
మురుగు నీటిలోని భార లోహాల వల్ల ప్రమాదమని హెచ్చరిస్తున్న ఐసీఎంఆర్
కలుషిత నీటితో పండించిన పంటలు
కూడా కేన్సర్ కారకాలేనని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తాగునీటి జలాశయాల్లో కలుస్తున్న మురుగునీటి తో ప్రజల్లో కేన్సర్ ముప్పు పెరుగుతోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా నివేదికలో హెచ్చ రించింది. మురికి కాలు వలు, కలుషిత చెరువుల సమీపంలో నివసించే వారిలో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉందని వెల్లడించింది.
పారిశ్రామిక, మున్సిపల్ వ్యర్థాలతో కూడిన మురుగునీటిలో ఆర్సెనిక్, లెడ్, అల్యూమి నియం వంటి ప్రమాదకర భార లోహాలు అధిక స్థాయిల్లో ఉంటున్నాయని పేర్కొంది. మురుగునీటిలోని భార లోహాలు తాగునీటిని, వ్యవసాయానికి ఉపయోగించే నీటిని కూడా కలుషితం చేస్తున్నాయని.. ఈ నీటితో పండించిన పంటలు కూడా కేన్సర్ కారకాలుగా మారుతున్నాయని వివరించింది.
నివేదికలోని అంశాలు ఇలా..
ఐసీఎంఆర్ తాజా నివేదిక ప్రకారం చర్మ కేన్సర్, ఊపిరితిత్తుల కేన్సర్‌కు ఆర్సెనిక్ కారణం అవుతుండగా నాడీ వ్యవస్థను లెడ్ దెబ్బతీస్తూ కిడ్నీ సమస్యలను తెస్తోంది. అలాగే మూత్రపిండాలు, ఎముకలపై కాడ్మియం ప్రభావం చూపుతోంది. క్రోమియం కూడా కేన్సర్‌కు కారణమవుతోంది. అల్యూమినియం వంటి అధిక సాంద్రతగల లోహాలు కూడా శరీరంలో చేరి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తున్నట్లు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. భారలోహాలు శరీర కణాలు, డీఎన్‌ఏను దెబ్బతీస్తున్నాయని.. దీనివల్ల కేన్సర్‌తోపాటు మూత్రపిండాల వైఫల్యం, నాడీ సమస్యలు, రక్తహీనత వంటి రోగాలు వస్తున్నాయని అంటున్నారు.
రాష్ట్ర జలాశయాలు కాలుష్యమయం
రాష్ట్రంలో పట్టణ వ్యర్థాలు, మురుగునీరంతా సమీపంలోని జలాశయాల్లోకే విడుదలవుతోంది. ఇప్పటికే మూసీ నది, హుస్సేన్ సాగర్ వంటి జలాశయాలు తీవ్ర కాలుష్యంతో కొట్టుమిట్టాడుతుండగా కృష్ణా, గోదావరి నదులకు కూడా ఈ బెడద తప్పడం లేదు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని లక్సెట్టిపేట, మంచిర్యాల, గోదావరిఖని, భద్రాచలం తదితర పట్టణాల నుంచి వచ్చే మురు గునీరంతా నేరుగా నదిలో కలుస్తోంది. అలాగే కరీంనగర్‌లోని మురుగునీరు ఎగువ భాగంలో గోదావరి ఉపనది మానేరులో కలుస్తుండగా దిగువన మానేరు కాలువల గుండా మళ్లీ గోదావరిలో కలుస్తోంది. మరోవైపు కృష్ణా పరీవాహక ప్రాంత పట్టణాల్లోని మురుగునీరు కూడా నదిలోకి చేరుతోంది.