14 రోజులుగా బొగ్గు గనిలోనే 15 మంది.. | coal mine accident in meghalaya | Sakshi
Sakshi News home page

14 రోజులు 15 మంది

Published Thu, Dec 27 2018 4:08 AM | Last Updated on Thu, Dec 27 2018 12:16 PM

coal mine accident in meghalaya - Sakshi

గనిలో చిక్కుకున్న వారి కోసం సొరంగంలోకి దిగుతున్న సహాయక బృందం

న్యూఢిల్లీ: మేఘాలయలోని ఓ బొగ్గు గనిలో గత 14 రోజులుగా చిక్కుకున్న కార్మికుల పరిస్థితి ఇంకా తెలియరావడం లేదు. గనిలో నీటి ఉధృతి కారణంగా  సహాయక సిబ్బంది లోపలికి వెళ్లలేకపోతున్నారు. మరోవైపు బొగ్గుగనిలోని నీటిని తోడేసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గనిలోని నీటిని బయటకు పంప్‌ చేయడానికి హైపవర్‌ సబ్‌ మెర్సిబుల్‌ పంపులు కావాలని అధికారులు కోరినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకూ ఓ నిర్ణయం తీసుకోలేదు.

దీంతో గనిలోని కార్మికుల ప్రాణాలపై వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మేఘాలయలోని ఈస్ట్‌ జైంతా హిల్స్‌ జిల్లా లూమ్‌థారీ ప్రాంతంలోని ఓ అక్రమగనిలో డిసెంబర్‌ 13న ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గును వెలికితీస్తున్న క్రమంలో పక్కనే ఉన్న లైటైన్‌ నదీ ప్రవాహం గనిలోకి పోటెత్తింది. ఈ ఘటనలో 15 మంది లోపలే చిక్కుకోగా, ఐదుగురు మాత్రం ప్రవాహానికి ఎదురొడ్డి బయటపడగలిగారు.

పంపులపై బదులేది?
సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కమాండెంట్‌ ఎస్కే శాస్త్రి ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ..‘గనిలోని నీటిని తోడేసేందుకు కనీసం వంద హార్స్‌పవర్‌ ఉన్న 10 మోటార్‌ పంపులు కావాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మేం కేంద్రానికి లేఖ రాసినా ఇంతవరకూ జవాబు రాలేదు. మా దగ్గర ప్రస్తుతం 25 హార్స్‌పవర్‌ సామర్థ్యం ఉన్న రెండు పంపులు మాత్రమే ఉన్నాయి. దాదాపు 370 అడుగులు ఉన్న ఈ గని మధ్యలో 70 అడుగుల మేర నీరు చేరుకుంది. ఈ నీటిని తొలగిస్తేనే జాతీయ విపత్తు సహాయక బృందం (ఎన్డీఆర్‌ఎఫ్‌) సిబ్బంది లోపలకు పోగలరు. మేం గనిలోకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ నీటి ఉధృతి కారణంగా కుదరలేదు’ అని తెలిపారు. గని కార్మికుడొకరు బొగ్గును వెలికితీసే క్రమంలో గోడపై బలంగా కొట్టడంతో గనిలోకి లైటైన్‌ నది నీరు పోటెత్తి ఉంటుందని శాస్త్రి చెప్పారు.

‘ర్యాట్‌ హోల్‌’ తవ్వకం
తాజాగా కార్మికులు చిక్కుకున్న బొగ్గు గనిని ర్యాట్‌ హోల్‌ పద్ధతిలో తవ్వారు. ఈ విధానంలో తొలుత చిన్న పరిమాణంలో గుంతలను నిట్టనిలువుగా బొగ్గు కనిపించేవరకూ తవ్వుతారు. అనంతరం సన్నటి దారుల ద్వారా బొగ్గును పైకి తీసుకొస్తారు. అయితే ఈ విధానంలో పర్యావరణానికి నష్టం జరుగుతుండటం, కార్మికుల ప్రాణానికి ముప్పు ఉండటంతో మేఘాలయలో 2014లో ఈ ర్యాట్‌ హోల్‌ పద్ధతిని నిషేధిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఈస్ట్‌ జైంతా హిల్స్‌లో గని ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు ఈ వ్యవహారంపై మేఘాలయ ముఖ్యమంత్రి కన్రడ్‌.కె.సంగ్మా స్పందిస్తూ..‘కాలం వేగంగా కరిగిపోతోంది. పదిహేను మంది కార్మికులను రక్షించడానికి హైపవర్‌ సబ్‌మెర్సిబుల్‌ పంపులను ఇవ్వాలని కోల్‌ ఇండియాను కోరాం. వాళ్లు వీలైనంత త్వరగా సాయం చేస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపారు. ఈ గనిలోకి కార్మికులను పనికి దింపిన ఓ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న యజమాని కోసం గాలింపు జరుపుతున్నారు.

ఫొటోలకు పోజులా?
గని కార్మికులు చిక్కుకుపోయిన ఘటనపై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ స్పందించారు. 15 మంది కార్మికులు బొగ్గుగనిలో చిక్కుకుంటే ప్రధాని మోదీ మాత్రం అస్సాంలోని బోగీబీల్‌ వంతెనపై ఫొటోలకు పోజులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ‘ఓవైపు మేఘాలయలో 15 మంది కార్మికులు వరద నీటితో నిండిపోయిన గనిలో చిక్కుకుని శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్రధాని మాత్రం బోగీబీల్‌ వంతెనపై కెమెరాలకు ఫోజులు ఇస్తున్నారు. మోదీ ప్రభుత్వం హై ప్రెజరైజ్డ్‌ మోటార్‌ పంపులను అందించేం దుకు నిరాకరిస్తోంది. మోదీజీ.. దయచేసి ఈ కార్మికులను కాపాడండి’ అని ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement