కలుషితం.. నదీజలం | Rivers that losing purity In Telugu states including Krishna and Godavari | Sakshi
Sakshi News home page

కలుషితం.. నదీజలం

Published Wed, Dec 11 2019 5:44 AM | Last Updated on Wed, Dec 11 2019 5:44 AM

Rivers that losing purity In Telugu states including Krishna and Godavari - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలను తడిపి సిరులు కురిపించే నదీ జలాలు స్వచ్ఛమైనవి కావా? వీటిల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందా? దిద్దుబాటు చర్యలు చేపట్టకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవా? అనే ప్రశ్నలకు అవుననే హెచ్చరిస్తోంది కేంద్ర జల్‌శక్తి శాఖ. గోదావరి, కృష్ణా, పెన్నా, కుందూ, నాగావళి, మానేరు, కిన్నెరసాని తదితర నదుల్లో బయో కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌(బీవోడీ), డిసాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌(డీవో), క్షార స్వభావం (పీహెచ్‌) ప్రమాదకర స్థాయికి చేరిందని తాజా నివేదిక తేల్చింది.

ఈ నదుల్లోని నీటిలో కోలి బ్యాక్టీరియా,కరిగిన ఘన పదార్థాల(టీడీఎస్‌) శాతం ప్రమాదకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర నదులతో పోల్చితే వంశధారలో కాలుష్య ప్రభావం కాస్త తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా 323 నదుల్లో కాలుష్య ప్రభావంపై కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి(సీపీసీబీ), అన్ని రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు(పీసీబీ), కేంద్ర జల్‌ శక్తి శాఖ సంయుక్తంగా అధ్యయనం నిర్వహించాయి.

సీపీసీబీ ప్రకారం నీటి స్వచ్ఛత ప్రమాణాలు ఇవీ..
- మనుషులు తాగడానికి వినియోగించే నీటిలో కోలి బ్యాక్టీరియా ఎంపీఎన్‌ (మోస్ట్‌ పాపులర్‌ నంబర్‌) వంద మిల్లీ లీటర్లకు 50 లోపు ఉండాలి. పీహెచ్‌ శాతం 6.5 వరకు ఉండవచ్చు. లీటర్‌ నీటికి డీవో ఆరు మిల్లీ గ్రాములు, బీవోడీ 2 మిల్లీ గ్రాముల వరకు ఉండవచ్చు. 
మనుషులు స్నానానికి వినియోగించే నీటిలో కోలి బ్యాక్టీరియా ఎంపీఎన్‌ వంద మిల్లీలీటర్లకు 500 వరకు  ఉండవచ్చు. పీహెచ్‌ 6.5 శాతం వరకు ఉండవచ్చు. లీటర్‌ నీటికి డీవో 5 మిల్లీగ్రాములు, బీవోడీ మూడు మిల్లీ గ్రాముల వరకు ఉండవచ్చు. 
అడవి జంతువులు తాగడానికి, చేపల జీవనం, పెంపకానికి వినియోగించే నీటిలో పీహెచ్‌ 6.5 శాతం, డీవో లీటర్‌ నీటికి నాలుగు మిల్లీ గ్రాముల దాకా ఉండవచ్చు. 

కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం... 
- గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, నాగావళి, కుందూ, మానేరు, కిన్నెరసానిలో కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరినట్లు తాజా సర్వేలో వెల్లడైంది. 
- తెలుగు రాష్ట్రాల్లో ప్రవహించే నదుల్లో కోలి బ్యాక్టీరియా మోతాదు పరిమితి దాటింది. డీవో, బీవోడీ, పీహెచ్‌ శాతం కూడా అధికంగా ఉంది. శుద్ధి చేయకుండా నదీ జలాలను తాగితే మూత్రపిండాలు, శ్వాసకోస సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. 
తెలుగు రాష్ట్రాల్లో అన్ని నదులతో పోల్చితే తుంగభద్రలో కాలుష్య తీవ్రత అధికంగా ఉంది. తుంగభద్ర జలాల్లో ఘన వ్యర్థాలు ఒక లీటర్‌ నీటిలో గరిష్టంగా 347 మిల్లీగ్రాములున్నాయి. ఇష్టారాజ్యంగా గనుల తవ్వకం,  పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు చేరడమే దీనికి ప్రధాన కారణం. 
కుందూ నదిలో కోలి బ్యాక్టీరియా వంద మిల్లీ లీటర్లకు గరిష్టంగా 900(టి.కోలి 800, ఎఫ్‌.కోలి 100) ఉండటం గమనార్హం. 
- వంశధార నదీ జలాల్లో పీహెచ్, డీవో, బీవోడీ, టి.కోలి, ఎఫ్‌.కోలి, టీడీఎస్‌ శాతం ఇతర నదులతో పోల్చితే కాస్త తక్కువగా ఉన్నప్పటికీ శుద్ధి చేయకుండా తాగడం శ్రేయస్కరం కాదు.  
- నదీ జలాల్లో కాలుష్య తీవ్రత వల్ల వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. మత్స్య సంపద కూడా అంతరిస్తోంది. 

కాలుష్యానికి  ప్రధాన కారణాలు 
పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటిని నదుల్లోకి పెద్ద ఎత్తున వదలడం. 
విచ్చలవిడిగా గనుల తవ్వకం. 

ఏం జరుగుతుంది?
పరిస్థితులు ఇలాగే  కొనసాగితే నదీ జలాలు స్నానానికి కూడా పనికి రావు
శుద్ధి చేయని నదీ జలాలను తాగితే ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement