గనిలోకి పంపేందుకు నీటి పంపులను సిద్ధంచేస్తున్న సహాయక సిబ్బంది
షిల్లాంగ్: మేఘాలయలోని గనిలో చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక కార్యక్రమాలు ఊపందుకున్నాయి. విశాఖలోని నేవీ బేస్ నుంచి బయలుదేరిన 15 మంది గజ ఈతగాళ్ల బృందం శనివారం పశ్చిమ జైంతియా జిల్లా లుంథారి గ్రామ సమీపంలోని గని వద్దకు చేరుకుంది. వీరి వద్ద నీటి అడుగున శోధించే రిమోట్ వాహనాలు తదితర అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. ఈ బృందానికి జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్) అధికారులు పరిస్థితి వివరించారు.
అలాగే, భువనేశ్వర్ నుంచి బయలుదేరిన ఈతగాళ్ల బృందంతోపాటు 10 శక్తివంతమైన కిర్లోస్కర్ మోటార్లు కూడా గని వద్దకు చేరుకున్నాయని జిల్లా ఎస్పీ సిల్వెస్టర్ నోంగ్‌టింగర్ తెలిపారు. వీరంతా కలిసి 370 అడుగుల లోతున్న గనిలో గల్లంతైన కార్మికుల జాడ కనుక్కునే పనిలో నిమగ్నమై ఉన్నారన్నారు. లిటీన్ నది మధ్యలో ఉన్న చిన్న గుట్టపై ఓ ప్రైవేట్ కంపెనీ అక్రమంగా బొగ్గు గని నడుపుతోంది. ఈ నెల 13వ తేదీన నది వరద అకస్మాత్తుగా గనిలోకి ప్రవేశించడంతో బొగ్గు తవ్వుతున్న కార్మికులు 15 మంది అందులో చిక్కుకుపోయారు. గనిలోతు 370 అడుగుల లోతు ఉండగా నీరు 170 అడుగుల వరకు ఉంటుందని ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రాంతంలో భూమికి 200 నుంచి 500 అడుగుల లోతులో బొగ్గు తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం.
బతికి ఉండేందుకు అవకాశమే లేదు
గనిలోని కార్మికులు తప్పించుకుని వచ్చేందుకు మార్గం లేదని ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడిన సాహిబ్ అలీ అనే కార్మికుడు తెలిపాడు. ఇతనిది అస్సాంలోని చిరంగ్ జిల్లా. ఆ రోజు ప్రమాదం నుంచి ప్రాణాలు దక్కించుకున్న మిగతా నలుగురూ పశ్చిమ గారో జిల్లాలోని తమ సొంతూళ్లకు వెళ్లిపోయారని అలీ తెలిపాడు. ‘ప్రమాదం జరిగిన రోజు 22 మంది వరకు పనిలో ఉన్నాం. కేవలం ఒకే మనిషి కూర్చునేందుకు వీలుండే లోతైన గుంతల్లో చాలామంది బొగ్గు తవ్వుతున్నారు.
ఉదయం 5 గంటలకే పని మొదలుపెట్టాం అయితే, 7 గంటల సమయంలో ఎన్నడూ లేనిది గనిలోకి కొత్త రకమైన గాలి వీచింది. కొద్దిసేపటికే పెద్ద శబ్దం చేస్తూ వరద నీరు గనిలోకి వెల్లువలా వచ్చింది. అతికష్టంమీద బయటకు రాగలిగా. ఆ రోజు ప్రమాదం నుంచి ప్రాణాలు దక్కించుకున్న నలుగురూ ఇనుప పెట్టెల్లో బొగ్గును నింపేవారే. గనిలో చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడేందుకు దారి లేదు. నీటి అడుగున శ్వాస పీల్చకుండా ఎవరైనా ఎంతకాలం ఉండగలరు?. నాకు తెలిసినంత వరకు గనిలో 17 మంది వరకు చిక్కుకున్నారు. సంప్రదాయం ప్రకారం అంతిమ క్రియలు జరిపేందుకు వారి మృతదేహాలైనా దొరుకుతాయని నా ఆశ’ అని అలీ అన్నాడు.
ర్యాట్‌హోల్‌లో రెక్కీ
నేవీతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌నకు చెందిన గజ ఈతగాళ్లు ప్రమాదం జరిగిన ర్యాట్ హోల్‌గా పిలిచే ఆ ఇరుకైన గని లోపలికి దిగి, నీటి మట్టం, కార్మికుల ఆచూకీ ఎలా కనుగొనాలనే విషయమై ఒక అంచనాకు వచ్చారు. ఆదివారం వేకువజాము నుంచే ఈ బృందాలు తమ పనిని ప్రారంభిస్తాయని ఎన్డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌కు చెందిన నిపుణులు కూడా సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. వీరితోపాటు పంజాబ్‌కు చెందిన గని ప్రమాదాల నిపుణుడు జస్వంత్ సింగ్ గిల్ కూడా సాయంగా అక్కడికి వచ్చారు. శక్తివంతమైన కిర్లోస్కర్ మోటార్లతో నీటిని తోడే ప్రక్రియ ఆదివారం ప్రారంభం కానుందని అధికారులు అంటున్నారు.
కూలీల బతుకులు కూల్చింది
సాహిబ్ అలీతోపాటు గని తవ్వకాల్లో పాల్గొంటున్న వారంతా నిరుపేదలు.. రిక్షా తొక్కుతూ, బరువులు మోస్తూ జీవనం సాగించేవారు. ఈ పనుల్లో సంపాదన కుటుంబపోషణకు సరిపోక కూలీ ఆశతో ప్రమాదకరమైన గని పనిలో చేరారు. అత్యంత ఇరుకైన, లోతైన గనిలో రోజంతా పనిచేస్తే రూ.2వేల వరకు చేతికందుతాయి. వేరే ప్రాంతాలకు చెందిన కార్మికులు రెండు మూడు వారాలపాటు ఈ పనిని కొనసాగించి, తిరిగి సొంతూళ్లకు వెళ్లిపోతారు. గనిలో గల్లంతైన వారిలో ఎక్కువ మంది పశ్చిమ గారో హిల్స్ జిల్లాకు చెందిన వారే. ఈ నెల 13వ తేదీన ప్రమాదం జరగ్గా గనిలో చిక్కుకున్న 15 మంది కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం 22వ తేదీన రూ.లక్ష చొప్పున తాత్కాలిక సాయం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment