్గు.
సియాంగ్ నదిలో ఒక్కసారిగా నీరు రంగుమారిపోవటంపై సమీప ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చాలా వరకు మత్స్యకారులు, రైతులు ఈ నదిపైనే ఆధారపడుతున్నారు. బురదమయంగా మారిన నీటితో చేపలు చనిపోతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితి చాలా మందిపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కొన్ని సందర్భాల్లో ఈ నది బురదమయంగా మారింది. 2017, డిసెంబర్‌లో ఈ నది నల్లగా మారిపోయింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంపై చైనాతో చర్చలు జరిపి పరిస్థితని చక్కదిద్దింది కేంద్ర ప్రభుత్వం.
ఇదీ చదవండి: అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందే భారత్ రైలుపై రాళ్ల దాడి?
Comments
Please login to add a commentAdd a comment