ఖమ్మం కళకళలాడాలి | should be takes advantage the natural wealth in district | Sakshi
Sakshi News home page

ఖమ్మం కళకళలాడాలి

Published Sat, Sep 6 2014 1:43 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM

ఖమ్మం కళకళలాడాలి - Sakshi

ఖమ్మం కళకళలాడాలి

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా కళకళలాడాలని, ఇందుకోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. అపార సహజ సంపదను సద్వినియోగం చేసుకుని తెలంగాణకే తలమానికమయ్యేలా జిల్లాను అభివృద్ధి చేసుకుందామని అన్నారు. జిల్లాకు చెందిన మాజీమంత్రి, సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు వేలాది మంది అనుచరులు, ముఖ్య నాయకులతో కలిసి కేసీఆర్ సమక్షంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు.

 ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా అభివృద్ధిపై తనకున్న విజన్‌ను వివరించారు. జిల్లాలో ఉన్న అటవీ, సహజ సంపదలను సద్వినియోగం చేసుకోవాలని, గోదావరి జలాలు, బొగ్గును వినియోగించుకుని పక్కనే ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయేలా, ఔరా అనేలా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. జిల్లాలో లభించే ముడి ఇనుము నాణ్యత లేనిదని గతంలో ప్రచారం చేశారని, ఇటీవల సెయిల్ ఎండీ కలిసినప్పుడు బయ్యారంలో ఉన్న ఇనుము నెం.1 అని చెప్పారని, రూ. 30 వేల కోట్ల వ్యయంతో అక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారని  చెప్పారు. కొత్తగూడెం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు.

ఈ ప్రకటన చేసిన రోజే ఆయన తెలంగాణలో జిల్లాల పునర్నిర్మాణంపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో చర్చించడం గమనార్హం. ఈ నేపథ్యంలో కొత్తగూడెం కేంద్రంగా త్వరలో జిల్లా ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో త్వరలోనే మెడికల్ కళాశాల, కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. త్వరలోనే తాను ఖమ్మం వస్తానని చెప్పారు.

 సీఎం అయ్యాక ఆయన పలు జిల్లాల్లో పర్యటించినా, ఖమ్మం మాత్రం రాలేదు. ఖ మ్మంపై అసలు ఆయన ఎలాంటి చర్చ కూడా జరిపినట్టు కనిపించలేదు. కానీ, శుక్రవారం మాత్రం నవ్వుతూ తాను త్వరలోనే ఖమ్మం వస్తానని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక పార్టీలో చేరిన తుమ్మలను రాజకీయ దురంధరుడన్న కేసీఆర్.. ఆయన నాయకత్వం లో జిల్లా పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని చెప్పా రు. గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఇప్పుడు పార్టీలోకి వస్తున్న వారందరూ సమన్వయంతో తుమ్మల నాయకత్వంలో పనిచేయాలని సూచించారు. దీంతో జిల్లాలో పూర్తిస్థాయి పార్టీ బాధ్యతలను కేసీఆర్ తుమ్మ ల చేతిలో పెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 తుమ్మల నాకు మంచి మిత్రుడు...
 తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి తుమ్మల నాగేశ్వరరావు తనకు మంచి మిత్రుడని కేసీఆర్ అన్నారు. ‘తుమ్మల నాకు ఆప్తమిత్రుడు, చాలా సన్నిహితుడు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉన్నాం. ఇద్దరం 82లో పోటీ చేసి ఓడిపోయాం. కష్టాలు సుఖాలు చాలా పంచుకున్నాం. ఒత్తిళ్లకు లోనయ్యాం.’ అని వ్యాఖ్యానించారు. పార్టీలు వేరయినా తమ మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు మాత్రం కొనసాగాయని చెప్పారు. పార్టీలోకి రావాలని ఎన్నికలకు ముందే ఆయనతో మాట్లాడానని, ప్రజలు నిన్నే ఆదరిస్తారు... అప్పుడు జాయిన్ అవుదాంలే అని తుమ్మల చెప్పారని, ఆయన మాట నిజమైంది కాబట్టి మళ్లీ పార్టీలోకి తానే ఆహ్వానించానని కేసీఆర్ చెప్పారు.

దశాబ్దాలుగా రాజకీ యాల్లో ఉన్నా... మచ్చలేని నాయకుడిగా, వేలెత్తి చూపించలేని, నిప్పులాంటి వ్యక్తి నాగేశ్వరరావు అని ప్రశంసించారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో అట్టహాసంగా జరిగిన తుమ్మల టీఆర్‌ఎస్‌లో చేరిక కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేత, ఎంపీ కె. కేశవరావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు దిండిగల రాజేందర్, కొత్తగూడెం, వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, మదన్‌లాల్, కోరం కనకయ్య, పార్టీ నేతలు ఆర్జేసీ కృష్ణ, బాణోతు చంద్రావతి, బమ్మెర రామ్మూర్తి, పిడమర్తి రవి, తుమ్మలతో పాటు టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు మువ్వా విజయ్‌బాబు, ఎగ్గిడి అంజయ్య, తెలుగు రైతు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, తెలుగు విద్యార్థి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతనిప్పు కృష్ణచైతన్య, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ షేక్ మదార్‌సాహెబ్, బోడేపూడి రమేశ్‌బాబు, పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement