షిల్లాంగ్: మేఘాలయలోని బొగ్గుగనిలో రెండు వారాల కింద చిక్కుకున్న 15 మందిని రక్షించేందుకు కిర్లోస్కర్ సంస్థ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. ఆ గనిలోని నీటిని తోడేందుకు అవసరమైన 100 హెచ్‌పీ మోటార్లను తాము సమకూరుస్తామని తెలిపింది. గని వద్ద పరిస్థితులను అంచనా వేసి, వారిని కాపాడేందుకు కిర్లోస్కర్‌కు చెందిన రెండు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాగా, గని నుంచి నీటిని ఎంత తోడినా నీటి మట్టాలు తగ్గకపోవడంతో ఆ ప్రక్రియను అధికారులు శనివారం నిలిపేసిన విషయం తెలిసిందే. గనిలోని నీటిని తోడేందుకు రెండు 25 హెచ్‌పీ పంపులు సరిపోవట్లేదని, అంతకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న పంపులు కావాల్సిందిగా మేఘాలయ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎన్డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎస్‌కే సింగ్ తెలిపారు.
గని నుంచి దుర్గంధం వెలువడుతుండటంతో గనిలో చిక్కుకున్న వారు చనిపోయి ఉండొచ్చన్న మీడియా కథనాలను ఎన్డీఆర్‌ఎఫ్ ఖండించింది. వారిని రక్షించే చర్యలు చేపడుతున్న గువాహటిలోని ఎన్డీఆర్‌ఎఫ్ బెటాలియన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మైనర్లు చనిపోయి ఉంటారని, వారి దేహాలు కుళ్లిపోవడం ప్రారంభమైందని తాను చెప్పినట్లు వస్తున్న కథనాలను ఎస్‌కే సింగ్ తప్పుపట్టారు. 48 గంటలుగా నీటిని తోడే ప్రక్రియ నిలిచిపోవడంతో గనిలో నిలిచిపోయిన నీటి వల్ల ఆ దుర్గంధం వస్తుందని స్పష్టం చేశారు. చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కృషిచేస్తున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment