సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా తాగు, సాగునీటి కోసం వినియోగిస్తున్న నదీ జలాల కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా కడలి పాలవుతున్నట్లు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నదీ జలాలను మళ్లించకుంటే తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. దేశంలో సగటు వర్షపాతం, నదుల్లో ప్రవాహం, ఉపయోగించుకోదగిన జలాలు, ప్రస్తుతం వాడుకుంటున్న నీరు, భవిష్యత్ అవసరాలపై సీడబ్ల్యూసీ సమగ్రంగా అధ్యయనం చేసింది. అందులో ప్రధానాంశాలు ఇవీ..
► దేశంలో ఏటా సగటున 1,298.6 మి.మీ. వర్షపాతం కురుస్తోంది. వర్షపాతం రూపంలో 1,37,002.08 టీఎంసీల నీరు లభ్యమవుతోంది.
► వర్షపాతం వల్ల గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవాహం రూపంలో 70,591.75 టీఎంసీలు లభిస్తుండగా ప్రస్తుతం జలాశయాల ద్వారా 24,367.43 టీఎంసీలను ఉపయోగించుకుంటున్నాం.
అంటే ఏటా 46,224.32 టీఎంసీలు
కడలిలో కలుస్తున్నట్లు స్పష్టమవుతోంది. వాడుకుంటున్న నీటి కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా నదీ జలాలు కడలిలో కలుస్తున్నట్లు వెల్లడవుతోంది.
► దేశవ్యాప్తంగా వివిధ నదులపై నిర్మించిన 5,745 డ్యామ్‌ల నీటి నిల్వ సామర్థ్యం 9,103.34 టీఎంసీలు. ఈ డ్యామ్‌లలో నీటిని నిల్వ చేస్తూ సాగు, తాగునీటి అవసరాల కోసం 24,367.43 టీఎంసీలను వాడుకుంటున్నాం.
► ఆంధ్రప్రదేశ్‌లో 166 డ్యామ్‌ల నిల్వ సామర్థ్యం 983.59 టీఎంసీలు. 1.05 కోట్ల ఎకరాలకు నీళ్లందించేలా ఆయకట్టును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది.
► దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జలాశయాలను నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించకుంటే సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పవు.
► నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపర్చ కుంటే ఆహార ధాన్యాల దిగుబడి పెరగదు. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగకుంటే ఆహార సంక్షోభానికి దారి తీస్తుంది.
► దేశంలో ప్రజల రోజువారీ అవసరాలు, తాగునీటి కోసం తలసరి నీటి లభ్యత 2001లో 1,816 క్యూబిక్ మీటర్లు (వెయ్యి లీటర్లు ఒక క్యూబిక్ మీటర్‌కు సమానం) ఉంది. 2011 నాటికి 1,545 క్యూబిక్ మీటర్లకు, 2021 నాటికి 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోయింది. నదీ జలాలను మళ్లించకుంటే తలసరి నీటి లభ్యత 2031 నాటికి 1367 క్యూబిక్ మీటర్లకు, 2041 నాటికి 1282 క్యూబిక్ మీటర్లకు, 2051 నాటికి 1228 క్యూబిక్ మీటర్లకు తగ్గుపోతుంది. తాగు, రోజువారీ అవసరాల కోసం నీటి కొరత తీవ్రమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment